
ఎవరైనా ఇల్లు ఖాళీ చేయాలంటే ఏం చేస్తారు.. ఓ లారీ తీసుకొచ్చి సామానంతా అందులో సర్దుకుంటారు. ఏకంగా ఇంటినే వాహనంపైకి ఎక్కిస్తే ఎలా ఉంటుంది? అమెరికాలో ఇలాంటి ఘటనే జరిగింది. పురాతనమైన తన ఇంటిని యజమాని ఏకంగా గాల్లో లేపాడు. మరో చోటికి తరలించాడు. అలా అని అదేదో చిన్న ఇల్లు కాదు, పెద్ద భవనం.
శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫ్రాంక్లిన్ స్ట్రీట్ లో ఉన్న 807 నంబర్ ఇంటికి చాలా చరిత్ర ఉంది. అది 139 ఏళ్ల నాటి కట్టడం. దాన్ని వదిలేసి మరో ఇంటికి వెళ్లడానికి యజమానికి ఇష్టంలేదు. అందుకే పునాదులతో పాటు ఆ ఇంటిని మరో చోటుకి తరలించాడు.
లేటెస్ట్ టెక్నాలజీ ఆధారంగా ఆ ఇంటిని లేపి, భారీ వాహనాలపై పెట్టి.. 6 బ్లాక్స్ అవతల (దాదాపు అర కిలోమీటర్) ఉన్న మరో చోటికి తన ఇంటిని మార్చుకున్నాడు.
6 బ్లాకుల అవతలకి ఈ ఇంటిని తరలించేందుకు ఏకంగా 15 ఏజెన్సీల అనుమతి తీసుకున్నారు. చుట్టుపక్కల ఉంటున్న వ్యక్తుల అనుమతి తీసుకున్నారు. తరలింపు సమయంలో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.
ఈ ఇంటిని తరలించడం కోసం కొన్ని చెట్లను కొంతమేరకు కట్ చేయాల్సి వచ్చింది. పార్కింగ్ ప్రాంతాల్ని విస్తరించడంతో పాటు.. ట్రాఫిక్ లైట్లను మార్చాల్సి వచ్చింది. 6 బెడ్ రూమ్స్ తో ఉన్న ఈ విలాసవంతమైన ఇంటిని మరో చోటికి మార్చేందుకు ఓనర్ కు అక్షరాలా 4 లక్షల డాలర్లు ఖర్చు అయింది.