cloudfront

Advertisement


Home > Politics - Political News

కరుణానిధికి ఎంజీఆర్ ఇచ్చిన గౌరవం అది!

 కరుణానిధికి ఎంజీఆర్ ఇచ్చిన గౌరవం అది!

తమిళ రాజకీయాల్లో కరుణానిధి, ఎంజీఆర్‌ల ప్రస్థానం అలాంటిలాంటిది కాదు. అన్నాదురై శిష్యులుగా వీళ్లిద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు. ద్రవిడ ఉద్యమంలో భాగస్వామ్యులయ్యారు. ఇద్దరూ సినీరంగంతో సంబంధాలున్న వారే. డీఎంకే రాజకీయాల్లో భాగం అయ్యే సమయానికి కరుణానిధి రచయిత, ఎంజీఆర్ హీరో. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన తొలి సినిమా ‘రాజకుమారి’. రాజకీయ ఆసక్తి , సినీ ఆసక్తి వీళ్లిద్దరినీ మరింత దగ్గర చేసింది. అయితే ఆదిలోని వీరి స్నేహం క్రమంగా ఆధిపత్య పోరుగా మారింది. అన్నాదురై మరణానంతరం వీరిద్దరి మధ్యన విబేధాలు పొడసూపాయి.

ఆవెలాంటివో మణిరత్నం ‘ఇద్దరు’ సినిమాలో సూపర్ గా చూపించాడు. ఈ ఆధిపత్యపోరు ఎంజీఆర్ ను పార్టీ బయటకు పంపేలా చేసింది. అన్నాదురై వారసత్వం తనదంటూ ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించాడు. సినీ హీరోగా అప్పటికే ఎంజీఆర్ ఇమేజ్ తారాస్థాయికి చేరింది. అప్పటికే కరుణానిధిపై నెలకొన్న వ్యతిరేకత, ఎంజీఆర్ సినీ గ్లామర్.. ఆయనను తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసింది. ఎంజీఆర్ ముఖ్యమంత్రి సీట్లో, కరుణానిధి డీఎంకే అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా. అలా చాలా సంవత్సరాలు గడిచాయి.

ఎంజీఆర్ బతికున్నంత వరకూ మళ్లీ కరుణానిధి అధికారం వైపుకు రాలేకపోయాడు. అయితే ఎంజీఆర్ మాత్రం కరుణానిధిని చిన్నచూపు చూడలేదు. తన సహచరుడిగానే భావించాడు. ఇదే విషయాన్ని తన పార్టీ శ్రేణులకు కూడా స్పష్టం చెప్పాడాయన. తమ పార్టీ వాళ్లు కరుణ గురించి ఎక్కడ మాట్లాడేటప్పుడు అయినా ‘కరుణానిధి’ అంటూ మాట్లాడటాన్ని ఎంజీఆర్ తప్పుపట్టారు. కరుణానిధిని పేరుతో పిలవొద్దని.. ‘కళైంగర్’ అనే పిలవాలని ఎంజీఆర్ తన వాళ్లకు స్పష్టం చేశాడు.

కళైంగర్ అంటే, కళాకారుడు అని అర్థం. కరుణకు ఆ బిరుదును ఇచ్చింది ఎంఆర్ రాధా. నటి రాధిక తండ్రి ఆయన. ఎంజీఆర్ ఆదేశాలతో అన్నాడీఎంకే వర్గాలు... కరుణను కళైంగర్ అనే పిలవసాగాయి. రాజకీయ ప్రత్యర్థులు అయినా.. ఇరువర్గాలూ పరస్పరం తమ అధినేతలను గౌరవ వచనాలతో పిలుచుకోవడం కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ తమిళులను కదిలిస్తే.. కరుణానిధిని కళైంగర్ అనే సంబోధిస్తారు. ఎంజీఆర్ ను డీఎంకే వర్గాలు పురట్చితలైవర్‌గా సంబోధిస్తారు. జయను పురట్చి తలైవి అని కొన్నిసార్లైనా గౌరవిస్తారు.