cloudfront

Advertisement


Home > Politics - Political News

'మీ..టూ..' - బిగ్‌ వికెట్‌ డౌన్‌

'మీ..టూ..' - బిగ్‌ వికెట్‌ డౌన్‌

'మీ..టూ..' ఎపిసోడ్‌లో సూపర్‌ ట్విస్ట్‌. కేంద్రమంత్రి (సహాయ) ఎంజే అక్బర్‌ తన పదవికి రాజీనామా చేశారు. పలువురు మహిళా పాత్రికేయులు, ఎంజే అక్బర్‌ 'చిలిపి వ్యవహారాలపై' గళం విప్పడంతో, భారతీయ జనతాపార్టీ ఇరకాటంలో పడిపోయిన సంగతి తెల్సిందే. నిర్మలా సీతారామన్‌, సుష్మా స్వరాజ్‌ తదితర మహిళా కేంద్ర మంత్రులూ, తమ సహచర మంత్రి ఎంజే అక్బర్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సంకటంలో పడిపోయారు.

ఈ పరిస్థితుల్లో ఇంకా ఎంజే అక్బర్‌ని కేంద్రమంత్రి పదవిలో కొనసాగనీయడం పార్టీకి చేటు చేస్తుందని భావించిన ప్రధాని నరేంద్రమోడీ, ఆయనతో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద, ఎంజె అక్బర్‌ రాజీనామా చేశారు. ఇది చాలా పెద్ద వికెట్‌గా చెప్పుకోవాలి 'మీ..టూ..' ఉదంతానికి సంబంధించి. ఎక్కడో హాలీవుడ్‌లో పుట్టిన 'మీ..టూ..' ఉద్యమం, భారతీయ సినీ పరిశ్రమను గట్టిగానే తాకింది.

కేవలం సినీ పరిశ్రమపైనే కాదు, వివిధ రంగాలపై 'మీ..టూ..' ఎఫెక్ట్‌ చాలా గట్టిగా పడింది. ప్రధానంగా పత్రికా రంగం 'మీ..టూ..' బాగా ఎఫెక్ట్‌ అయ్యిందని చెప్పొచ్చు. పలువురు సీనియర్‌ పాత్రికేయులు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. పలువురు సినీ ప్రముఖులూ, సినిమాల నుంచి తప్పుకున్నారు.

ప్రియా రమానీ అనే పాత్రికేయురాలు ఎంజే అక్బర్‌ తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపించడం, ఆ తర్వాత మరింతమంది మహిళా జర్నలిస్టులు గళం విప్పడంతో.. ఎంజే అక్బర్‌ 'బాగోతం' ప్రపంచానికి తెలిసింది. తనపై ఆరోపణలు చేసినవారిపై ఎంజే అక్బర్‌ న్యాయపోరాటం మొదలు పెట్టిన విషయం విదితమే.

ఒక్క ప్రియా రమానీపైనే ఆయన ఏకంగా 97 మంది అడ్వకేట్స్‌తో కూడిన ప్యానల్‌ ద్వారా పరువు నష్టం దావా వేయడం గమనార్హం. ఈ ఎపిసోడ్‌తో ఎంజే అక్బర్‌ పిరికితనం మరింతగా బయటపడింది. ఏదిఏమైనా, రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ బీరాలు పలికాడు ఎంజే అక్బర్‌.

తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్ని తోసిపుచ్చుతూ, వాటికి పొలిటికల్‌ కలర్‌ అద్దే ప్రయత్నం చేసిన ఎంజే అక్బర్‌.. చివరికి రాజీనామా చేయక తప్పలేదు. ఇంతకీ, ఈ రాజీనామా ఎపిసోడ్‌తో మోడీ సర్కార్‌పై 'మరక' చెరిగిపోతుందా.? 

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి