cloudfront

Advertisement


Home > Politics - Political News

మంత్రులే కాదు అవినీతి తవ్వే గూఢచారులు

మంత్రులే కాదు అవినీతి తవ్వే గూఢచారులు

ఇటీవల గెలిచిన 22 మంది టీడీపీ ఎంఎల్‌ఏలు పార్టీ ఓటమికి ప్రభల కారకుడైన 23వ ఎంఎల్‌ఏ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట కలుసుకున్నారు. ఏఒక్కరి మోములో ఓటమిని జీర్ణించుకోలేనితనం ఇంకా వీడిపోలేదు. దోచుకుతినే ఆత్రతపోలేదు. ఐదేళ్లూ చేతులు ముడుచుకుని కూర్చోవల్సిందేనా అనే పెనుదిగులు వారి ముఖాల్లో కరాళ నృత్యం చేస్తునే ఉంది. అందరికంటే పార్టీ అధినేత బాబు ఏదో మీదకు రాబోతున్నదనే భయంతో, అందరిని కలుపుకునే ఆత్రంలో అనుక్షణం తత్తరపాటుతో ఉన్నారు. కొత్తసర్కార్‌ ఎదుట సభలో మనపాత్ర ఎలాఉండాలని చర్చించుకున్నారు. 22 మంది ఎంఎల్‌ఏల్లో పప్పుసుద్ధ లోకేష్‌, బుల్‌బులే బాలకృష్ణలు సమావేశానికి వచ్చినా రాకపోయినా ఒక్కటే. పార్టీకి పెద్ద ఉత్సవవిగ్రహాలే. వారు నోరువిప్పితే మిగిలినవారికి వినోదం క్షణాల్లో కళ్లముందే ఆరంభం అయిపోతుంది. ఆ ఇద్దరికి బాబు ఎంత నూరిపోసారో ఏమో? ఇద్దరు మౌనంగా వినడం వరకే అన్నట్లు బిక్కముఖాలేసేసారు.

ఇక మహా సీనియర్‌నని తనకు తానే  సర్టిఫికెట్‌ ఇచ్చుకున్న బాబు సభలో ఎలా వ్యవహరించాలి? కలసికట్టుగా వైకాపాతో ఎలా నెట్టుకురావాలి? అనేది చర్చించారు. వింటున్న సీనియర్లు అసహనంగా కడచిన ఐదేళ్లూ  వైకాపాను ఎన్ని హింసలపాలు చేసామో గుర్తుకు తెచ్చుకున్నారు. దెబ్బలు మీద దెబ్బలు తిన్న పులుల్లా 151 మంది బలంతో కొలువు తీరుతున్న పార్టీ వైకాపా. ఐదేళ్లూ లక్షలకోట్లలో దోచుకునే భారీస్కాముల్లో మునిగితేలిపోయి ఇంకా వారిని ఎదుర్కోవడం ఆషామాషీ వ్యవహారం కాదని ఎవరికివారే లోలోపల అనుకున్నారు. ఆపైన తప్పదని బాబు మాటలు వినేందుకు చెవులు రిక్కించారు. పార్టీని జనాల్లో భ్రష్టుపట్టించిన బాబు క్యాడర్‌ చెదరకుండా మభ్యపెట్టి మారేడుకాయ చేయాలనే పేదల సంక్షేమంకు భంగం కలిగించేలా వైకాపా చేస్తే సహించొద్దని తొలిమాటగా చెప్పారు.

ఇటీవల మనకార్యకర్తలపై జరిగిన దాడులను సభ దృష్టికి తీసుకుపోయి తద్వారా జనాల్లో చాటుదాం... ప్రాజెక్టులను ఆపకుండా సాగేలా చేయాలని చెబుదాం... వైకాపాకు అవగాహనా లోపం, చెప్పుడు మాటలు వినడం కూడదని వారికి తెలిసేలా తెలియచేద్దాం. సభలో ఇలా స్పందించడమే మనప్రథమ కర్తవ్యం అన్నట్లు మాట్లాడారు. విన్నవారు ఈదానికి ఈ సమావేశం ఎందుకు అన్నట్లుగా సభలోకి వెళ్లేముందు ఒకమాటగా చెప్పుకుంటే సరిపోయేది అన్నట్లు అసహనంగా తలలు పంకించేసారు. ఒకరిద్దరు సభలో ఏమిఅడగాలో, ఎలా అధికారపార్టీని నిలదీయాలో తమవంతు చెప్పుకున్నారు. వాటిని బాబు తప్పదని స్వీకరించినట్లు తలూపేసారు.

పార్టీలోనే దుర్గుణాలపుట్టగా పేరుపడ్డ చంద్రబాబు ఎవరి ఆధిక్యతను భరించలేని తనంలో ర్యాంకుమార్కులు సంపాదించారు. బాబు సభలో మాట్లాడాలంటే స్పీకర్‌ తమ్మినేని అనుమతి అవసరం. తమ్మినేని వివాదస్పదుడు కారు కనుక తమ్మినేని వలన బాబు ఎలాంటి ఇబ్బందులకు గురికారు. అప్పట్లో టీడీపీలో అంకితభావంతో ఉండే తమ్మినేనిని శ్రీకాకుళం దివంగతనేత ఎర్రంనాయుడు చెప్పుడు మాటలు విని బాబు దూరంపెట్టారు. 15ఏళ్లపాటు తమ్మినేనిని రాజకీయ నిరుద్యోగిని చేసారు. బాబు ఈసడింపులు కారణంగా తమ్మినేని పీఆర్‌పీలోకి వెళ్లిపోయారు. ఆతర్వాత టీడీపీలో తిరిగిచేరినా బాబు తమ్మినేనిని కాదని ఆయన మేనల్లుడు కూన రవి కుమార్‌ను ప్రత్యేకంగా చూడడంతో తమ్మినేని టీడీపీలో పొమ్మనలేక పొగబెడుతున్నారని గ్రహించి వైకాపాలోకి వెళ్లిపోయారు. చెప్పుడుమాటలు వినడమనే దుర్గుణాన్ని బాబు చెవి ఒగ్గుతారని చెప్పడానికే ఇక్కడ ఈ సంఘటనను గుర్తుచేయాల్సి వచ్చింది.

బాబు సర్కారులో మంత్రి రావెల కిషోర్‌బాబు నీటుగా డ్రస్‌ చేసుకుంటే భరించలేకే ఆపదవిలోంచి తొలగించారనే నిజం ఆనాడే పార్టీలో రాజుకుంది. నేటి స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ లోగడ బాబు సర్కారులో మంత్రిగా పనిచేసారు. బాబుతో బాటు అమెరికా పర్యటనకు ఒకసారి వెళ్లారు. తమ్మినేని సూటు బూటు వేసుకుని మరీ దిగారు. తమ్మినేనే కాబోలు ఏపీ సీం అని అక్కడ తెల్లోళ్లు తమ్మినేనికి బొకేలు, ఇవ్వవల్సిన కిస్సులు ఏకబిగిన ఇచ్చేసారు. ఆవెనుక వరద బాధితుడులా ఉన్న చంద్రబాబు ఆగ్రహంగా తమ్మినేనిని చూసారు. అక్కడ  తెలుగోళ్లు ఆ ఇంగ్లిషోళ్లకు ఈయన సీఎం కాదు ఆయనే చంద్రబాబు చెప్పారు. దాంతో తమ్మినేని నుంచి బొకేలు తీసుకుని బాబు చేతిలో పెట్టేసారు. అమెరికా నుంచి వచ్చాక తమ్మినేనికి మంత్రిశాఖ మార్చేసి సమాచారశాఖలో నెట్టేసారు.

మనిషి పతనానికి ఏఏ దుర్గుణాలు ఉంటాయో అవన్నీ బాబులో నిక్షిప్తమై ఉన్నాయి అని ఆపార్టీలో అందరికి తెలుసు. తను వదులుకోలేని దుర్గుణాలను ప్రత్యర్ధులకున్నట్లు బాబే ఆరోపిస్తుంటారు. అది ఆయన సహజనైజమనే చెప్పాలి. ఇక సభలో సీఎం సీటులో జగన్‌ను బాబు ఏమాత్రం భరించలేరు. తన సర్కారులో వసపిట్టలా ప్రతిపక్షనేత జగన్‌ సర్కారు అవినీతి మూలాలు కదిపేలా మాట్లాడేవ్యక్తి. ఇప్పుడు అధికారబలంతో సీఎంగా మరింతగా మాటల్ని పదునెక్కిస్తాడు, చేతల్లో  సీబీఐ విచారణలు చేయిస్తాడనే బితుకులో బాబు పరిస్థితి ఉంది. కడచిన ఐదేళ్లు అనేకానేకమైన సందర్భాల్లో వైకాపా సభ్యులను ఇడుముల పాలుచేస్తిని, వారు వాటిని నిత్యం తలచుకుంటారే తప్ప గాలికి వదిలేయరు అనే బితుకు బాబులో నిక్షిప్తమై ఉంది.

ఇప్పుడు ప్రధానంగా టీడీపీని పట్టిపీడిస్తున్నది ఓటమికి కారకుడు చంద్రబాబే. ఆయన ఐదేళ్లపాలన రాక్షసత్వం పులుముకుంది. అధికార దర్పంతో ఎవడ్రా నాకు చెప్పేదన్నట్లు అహంకారంతో పెట్రేగిపోయారు. అందుకే తేరుకోలేనంత చిత్తుగా ఓడారు. అలాంటప్పుడు పార్టీకి రాజీనామా చేయాల్సింది. 23 సంఖ్యకు పడిపోయిన ఘోరఓటమితో సర్వసంగ పరిత్యాగి అయిపోవల్సిందిపోయి తగుదునమ్మా అని పార్టీ చూరుపట్టుకుని వేలాడడం, సమావేశాలు పెట్టడం పార్టీలో పలువురు పెదాలు విరుస్తున్నారు. పార్టీకి ఇంకా బాబు దరిద్రంపోదా అని నొసలు నొక్కుకుంటున్నారు. పార్టీలో ఏమి జరుగుతోంది? ఏమనుకుంటున్నారు? అనేది బాబు పసిగడుతునే ఉన్నారు. బయటికి మాత్రం చేయాల్సిన తాటాకుచప్పుళ్లు అదేపనిగా చేసేస్తున్నారు. గెలిచిన ఎంఎల్‌ఏలు గుప్పిట్లోంచి జారిపోకుండా కాపాడుకోవాలి. ఆపైన క్యాడర్‌ను మసిబూసి మారేడుకాయ చేయాలనే యోచనను కనబరుస్తున్నట్లు పార్టీలో ప్రతిఒక్కరు ఈసరికే గ్రహించేసారు.

అధికారపార్టీ తొలిక్యాబినెట్‌ మీట్‌ అందులో జగన్‌ తీసుకున్న వైకాపా పాదయాత్ర హామీల పరిష్కారాలు బాబు అండ్‌కోని గుబులు పుట్టించాయి. చిన్నతరగతి ఉద్యోగులకు ఇస్తామన్నది ఏమీకానట్టు ముందు వెనుకా చూడకుండా దబాయించి పెంచడం తట్టుకోలేని విధంగా ఉంది. బాబు తను ఇక ఏమిచెప్పి జనాల్లోకి పోగలను అనిపించింది. జగన్‌కు అధికారం ఇచ్చిన పదిరోజుల్లో జనాల్లో మరింత అలుముకుంటున్నాడు. ఇబ్బడిముబ్బడిగా జీతాలు పెంచేసారు. వెయ్యిరూపాయిలు పెంచడానికి ఏమితమాషాగా ఉందా అని  తను నిలదీసిన తీరును గుర్తుచేసుకుని చాలా తప్పుచేసాను అని బాబు ఒకింత విలవిలలాడారు. ఆనాడు వైయస్‌ ప్రజల మనిషి కావడానికి ఆయన చేతికి ఎముక లేదన్నట్లు ఆర్థిక సంక్షేమపథకాల వెల్లువతో వెల్లువెత్తారు. ఇప్పుడు వైయస్‌ బిడ్డ జగన్‌ రెండింతలు ఇచ్చినమాటపై జీతభత్యాలు పెంపులో తనో పెద్దచేయి అనిపించుకుంటున్నారని బాబు గుర్తించారు.

ఇవన్నీ ఒకెత్తు. అదే క్యాబినెట్‌లో మంత్రులను ఉద్దేశించి జగన్‌ చెప్పిన మాటలతూటాలు నిద్రపోనీయడంలేదు. రెండున్నర ఏళ్లు మంత్రిపదవి గ్యారెంటీ అనుకోవద్దు. అవినీతి మరక ఏమంత్రికి అంటిందో వెంటనే ఉద్వాసన తప్పదు. అందులో ఎంతటి వారినైనా ఉపేక్షించను. అలాంటివారు కుంయో మొర్రో అనాల్సిందే అని కరాకండిగా చెప్పడం బాబుకు నిద్రపోనీయడం లేదు. పైగా, మీశాఖల్లో గతసర్కారు వెలగ బెట్టిన దుబారా, ముఖ్యంగా చిన్నా పెద్దా అవినీతి, మొత్తం తవ్వితీసి ఆధారాలతో నాముందు పెట్టాల్సిందే. అదంతా సభా ముఖంగా జనాల్లోకి తీసుకుపోదాం. ఇవన్నీ చంద్రబాబు అండ్‌కోని సేద తీర్చుకోకుండా చేస్తున్నాయి. మంత్రులు తలపెట్టి తవ్వితే, అన్ని శాఖల్లో బాబు అండ్‌కో కబందహస్తం భారీగా కనిపించి తీరుతుంది.

తిన్నదంతా కక్కించేలా ఉంది కొత్తసర్కారు అనే బితుకు మాజీమంత్రులకు, మాజీ ఎంఎల్‌ఏలకు వారందరిచే తినిపించి సుష్టుగా బొక్కేసిన బాబుకు నిద్రపోనీయడం లేదు. జగన్‌మాటలు విన్న మంత్రులు అంతా తలూపేరేగాని కోటానుకోట్లు వెచ్చించి ఎన్నికల్లో గెలిచింది సుపరిపాలన కోసమా? ఖర్చులైనా రాబట్టుకోవాలి కదా అని తమలో ఉన్న ఆశలను జగన్‌ ముందు బయటపెట్టే సాహసం ఏఒక్కరు చేయలేదు. అవినీతి సొమ్ముకంటే మంత్రిపదవి దక్కింది చాలన్నట్లు వారు తమవిధేయత జగన్‌కు కనబరచడం బాబుకు చెడ్డచిరాకు అనిపించింది. పైగా, మంత్రులను గూఢచారులుగా వాడడం అనేది ఏ రాష్ట్రనేత కూడా చేయని విధానాన్ని ఈ కుర్రనేత జగన్‌ ఏమాత్రం జంకుగొంకు లేకుండా ప్రవేశపెట్టాడు. జగన్‌ పదిరోజులు చేసిన పనులకు జనాలు ఆహా! ఓహో!! అంటున్నారని వార్తలు రాష్ట్రంలో వైరల్‌ అవుతున్నాయి. ఆపార్టీ మరింతగా జనాల్లో పాతుకుపోతుంది. బాప్‌రే జగన్‌ పులిమీద పుట్రయ్యాడని బాబుకు తీవ్ర మనస్థాపంగానే ఉంది.

జగన్‌ ఇష్టానుసారంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తడబాటుగానే ఉన్నారని బాబు ఎంఎల్‌ఏలు చెప్పారు. బాబు పెద్దగా పట్టించుకోలేదు. అందుకు కారణం జగన్‌ తడబాటుగా ఐదేళ్లలో సభలో ఏనాడు లేరు. అలాగే పలుజనయాత్రలు చేసినప్పుడు కూడా హామీలు వర్షం కురిపిస్తునే ఉండేవారు. ఆప్పుడు టీడీపీ మంత్రులు ఆహామీలు నేరవేర్చాలంటే పదిరాష్ట్రాల ఖజానాలు ఇక్కడ ఖర్చుచేసినా సరిపోవని ఎద్దేవా చేసేవారు. కానీ, బాబు మాత్రం ఏమో జగన్‌ తండ్రి రియంబర్సు ఆరోగ్యశ్రీ వంటి భారీ పథకాలు ఏమీకానట్లు చేసి చూపారు అని మనస్సులో అనుకునేవారు. బయటకి మాత్రం మంత్రుల మాటలకు చిర్నవ్వులు చిందించేవారు.

మరోవైపు చంద్రన్న పచ్చమీడియా లేనిపోని రాతలకు లోగడ తెగబడ్డట్లు ఇప్పుడు సాహసించడంలేదు. అందుకు కారణం అసత్యాలు పచ్చమీడియా రాస్తే కోర్టులకు ఈడుద్దాం అని సీఎం హోదాలో జగన్‌ చెప్పడంతో పచ్చమీడియా పచ్చరాతలను ఒకింత దూరంపెట్టింది. ఇప్పుడు లేనిపోనివి రాస్తే మూలిగే నక్కలా అయిపోయిన టీడీపీకి వీసమెత్తు లాభంలేదు. ఈ రాతలను, జగన్‌ కుటుంబంపై రాసిన రాతల క్లిప్పులు కలిపి కొట్టు కావేటిరంగా అని కోర్టుల్లో జగన్‌ కేసులు వేస్తే మొదటికే మోసం ఎందుకొచ్చిన ఎల్లోరాతలు అని కలాలు తాత్కాలికంగా మూసేసారు. బాబుకు ప్రచారం యావకూడా కలిసిరాకుండా పోయింది. ఓడిపోతే ఎన్నిచిక్కులు వచ్చి ముసిరేస్తున్నాయి అని బాబు విలవిలమంటున్నారు. ఆపార్టీ వారు కూడా నొసలు నొక్కుకుంటున్నారు.
-యర్నాగుల సుధాకరరావు

ఇలాంటి డ్రామాలు టీడీపీకి కొత్తేం కాదు సుమా!