Advertisement

Advertisement


Home > Politics - Political News

మోడీకి మరింత చేరువగా జగన్?

మోడీకి మరింత చేరువగా జగన్?

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయిపోయింది. ఈ రెండేళ్ల కాలంలో జగన్ పెద్దగా రాజకీయ వ్యూహాలు పన్నింది లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షం విషయంలో కూడా పెద్దగా రాజకీయ వ్యూహాలు పన్నింది లేదు. కేవలం కిట్టనివారిపై కక్షసాధింపుల్లా కనిపించే పలు చర్యలు మినహా. 

కేంద్రంలో మోడీకి, భాజపాకు దగ్గరగా, ప్రీతిపాత్రంగా వుండే విధంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు తప్ప, మరీ అర్రులు చాస్తున్నట్లు కానీ, అందుకు తగినట్లు వ్యూహాలు పన్నుతున్నట్లు కానీ కనిపించలేదు. రాజ్యసభ సభ్యత్వం అంబానీ సన్నిహితుడికి ఇవ్వడం వెనుక కూడా మరీ అంతుపట్టని రాజకీయ వ్యూహం ఏమీ లేదు. జస్ట్ మోడీ పరివారానికి దగ్గర కావడానికి ఓ మార్గం ఓపెన్ గా వుంచుకోవడం తప్ప.

అలాంటిది ఇప్పుడు మాత్రం రాజకీయ వ్యూహాన్ని రచించి, అమలు చేసే ప్రయత్నంలో జగన్ వున్నట్లు కనిపిస్తోంది. జాతీయంగా, అంతర్జాతీయంగా మోడీ ప్రతిష్ట మసకబారుతోంది. బెంగాల్ లో గట్టి దెబ్బ తిన్నారు. పెట్రో ధరల విషయంలో సమర్థించుకోవడానికి చూడాల్సి వస్తోంది. కోవిడ్ రెండో దశ కట్టడి విషయంలో, వ్యాక్సినేషన్ విషయంలో కూడా మోడీకి మైనస్ మార్కులు తప్పలేదు.         

అలా అని భాజపా పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. దక్షిణాదిన ఎక్కడా కనుచూపు మేరలో అధికారం అందే ఆశలేదు. కర్ణాటక కూడా చేజారిపోతుందనే సర్వేలు వున్నాయి ఉత్తరప్రదేశ్ లో పట్టు నిలబెట్టుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. మహరాష్ట్ర, ఢిల్లీ సంగతి సరేసరి. 2024 ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల మద్దతు తప్పనిసరిగా మారబోతోంది. 

ఇలాంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో చిత్రమైన పరిస్థితి నెలకొని వుంది. అధికార వైకాపా, ప్రతిపక్ష తేదేపా రెండూ మోడీ మైత్రి కోసం అర్రులు చాస్తున్నాయి. మరోసారి మోడీనే ప్రధాని అవుతారనే నమ్మకంతో వున్నాయి ఈ రెండు పక్షాలు. 

అందువల్ల మోడీ ప్రాపకం అవసరం, అది వుంటే ఎన్నికల్లో గెలవడం సంగతి అలా వుంచితే తలకాయనొప్పలు లేకుండా వుంటాయని భావిస్తున్నారు. జనసేనను భాజపాకు దగ్గర చేయడం ద్వారా సుదీర్ఘకాల రాజకీయ వ్యూహానికి చంద్రబాబు తెరతీసారు. వచ్చే ఎన్నికల వేళకు జనసేన ఏదో విధంగా భాజపాను తేదేపాను దగ్గరకు చేర్చడమో, లేదా భాజపాను వీడి తానే తేదేపాకు దగ్గర కావడమో జరుగుతుందనే రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

అధికార వైకాపా అధినేత సిఎమ్ జగన్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణను ఆయన నేరుగా ఢీకొన్నారు. రమణ చీఫ్ జస్టిస్ కాకముందు, జగన్ నేరుగా ఆయనను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసారు. ఇప్పుడు రమణ చీఫ్ జస్టిస్ అయ్యారు. మరోపక్క జగన్ బెయిల్ క్యాన్సిల్ చేయాలనే కేసును ఎంపీ రఘరామరాజు వేసారు. అది విచారణలో వుంది. అలాగే రాజకీయ నాయకుల అవినీతి కేసులు త్వరగా విచారించి క్లోజ్ చేయించాలనే ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి.

ఇలాంటి నేపథ్యంలో జగన్ కు మోడీ అండదండలు చాలా అంటే చాలా కావాలి. ఇవి కావాలంటే తాను ముమ్మాటికీ, మనసా వాచా కర్మణా మోడీ మనిషిని అని నిరూపించుకోవాలి. ఇప్పుడు ఆ దిశగానే జగన్ పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న మోడీకి అనుకూలంగా ట్వీట్ వేసి, నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించారు. నిన్నటికి నిన్న వ్యాక్సీన్ వ్యవహారాలను పూర్తిగా కేంద్రానికి వదిలేస్తే బెటర్ అని అన్ని రాష్ట్రాల సిమ్ లకు లేఖలు రాసారు. ఇవి చాలక నేరుగా ఢిల్లీ వెళ్లే ఆలోచనలో వున్నారని కూడా వార్తలు వినవస్తున్నాయి.

ఇప్పటి వరకు విజయసాయి రెడ్డికి ఢిల్లీ రాజకీయ వ్యూహాలు వదిలేసిన జగన్ ఇప్పుడు తానే వాటిని నేరుగా డీల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద జగన్ ఆలోచనల్లో ఏదో మార్పు వచ్చింది. మొండిగా, మౌనంగా వుండడం కన్నా, వ్యూహాలు రచించుకుని, అమలులోకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లు, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా