Advertisement

Advertisement


Home > Politics - Political News

మేడా, చెవిరెడ్డేనా...మిగిలిన ఎమ్మెల్యేలు ఎక్క‌డ‌?

మేడా, చెవిరెడ్డేనా...మిగిలిన ఎమ్మెల్యేలు ఎక్క‌డ‌?

కోవిడ్ అనేది ఓ పేద్ద సామాజిక విప‌త్తు. దీన్ని ఎదుర్కోవాలంటే కేవ‌లం ప్ర‌భుత్వాల వ‌ల్లే సాధ్యం కాదు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌త‌మ ప‌రిధుల్లో క‌రోనా క‌ట్ట‌డికి చేయూత‌నివ్వాలి. రాజ‌కీయ విమ‌ర్శ‌లు, త‌ప్పొప్పుల గ‌ణాంకాల‌ను క‌రోనా క‌ట్ట‌డి త‌ర్వాత చేసు కోవ‌చ్చు. 

మొట్ట మొద‌ట‌ ప్రాధాన్యం ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ్డం. ప్ర‌ధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు త‌మ‌త‌మ నియోజ‌క వ‌ర్గాల ప‌రిధిలో క‌రోనా రోగుల‌కు అవ‌స‌రమైన సౌకర్యాలు క‌ల్పించేందుకు ముందుకు రావాల్సిన స‌మ‌యం ఇది.

మ‌రీ ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతో చొర‌వ చూపి  ప్ర‌భుత్వానికి, త‌మ‌కు మంచి పేరు తెచ్చుకునేం దుకు చొర‌వ చూపాల్సి ఉంది. అయితే ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు మిన‌హాయించి అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల్లో సొంత డ‌బ్బు బ‌య‌టికి తీసి జ‌నం కోసం ఖ‌ర్చు చేయాలన్న స్పృహే కొర‌వ‌డింది. 

ఎన్నిక‌ల‌ప్పుడు ప్ర‌త్య‌ర్థుల కంటే ఓ 500 రూపాయ‌లు ఎక్కువైనా ఖ‌ర్చు చేసి గెలుస్తామ‌నే ధీమానో, లేక మ‌రేదైనా కార‌ణ‌మో తెలియ‌దు కానీ, నేత‌లు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో గుర్రాలపై స్వారీ చేస్తూ, స‌ర‌దాలు తీర్చుకుంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ రోగుల‌కు ఆస్ప‌త్రుల్లో బెడ్స్‌, ఆక్సిజ‌న్‌, వ్యాక్సిన్ అంద‌క అల్లాడుతుంటే వీళ్ల‌కు స‌ర‌దాలు అవ‌స‌ర‌మ‌య్యాయా? అనే నిల‌దీత‌లు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నాయి. 

ఈ నేప‌థ్యంలో క‌డ‌ప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గ కోవిడ్ రోగుల‌ను ఆదుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. క‌డ‌ప‌కు స‌మీపంలో త‌న సోద‌రుడు, మేడా క‌న్వెన్ష‌న్ అధినేత మేడా ర‌ఘునా థ‌రెడ్డి క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో ఆక్సిజ‌న్‌తో కూడిన సుమారు 100 బెడ్ల‌ను ఏర్పాటు చేసి శ‌భాష్ అనిపించుకున్నారు.

అలాగే ఆక్సిజ‌న్ నిల్వ‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు, కోవిడ్ బాధితుల‌కు ప్ర‌త్యేక మ‌రుగుదొడ్లు, ఇత‌ర సౌక‌ర్యాల‌ను యుద్ధ‌ప్రాతిపదిక‌న ఏర్పాటు చేస్తున్నారు. త‌న నియోజ‌క వ‌ర్గంలోని కోవిడ్ బాధితుల‌కు మెరుగైన ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు ఎమ్మెల్యే మేడా తెలిపారు. ఇందుకోసం రూ.50 ల‌క్ష‌ల విరాళాన్ని క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌కు అందజేసిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు.  

ఇటీవ‌ల చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో అక్క‌డి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి కూడా ఇదే విధ‌మైన ఏర్పాట్లు చేసి ప్ర‌శంస‌లు అందుకున్నారు. చంద్ర‌గిరి, నారావారిపల్లె ఆరోగ్య కేంద్రాల్లో 150 ఆక్సిజ‌న్ బెడ్లను సొంత ఖ‌ర్చుతో ఏర్పాటు చేసి మెరుగైన ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు.

వైసీపీ త‌ర‌పున 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గెలుపొందారు. వీరిలో బ‌ద్వేలు ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య ఇటీవ‌ల అనారోగ్యంతో మృతి చెందారు. సీఎం వైఎస్ జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్త బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. 

ఇక మిగిలిన ప్ర‌జాప్ర‌తిని ధులు త‌మ‌త‌మ నియోజ‌కవ‌ర్గ ప్ర‌జ‌ల కోసం ఏం చేస్తున్నారు? ఇలాంటి విత‌ప్క‌ర స‌మ‌యంలో కాకుండా , ప్ర‌జ‌ల కోసం మ‌రెప్పుడు సేవ‌లందిస్తార‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికైనా చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, మేడా మ‌ల్లికార్జున్‌రెడ్డిల‌ను స్ఫూర్తిగా తీసుకుని సొంత నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల కోసం ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?