Advertisement

Advertisement


Home > Politics - Political News

'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'

'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'

'నువ్వెట్టా ఓడిపోయావయ్యా..' అని వీరాభిమానులు అడిగితే అడిగారు, వాళ్లకంటే తెలియకపోవచ్చు. చంద్రబాబుకు కూడా ఆ విషయం తెలియదా? తను ఎందుకు ఓడిపోయిందీ చంద్రబాబుకు తెలియదా? తెలియనట్టుగా నటిస్తూ ఉన్నారా? తెలియకపోతే అది చంద్రబాబు నాయుడి అమాయకత్వం అవుతుంది, తెలిసీతెలియనట్టుగా వ్యవహరిస్తే అది తనను తాను మోసం చేసుకోవడం అవుతుంది, తెలుసుకోలేకపోతే అది ఆయన అసమర్థత అవుతుంది. అయితే బయటివాళ్లకు తెలుస్తున్నది ఏమిటంటే.. చంద్రబాబుకు అన్నీతెలుసు! అన్నీ తెలిసే ఈ కొత్త డ్రామాకు తెరలేపారు. కానీ.. ఇది మరీ సిల్లీగా ఉంది. స్లంప్‌లో ఉన్నప్పుడు ఇలాంటి సిల్లీ పనులు చేస్తే వ్యవహారం మరింత సిల్లీగా మారుతుందని మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్లు తెలుసుకోలేకపోతున్నారు!

47వేల నుంచి 30వేలకు పడిపోయింది చంద్రబాబు మెజారిటీ! 17 వేలమంది సొంత నియోజకవర్గంలోనే అదనంగా ఈసారి చంద్రబాబు తిరస్కరించారు. రెండో రౌండ్‌ కౌంటింగ్‌ ముగిసేసరికి చంద్రబాబు నాయుడు వెనుకబడ్డారు. అనామకుడు, కనీసం ప్రచారం కూడా చేయని ప్రత్యర్థి చేతిలో చంద్రబాబు నాయుడు రెండు రౌండ్ల పాటు వెనుకబడ్డారు. తన మెజారిటీని చాలావరకూ కోల్పోయారు. రానున్న ఐదేళ్లలో కుప్పంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సరిగా వర్కవుట్‌ చేసుకుంటే? పరిస్థితి ఎలా ఉంటుందో వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. పులివెందుల్లో గెలుస్తాం.. అనే దగ్గర నుంచి కుప్పాన్ని నిలబెట్టుకునేందుకు వచ్చేసారికి చాలా కష్టపడాల్సిన పరిస్థితుల్లోకి పడిపోయింది తెలుగుదేశం!

ఇంతకీ తన దగ్గర హాశ్చర్యపోతున్న వాళ్లకు చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయిన విషయాన్ని వివరించి చెబుతున్నారా? అనే అంశం మీద కూడా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. తెలుగుదేశం అంత చిత్తుగా ఎందుకు ఓడిపోయారో చెప్పమంటే చెప్పడానికి ఎన్నో విషయాలు ఉండనే ఉన్నాయి. వాటన్నింటినీ చంద్రబాబు నాయుడు తన దగ్గరకు వచ్చిన వాళ్లకు వివరిస్తున్నారా? లేక వాళ్లకు వివరించినా వేస్ట్‌ అని ఊరికే అయిపోతున్నారా? అంటూ సోషల్‌ మీడియా కొంతమంది స్పందిస్తున్నారు!

వాటికి సినీ దర్శకుల డైరెక్షన్‌, చంద్రబాబుది క్రియేటివిటీ, ప్రజల సొమ్ముతో ఆయనే వాటికి నిర్మాత. అలా ఐదేళ్లపాటు తీసిన డ్రామాను ప్రజలు తిరస్కరించారు. ఆ డ్రామాను చూసి విసుగొచ్చి తెలుగుదేశం పార్టీని చితకొట్టారు. అయినా తెలుగుదేశం మరో ఈవెంట్‌కు ప్లాన్‌ చేసింది. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా..' అంటూ దాన్ని నడిపిస్తూ ఉంది. ప్రజలు చిత్తుగా ఓడించినా.. దాంట్లోనూ ఒక ఈవెంట్‌ను నిర్వహించుకోవడం చంద్రబాబుకే సాధ్యం అవుతున్నట్టుగా ఉంది.

ఇది ఎంత పచ్చి కామెడీనో ఏమాత్రం ఇంగితం ఉన్న వారికి అయినా అర్థం అవుతుంది. రైతులకు చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో ఎప్పుడూ పెట్టుబడి డబ్బులు ఇవ్వలేదు. ఖరీఫ్‌లో పెట్టుబడికి అని, రబీలో పెట్టుబడికి అని ఎలాంటి డబ్బులూ ఇవ్వలేదు. కేవలం ఎన్నికల ముందు ఒక స్కీమ్‌ను ప్రకటించారు. 'అన్నదాత సుఖీభవ' అంటూ రెండు వేల రూపాయల డబ్బును రైతుల ఖాతాలోకి జమ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే  అది కేంద్రం స్కీమ్‌. కేంద్రం ఆ ప్రోగ్రామ్‌ను అనౌన్స్‌ చేయగానే.. ఆ డబ్బుకు తాము కూడా మరికొంత జోడించి రైతులకు వేస్తామంటూ కొత్త స్కీమ్‌ను అనౌన్స్‌ చేశారు. అయితే అది రైతులకు అందిందీ లేదు. కేవలం ఎన్నికల ముందు ఒక గారడీగా ఆ స్కీమ్‌ను ప్రకటించారు.

ఓట్లను కొనుగోలు చేయడానికి రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లలోకి వేయాలని అనుకున్నారు. అయితే అందులో కూడా ఫెయిల్‌ అయ్యారు. అదీ జరిగిన కథ. అయితే అక్కడకు గత ఐదేళ్ల నుంచి చంద్రబాబు నాయుడే పెట్టుబడలన్నింటికీ డబ్బులు వేసినట్టుగా, ఆయన ఇప్పుడు ఓడిపోవడంతో పెట్టుబడికి రైతులకు డబ్బులు అందనట్టుగా ఈ కథను కల్పించారు. ఇలాంటి తీరును గమనించాకా.. ఇవన్నీ డ్రామాలు అని అనడానికి ఎవరైనా ఎందుకు వెనుకాడతారు? మరీ ఇంత ప్రహసనంగా ఉంటే.. ఈ కామెడీలు చేసి నవ్వుకోక మరేం చేస్తారు? ఈ విషయం గురించి డ్రామాకు స్క్రీన్‌ ప్లే ఇచ్చి, దర్శకత్వం వహిస్తున్న వాళ్లే ఆలోచించుకోవాలేమో!

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతుందంటారు. చంద్రబాబు నాయుడు తను ఏం చేసినా ప్రజలు కళ్లు మూసుకునే ఉంటారని అనుకున్నారు. అందుకే మోడీతో దోస్తీ చేసినంత సేపూ దోస్తీ చేసి, తర్వాత ఇష్టానుసారం మాట్లాడసాగారు. పచ్చి అవకాశవాదిలా వ్యవహరించారు. కేవలం మోడీతోనే గాక ప్రజా ప్రయోజనాల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఇసుమంత నిజాయితీ అయినా చూపలేదు! అందుకే ప్రజలు చాచి ఓటుతో కొట్టారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇక్కడకు తయారైంది. ఇదంతా జరిగింది. ఇంకా ఏమీ అర్థంకానట్టుగా చంద్రబాబు నాయుడు డ్రామాల్లో బిజీగా కనిపిస్తూ ఉన్నారు. ఈ ఎపిసోడ్లు కాస్త త్వరగా ముగించుకుంటే.. అసలు కథ వేరే మొదలు కాబోతోందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకు ఓడిపోయారో  తొందరగా అర్థం చేసుకోవాలని, అయితే ఇప్పుడు అర్థం చేసుకున్నా చంద్రబాబుకు ఉండే ప్రయోజనాలు లేవని, ఓడిపోవడం వల్ల ఏం జరగబోతోందో అనేదే చంద్రబాబుకు త్వరలో అర్థం అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈవీఎంల గురించి ఇప్పుడు ఏం మాట్లాడినా మోడీకి తన మీద మరింత ఆగ్రహం కలుగుతుందనే విషయం చంద్రబాబుకు తెలియనిది ఏమీకాదని, అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈవీఎంల గురించి మాట్లాడకుండా, డ్రామా ఆర్టిస్టులు, కులగజ్జి జనాల డ్రామాల్లో తనూ ఒక పాత్రధారిగా వ్యవహరిస్తూ ఉన్నారని.. అయితే ఈ డ్రామాలను జనాలు నమ్మేరోజులు పోయాయని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోలేకపోతే ఆ నష్టం తెలుగుదేశం పార్టీకే అని పరిశీలకులు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు డ్రామాలను జనాలు నమ్మలేదు, ప్రతిపక్షంలో కూర్చుని ఇలాంటి పనులు చేస్తే ఇదంతా ప్రజలు నవ్వుకునేందుకు వినోదంగా పనికి వస్తుంది!

-బి.జీవన్ రెడ్డి

బాబు అప్పుడే ఇలా ఆలోచించి ఉంటే ఫలితముండేదేమో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?