Advertisement


Home > Politics - Political News
మానవడి పేరుతో సానుభూతి పొందడమెందుకు?

పాలకులెవరైనా సరే ముఖ్యమంత్రి కావొచ్చు, ప్రధాని కావొచ్చు జనరంజకంగా పరిపాలించి, మంచి పనులు చేసి ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటారు. అదే సరైన విధానం కూడా. ఇలాంటివారు మాటలు తక్కువగా మాట్లాడుతూ పనులు ఎక్కువ చేస్తుంటారు. లేని గొప్పలు చెప్పుకోరు. ప్రజలు ఊహల్లో తేలిపోయేలా చేయరు. 

అరచేతిలో స్వర్గం చూపించరు. కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు విరుద్ధం. గత మూడేళ్లుగా మాటలు ఎక్కువ చెబుతున్నారు. విభజన తరువాత ఆర్థిక కష్టాల్లో ఏపీలో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాక ఆత్మస్తుతి, పరనింద ఎక్కువయ్యాయి.

చాలా విషయాల్లో విఫలమైన చంద్రబాబు ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకుగాను ప్రజలకు తనపట్ల సానుభూతి కలిగేలా మాట్లాడుతున్నారు. 'ధృశ్యం' సినిమాలో హీరో వెంకటేష్‌ చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పి జనం 'నిజమే' అనుకునేటట్లు ఎలా చేస్తాడో, మాటలతో దృశ్యాన్ని ఎలా కళ్లకు కడతాడో చంద్రబాబూ అలాగే చేస్తున్నారు.

ఏపీ అభివృద్ధి కోసం తాను విపరీతంగా కష్టపడుతున్నానని, తనమాదిరిగా కష్టపడి పనిచేసేవాడు దేశంలోనే లేడని అదే పనిగా చెబుతుంటారు. ఇప్పటివరకు ఇక్క అడుగూ ముందుకు పడని అమరావతి నిర్మాణం గురించి ఎన్ని 'సుందరమైన కతలు' చెప్పారో తెలిసిందే.

చంద్రబాబు అతిశయోక్తులు, ఆత్మస్తుతి ఎప్పుడు తగ్గించుకుంటారో అర్థం కావడంలేదు. ఆయన గొప్పలకు అంతుపొంతూ ఉండదు. తనను దైవాంశసంభూతుడిగా చిత్రీకరించుకుంటారు. అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి నిర్మాణం గురించి అదేపనిగా ఊదరగొట్టారు.

గ్రాఫిక్స్‌ చిత్రాలు విడుదల చేసి అరచేతిలో స్వర్గం చూపించారు. ఈ ప్రహసనం కొన్నాళ్లు కొనసాగించాక రాజధాని నిర్మాణం గందరగోళమైంది. క్లారిటీ లేకుండాపోయింది. 'ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు' అనే ప్రచారం రానురాను ఎక్కువైపోతోంది.     

అసలు 'కష్టపడటం' అనే ప్రచారమేమిటో అర్థం కాకుండా ఉంది. ఉద్యోగులు తమ పని తాము చేస్తారు. అధికారులు తమ పని తాము చేస్తారు. ఎక్కడైనా ఎవరి విధులు వారు నిర్వహిస్తారు. ఇది సహజం. అలాగే ముఖ్యమంత్రి తన పని తాను చేస్తాడు. చేయాలి కూడా. ఇది సహజమే కదా. దీనికి పెద్ద బిల్డప్‌ ఇవ్వడం ఎందుకు? అధికారం చెలాయించాలనే కదా ముఖ్యమంత్రి పీఠం ఎక్కింది. 

ఎంతో ఇష్టపడి ఆ పీఠం ఎక్కినప్పుడు అంత కష్టపడుతున్నాను... ఇంత కష్టపడుతున్నాను అని ప్రచారం చేసుకోవడం ఎందుకు? పార్టీ సభల్లో అయినా, ప్రభుత్వ కార్యక్రమాల్లోనైనా ఇదే రికార్డు వినిపిస్తుంటారు. తాను కష్టపడుతున్నా మంత్రులు, అధికారులు కష్టపడటంలేదంటారు. 'చంద్రబాబు కష్టజీవి' అని సామాన్యులు అనుకోవాలని, సానుభూతి చూపాలని కోరుకుంటారు.

కొందరు నాయకులు చంద్రబాబు కష్టంపై అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. కాని ఆయన కష్టం కేంద్రం నుంచి నిధులు రప్పించడంలో, ప్రత్యేక హోదా సాధించడంలో వర్కవుట్‌ అవడంలేదు. చంద్రబాబు తన మనుమడు దేవాంశ్‌ పేరుతో సానుభూతి పొందాలని ప్రయత్నిస్తుంటారు. 'నేను మనుమడిని కూడా చూడకుండా, వాడితో గడపకుండా రాష్ట్రం కోసం కష్టపడుతున్నాను' అని ప్రచారం చేసుకుంటున్నారు.

తాజాగా ఏపీసీఆర్‌డిఏ సమావేశంలో మాట్లాడుతూ తాను ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకుగాను మనుమడిని కూడా చూడటానికి వెళ్లకుండా అమరావతలోనే ఉండి కష్టపడుతున్నానని చెప్పారు. శని, ఆదివారాల్లోనూ హైదరాబాద్‌ వెళ్లడంలేదన్నారు.

విమానంలో హైదరాబాద్‌ ఎంతలోకి వెళ్లాలి? ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న చంద్రబాబుకు మనుమడిని ప్రత్యక్షంగా చూసేందుకు ఎక్కువ సమయం దొరక్కపోవచ్చు. కాని సినిమా చూసినట్లు చూసే అవకాశం ఉంది కదా.

ఒక సందర్భంలో మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ 'ముఖ్యమంత్రి ఎంతగా కష్టపడుతున్నారంటే... చివరకు తన మనవడిని కూడా చూసుకోలేపోతున్నారు' అని బాధ పడ్డారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇంట్లో వివాహానికి హైదరాబాద్‌ వెళ్లిన బాబు ఇంటికెళ్లి మనవడిని ఎత్తుకోవాలని చూస్తే వాడు ఏడుపు లంకించుకొని దగ్గరకే రాలేదట...!

ఈ విషయం లోకేష్‌ గంటాకు చెబితే ఈయన చాలా బాధపడ్డాట్ట...! బాధ్యతల ఒత్తిడితో, సమయం దొరక్క పిల్లలతో గడపలేని ఉద్యోగులు, అధికారులు అనేకమంది ఉన్నారు. ఇది సహజమైన విషయం. వారానికోసారి మాత్రమే పిల్లలను చూసుకునేవారున్నారు.

పిల్లలు నిద్ర లేవకముందే ఆఫీసుకు వెళ్లి వాళ్లు పడుకున్న తరువాత వచ్చేవారు చాలామంది ఉన్నారు. పిల్లలతో గడపలేకపోవడం బాధే. కాని అదేపనిగా అందరికీ చెప్పుకోరు కదా. ఇదంతా పార్ట్‌ ఆఫ్‌ ది లైఫ్‌. చంద్రబాబుకైనా ఇంతే...! మరి సానుభూతి కోసం ఆరాటం ఎందుకు?