Advertisement


Home > Politics - Political News
మీడియా ఈక్వేషన్లు మారుతున్నాయా?

దేశవ్యాప్తంగా మీడియా వ్యవహారాలు వేరు. తెలుగునాట మీడియా వ్యవహారాలు వేరు. దేశవ్యాప్తంగా మీడియా సిద్దాంతాలు లేదా వ్యక్తులు, కాదూ అంటే పార్టీల వారీగా తమ తమ మద్దతు ప్రకటిస్తూ వుంటుంది. చాలా సైలెంట్ గా ఆ మేరకు జనాల్ని ప్రభావితం చేసే పనిలో వుంటుంది.

కానీ తెలుగునాట అలాకాదు. ఇక్కడ సిద్దాంతాలు, పార్టీలు కాదు. కులాలే ప్రధానం. తెలుగునాట మెజార్టీ మీడియా ఒకకులం చేతిలోనే వుంది. అది విజువల్, ప్రింట్, వెబ్ ఏదయినా కూడా. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఆ మీడియా తెలుగుదేశం పార్టీకి అండగా వుంటూనే వస్తోంది. ఆఖరికి ఈ మీడియా తనకు సహకరించదనే, వైఎస్ ఫ్యామిలీ స్వంత మీడియా సంస్థను స్టార్ట్ చేసుకుంది. చిత్రమేమిటంటే అదే మీడియా సంస్థల్లో కోన్ని మాత్రం వైఎస్ హయాంలో కాస్త అటు ఇటుగా వుంటూ వీలయినన్ని ప్రయోజనాలు పొందింది. కానీ వైఎస్ అనంతరం మళ్లీ అవే తెలుగుదేశం వైపుకు వచ్చేసాయి.

చీలిక విజువల్?
అయితే ఇప్పుడు మీడియా సంస్థల మధ్య వున్నపోటీ కావచ్చు, వేరే వ్యవహారాలు కావచ్చు, 2019 నాటికి ఒకే లైన్ లో వుండి తెలుగుదేశం కొమ్ము కాసే వ్యవహారం కొనసాగిస్తాయా? అన్నది అనుమానంగా వుంది. ఇటీవల కొంత కాలంగా ముఖ్యంగా విజువల్ మీడియాలో తెరవెనుక పోటీ, స్పర్ద పెరిగాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య టీఆర్పీ రేటింగ్ ల్లో లొసుగులు బయటకు రావడం వెనుక కూడా ఈ స్పర్దలు వున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రెండు లీడింగ్ చానెల్ కు చెందిన ఇద్దరు ప్రముఖులు ఇప్పుడు మంచి నేస్తాలయ్యారని జర్నలిస్ట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

బాబుపై విసుర్లు
విజువల్ మీడియాలోని రెండు చానెళ్లు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. వీటిల్లో ఓ చానెల్ అధినేత చాన్నాళ్ల క్రితమే పవన్ కు ఓ ఖరీదైన కారు బహుకరించారన్న వదంతులు వినవచ్చాయి. దీనికి తోడు విజవల్ మీడియాలోని కీలకమైన టీవీ-9కు చెందిన రవిప్రకాష్ నిన్నటికి నిన్న కాటమరాయుడు ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు జర్నలిస్ట్ వర్గాల్లో చర్చకు దారితీసాయి.

నిన్నటికి నిన్న రవిప్రకాష్ స్పీచ్ వింటే కాస్త డవుట్ లు వస్తున్నాయి. ‘’ఈ మధ్య పవన్ కళ్యాణ్ ను బాగా ఇష్టపడుతున్న వ్యక్తుల్లో నేనూ ఒకడిని’ అన్నారు రవిప్రకాష్. అంతేకాదు. ప్రస్తుతం వున్న రాజకీయనాయకుల్లా పవన్ విపరీతంగా డబ్బు సంపాదించే పని చేయలేదన్నారు. అంటే ఇప్పుడు వున్నవాళ్లు బాగా వెనకేసుకుంటున్నారని రవిప్రకాష్ చెప్పినట్లే కదా? కానీ రవిప్రకాష్ అక్కడితో ఆగలేదు. ‘’అసలైన ప్రజల సమస్యల పరిష్కారానికి పవన్ కృషిచేస్తున్నారు. అందువల్ల కచ్చితంగా పవన్ ను అభిమానించాల్సి వుంటుంది. అంతేకాదు, ఈరోజు, అధికారంలో వున్నవారికి, ప్రభుత్వంలో వున్నవారికి కేవలం వందిమాగధుల్లా తయారై భజన చేసే బ్యాచ్ లు ప్రతిచోటా కనిపిస్తున్నాయి’’ అని రవి ప్రకాష్ ఎందుకు అన్నారో? ఎవర్ని ఉద్దేశించి అన్నారో అని మీడియా సర్కిళ్లలో డిస్కషన్లు వినిపిస్తున్నాయి.

దీనికి అదనంగా, ‘’... ప్రత్యేకహోదా ఇస్తామని ఆశపెట్టి, నోట్లరద్దు వ్యవహారంలో కావచ్చు, అందరూ మౌనం వహించి మాట్లాడడానికి భయపడిన సందర్భంలో ప్రశ్నించిన వ్యక్తి పవన్ కళ్యాణ్’  అన్నారు. ఇలా మౌనం వహించి భయపడిందిఎవరు? చంద్రబాబేనా? ఎందుకంటే జగన్ ఈ సమస్యపై బాహాటంగానే పోరాడుతున్నారు. మిగిలింది బాబేగా? మరి రవిప్రకాష్ ఎందకు అలా అన్నట్లు? పైగా రవిప్రకాష్ ఇంకో మాట కూడా విసిరారు. ‘ మీరు ప్రజల కోసం రాజకీయ నాయకులయ్యారు. కానీ ఇప్పుడు మీరు ఈ రోజు వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటూ, ఎన్నికల ముందు ఒకమాట చెప్పి, ఎన్నికల తరువాత మరో మాట చెబుతూ ప్రజలను వంచిస్తున్నారు. కుటుంబ సంక్షేమం కోంస పని చేస్తున్నారు.’ అని రవిప్రకాష్ కాస్త ఘాటుగా అన్నారు.

ఈ మాటలు చంద్రబాబు గురించి కాక మరి ఎవరి గురించి అనుకోవాలి. అధికారంలో వున్నది ఆయనే. ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికల తరువాత ఓ మాట చెప్పారని ఎవర్ని అంటారు? లేదా కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారా? ఎందుకంటే కుటుంబ సంక్షేమం చూసుకుంటున్నారని అన్నారు కదా? ఎన్నికల ముందు, తరువాత అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది చంద్రబాబే. అయితే ఇక్కడ మీ కుటుంబాలు అంటూ బహువచనం కూడా వాడారు కాబట్టి, కచ్చితంగా చంద్రబాబును  కూడా టార్గెట్ చేసినట్లే. ఇంకా విశేషమేమిటంటే, పవన్ కళ్యాణ్ తో కలిసి యువత ముందుకు నడవాలని పిలుపు ఇవ్వడం.

బాబుతోనే వుంటారా ?
ఇప్పుడు డౌట్ ఏమిటంటే, 2019 నాటికి కూడా పవన్ ఎన్నికల్లో బాబుతోనే కలిసి ముందుకు నడుస్తారేమో? అందుకే పవన్ ను కూడా ఈ మీడియా సపోర్టు చేస్తోందా? లేదా మూడేళ్లలో చంద్రబాబు ఇమేజ్ ఏమాత్రమైనా తగ్గిందని ఈ మీడియా అనుమానిస్తోందా? అందుకే ఆల్టర్ నేటివ్ గా జగన్ బలపడక ముందే పవన్ ను పైకి తేవాలని తమవంతు ప్రయత్నం ప్రారంభించారని అనుకోవాలా?

ఏదైనా మొత్తానికి తెరవెనుక ఏదో జరుగుతోంది. భజన బ్యాచ్ అన్న పదాన్ని కూడా రవిప్రకాష్ వాడారు. ఎవరు ఈ భజన బ్యాచ్. బాబు భజన లేదా మోడీ భజన చేస్తున్నది ఎవరు? రవిప్రకాష్ కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించే ఇలాంటి పదప్రయోగం చేసారని మీడియా సర్కిళ్ల అనుమానం. మొత్తం మీద మీడియాలో ఏదో తేడా వచ్చిందని, దాని ఫలితంగానే ఇప్పుడు ఇలా ఓపెన్ గా మాటల తూటాలు బయటకు వచ్చాయని అనుమానం. ఇది ఇక్కడితో ఆగితే ఓకె. లేదూ మరింత ముందుకు వెళ్తే మాత్రం ‘దేశా’నికి కష్టమే. కానీ తెలుగుదేశం జనాల ధీమా ఒక్కటే. బాబుగారు ఎవర్ని అయినా, ఎలాగైనా, ఎప్పడైనా మేనేజ్ చేయగలరు అన్నదే.

చూడాలి. 2019 దగ్గరకు వచ్చేసరికి తెలుగు మీడియా ఈక్వేషన్లు ఎలా మారుతాయో?