Advertisement


Home > Politics - Political News
మ‌ళ్లీ బాబే రావాలంటున్న వైసీపీ... ఎలాగంటే?

మా బిడ్డల భ‌విష్యత్ కోసం .... మ‌ళ్లీ నువ్వేరావాలి అని వైసీపీ ప్లెక్సీ ఇప్పుడెంత‌గానో ఆకట్టుకుంటోంది. ఈ ఫ్లెక్సీలో చంద్రబాబు న‌వ్వుతున్నట్టు నిజంగా నిజ జీవితంలో ఏనాడైనా న‌వ్వారా అనే అనుమానం వ‌చ్చేంత‌గా క‌నిపిస్తున్నారు. ఇదేమిటి జ‌గ‌న్ చిత్రం క‌దా ఉండాల్సింది అని ఎవ‌రైనా అనుకుంటారు. అవును మ‌రి... చంద్రబాబు మ‌ళ్లీ ప్రతిప‌క్షంలోకి రావాల‌ని వైసీపీ శ్రేణులు బ‌లంగా కోరుకుంటున్నాయి. చిత్రమైన ఈ ఫ్లెక్సీ గుంటూరుజిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలోని కొండ్లముట్ల ప్రజ‌లు త‌మ గ్రామంలో పెట్టారు. ఈ ఫ్లెక్సీలో చంద్రబాబు న‌వ్వే ప్రత్యేక ఆక‌ర్షణ‌. గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ప్రచారం సృజ‌నాత్మక‌త‌ను క‌న‌బ‌రిచింది.

విభ‌జిత రాష్ర్టానికి అనుభ‌వ‌జ్ఞుడైన చంద్రబాబు పాల‌న ఎంత అవ‌స‌ర‌మో జ‌నాల్లోకి టీడీపీ శ్రేణులు బ‌లంగా తీసుకెళ్లాయి. ఈ సంద‌ర్భంగా టీడీపీ ఎన్నిక‌ల నినాదాలు ప్రజ‌ల‌ను ఆలోచింప‌జేసేలా, ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. జాబు రావాలంటే, నిరుద్యోగ భృతి రూ.2వేలు ద‌క్కాలంటే, రైతురుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే, 24 గంట‌లూ విద్యుత్ స‌ర‌ఫ‌రా కావాలంటే, రాష్ర్టానికి పెద్ద ఎత్తున ప‌రిశ్రమ‌లు రావాలంటే, రాష్ర్టానికి ప్రత్యేకహోదా రావాలంటే, వెనుక‌బ‌డిన జిల్లాల‌కు బందేల్‌ఖండ్ త‌ర‌హా ప్యాకేజీ రావాలంటే... చంద్రబాబు అధికారంలోకి రావాల‌ని టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించాయి.

టీడీపీ హామీలిచ్చిన వాటి సంగ‌తేమోగాని... చంద్రబాబుకు మాత్రం సీఎం హోదా ద‌క్కింది. ఇప్పటికీ రైతు రుణ‌మాఫీ రెండు కంతులు చెల్లించాల్సి ఉంది. నిరుద్యోగ భృతి నిన్నమొన్నటి వ‌ర‌కు ఊసేలేదు. ఆరేడు నెల‌ల్లో ఎన్నిక‌లు ఉన్న త‌రుణంలో నెల‌కు రూ.వెయ్యి చొప్పున 12 ల‌క్షల మంది నిరుద్యోగుల‌కు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రత్యేకహోదా హూస్ కాకి. ఇంటికో ఉద్యోగం కథ కంచికి. హామీ ఇవ్వని వాటిలో లోకేష్‌కు మంత్రివ‌ర్గంలో కొలువు ల‌భించింది. ఈ విష‌యంలో చంద్రబాబు అభినంద‌నీయుడు. 24 గంట‌లూ విద్యుత్ స‌ర‌ఫ‌రా భేష్‌.

వైసీపీనేత జ‌గ‌న్ ప్రతి బ‌హిరంగ స‌భ‌లో చంద్రబాబు హామీల‌ను గుర్తుచేస్తూ నెర‌వేర్చాడా అక్కా, అన్నా, త‌మ్మడు, అమ్మా, చెల్లెమ్మా అని వ‌రుస‌లు పెట్టి పిలుస్తూ... వారి నుంచి కాదు, లేదు అని జ‌వాబులు చెప్పిస్తూ ప్రచారాన్ని ర‌క్తిక‌ట్టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలోని కొండ్రముట్ల గ్రామ‌స్తులు మా బిడ్డల భ‌విష్యత్ కోసం... ప్రతిప‌క్షంలోకి మ‌ళ్లీ నువ్వేరావాలి.. అని పేరు లేకుండా కేవ‌లం చంద్రబాబు భారీ ముఖ చిత్రాన్ని ఫ్లెక్సీపై ప్రద‌ర్శించారు. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.
-సొదుం