cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మరీ ఇంత అయోమయపు రాతలా?

మరీ ఇంత అయోమయపు రాతలా?

జర్నలిస్ట్ అన్నాక ఓ కచ్చితమైన ఆలోచనకు రావాలి. ఆ తరువాతే ఏ కాలమ్ అయినా వండి వార్చాలి. ఆ ఆలోచన తప్పు కావచ్చు. ఒప్పుకావచ్చు. కానీ స్థిరమైన ఆలోచన అవసరం. అలా కాకుండా ఇలా అయివుంటుందేమో? ఇలా ఆలోచిస్తున్నారేమో? అనుకుంటూ తన అయోమయపు ఆలోచనలు అన్నీ కాగితం మీద పెట్టి చదివేవాళ్లను మరింత అయోమయానికి గురి చేయకూడదు. 

అలాగే అసలు అసలు ఇదే జరిగి వుంటుంది అని ఓ నిర్ణయానికి వచ్చి కాలమ్ రాస్తున్న తరువాత అదే కాలమ్ లో మళ్లీ దానికి వ్యతిరేక భావనలను అస్సలు కుమ్మరించకూడదు. అయితే ఇవన్నీ నికార్సయిన జర్నలిజం సంగతులు. కావాలని ప్రతివారం యాంటీజగన్ మూవ్ మెంట్ అన్నది తలకెత్తుకునేవారికి చెప్పేవి కావు.  ఈవారం కొత్తపలుకులో 'జ్యోతి' ఆర్కే చాలా అయోమయపు రాతలు రాసారు.

రాసిన పాయింట్లు మూడు. ఒకటి తెలుగునాట భాజపా వ్యూహం. అలాగే న్యాయవ్యవస్థపై వైకాపా జనాల విమర్శలు..ముచ్చటగా మూడోది వైకాపా-భాజపా సంబందాలు. 

ఈ మూడింటి మీదా కూడా ఆర్కే మూడు రెళ్లు ఆరు అనే లెక్కన పాయింట్లు బయటకు తీసారు. అలా తీయడం తప్పు కాదు. మూడు కాదు ముఫై పాయింట్లు తీయొచ్చు. కానీ తీసే పాయింట్లు అన్నీ వాటి కాళ్లకు అవే అడ్డం పడకూడదు. సరే, ఇక్కడ పాయింట్లు ఏమిటి? వాటికి అవే ఏ విధంగా అడ్డం పడ్డాయి అన్నవి చూద్దాం.

''....ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌–భారతీయ జనతా పార్టీల మధ్య సంబంధాలకు గండి పడిందా? ఈ వారంలో జరిగిన పరిణామాల ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. ..''

''....రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టి దాని స్థానంలోకి రావాలంటే బీజేపీకి బలమైన ఆయుధం కావాలి. కుల, మత ప్రాతిపదికన ప్రజలను పోలరైజ్‌ చేయడం తేలిక! ముఖ్యమంత్రి జగన్‌ వెనుక క్రైస్తవులు, ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు హిందువులను తమ వైపునకు తిప్పుకోగలిగితే తెలుగుదేశం పార్టీ ఫినిష్‌ అవుతుందన్నది బీజేపీ నాయకుల అంచనాగా చెబుతున్నారు....''

పైన ఉదహరించిన రెండు ఆలోచనలు ఆర్కేవే...ఆయన వ్యాసం లోనివే. ఒక పక్క సంబందాలు బెడిసి కొట్టాయి. పరస్పర విమర్శలు ప్రారంభమయ్యాయి ..కొడాలి నాని అందుకే మోడీని టార్గెట్ చేసారు... అంటున్నారు. మళ్లీ ఆయనే ఇదంతా లోపాయి కారీ వ్యవహారం. తెలుగుదేశం పార్టీని చంపేయడానికి ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. పైగా దానికి మద్దతుగా కొన్ని పాయింట్లు చేర్చారు. 

దేవాలయాలపై దాడులను ప్రభుత్వం తలచుకుంటే అరికట్టగలదు. కానీ అలా చేయడం లేదు అంటే భాజపాకు అవకాశం ఇస్తోంది అంటున్నారు. భాజపా ను నిరసన చేయనిస్తోంది. తెలుగుదేశాన్ని చేయనివ్వడం లేదు అంటున్నారు. 

సరే ఇదయిపోయింది. న్యాయవ్యవస్థపై సంగతి చూద్దాం.

''....ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి న్యాయ వ్యవస్థపై గుర్రుగా ఉండటానికి హైకోర్టులో తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం మాత్రమే కాదనీ, ఆర్థిక నేరస్థులపై పెండింగులో ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడమే ప్రధాన కారణమనీ చెబుతున్నారు. ఈ ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.....''

అంటే ఇక్కడ మాత్రం వ్యాసకర్త ఆలోచనలో క్లారిటీ కనిపిస్తోంది. అమరావతి భూముల వ్యవహారంలో కొందరు పెద్దవారి పిల్లల పేర్లు కనిపించడానకి అసలు కారణం భూముల కుంభకోణం కాదు. వారి పెద్దలపై వేరే విషయంలో వున్న కోపం, ద్వేషం అని ఆర్కే వివరణ ఇస్తున్నారు. ఈ తరహా ఆలోచనను జనాల్లోకి పంపాలనుకుంటున్నారు. 

మళ్లీ అదే సమయంలో ఆయనే ఇంకో ముచ్చట కూడా చెబుతున్నారు. 

''.....బీజేపీ పెద్దల మాటను జగన్‌ జవదాటరన్న అభిప్రాయం విస్తృతంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి కల్పించుకుని ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించుకుని ఉంటారు. జగన్‌ రెడ్డి న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నప్పటికీ.. కేంద్రం పట్టించుకోవడం లేదన్న అపప్రథ తమకు చుట్టుకోకుండా ఉండటానికే అమిత్‌ షా ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.....''

''....అమరావతి భూముల వ్యవహారంలో మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, సుప్రీంకోర్టు జడ్జి కుమార్తెలపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేయడంతో జగన్మోహన్‌ రెడ్డిని అమిత్‌ షా పిలిపించుకున్నారు. న్యాయ వ్యవస్థను వివాదంలోకి లాగడమే కాకుండా ప్రత్యక్షంగా ఘర్షణకు దిగడాన్ని ఈ సందర్భంగా అమిత్‌ షా తప్పుబట్టినట్టు వార్తలొచ్చాయి....''

అసలు ఈ వార్తలు వచ్చాయి అంటున్నారు కదా? ఎక్కడ వచ్చాయి. ఒక్క మీ ఆంధ్రజ్యోతిలో తప్ప మరే ఒక్క మీడియాలోనైనా ఇలాంటి వార్తలు కనిపించిందా? అమిత్ షా మందలించారు అంటూ రెండు రోజుల పాటు వార్తలు వండి వార్చింది మీరే కదా? మళ్లీ అదే వార్తలు పట్టుకుని, ఇప్పుడు వ్యాసం వండింది కూడా మీరే కదా. అదే వ్యాసంలో మళ్లీ ఈ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఇంకో పాయింట్ లాగుతున్నది కూడా మీరే కదా? మరీ ఇంత అయోమయం దేనికి? ఇదంతా దేనిని సూచిస్తోంది. 

రాష్ట్రంలో పరిస్థితులు తెలుగుదేశం చేతులు జారిపోతున్నాయి. భాజపా దూకుడుగా వెళ్తోంది. తెలుగుదేశం చేష్టలుడిగి కూర్చుంది. నిరసనలు చేయలేకపోతోంది. అటు ప్రభుత్వం మొండిగా ముందుకు పోతోంది. ఇదంతా చూస్తుంటే 2024 నాటికి తెలుగుదేశం పరిస్థితి మరీ చేజారిపోతుందేమో అన్న భయం తప్ప వేరు వుందా?  ఇక్కడ మాత్రం అస్సలు అయోమయం లేదు..అనుమానం లేదు. 

దాడులపై జగన్ కు క్లీన్ చిట్

ఒక విధం గా ఆర్కే జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలి అంటే అరికట్టవచ్చు. కానీ అలా చేయకుండా భాజపాకు సహకరిస్తోంది. హిందూత్వను రెచ్చగొట్టి, హిందూ ఓట్లను తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అసలు ఇన్నాళ్లు లేనిది ఆంధ్రలో ఈ ఆలయాలపై దాడులేమిటి? ఈ మత విద్వేషాలు ఏమిటి? ఇదంతా ఏదో వుంది వ్యవహారం అంటూనే, భాజపా మీద అనుమానం కలిగేలా ఆర్కే వ్యాసం వండి వార్చారు. 

అంటేఅందులో నిజానిజాలు ఎలా వున్నా, ఈ దాడులకు వైకాపా లేదా జగన్ కు, అలాగే జగన్ మూలాలు అని చెప్పుకునే క్రిస్ట్రియానిటీకి సంబంధం లేది పరోక్షంగా ఆర్కే క్లీన్ చిట్ ఇచ్చారు. ధన్యవాదాలు చెప్పుకోవాలి దానికి జగన్. 

విశాఖ‌కే అన్ని కావాలంటున్న విజ‌య‌సాయిరెడ్డి! 

 


×