Advertisement

Advertisement


Home > Politics - Political News

దీపోపదేశంపై మోడీ వెనక్కి తగ్గుతారా?

దీపోపదేశంపై మోడీ వెనక్కి తగ్గుతారా?

ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంట్లోని లైట్లన్నీ ఆపేసి.. గుమ్మం ముందు దీపం వెలిగించండి అని ప్రధాని మోడీ దేశ ప్రజలందరికీ దీపోపదేశం చేశారు. అయితే దీనిపై ఇప్పటికే లెక్కలేనన్ని విమర్శలొచ్చాయి. విమర్శలతో పాటు.. ఇలా ఒకేసారి దేశంలో అందరూ లైట్లు ఆపేస్తే.. అది గ్రిడ్ వైఫల్యానికి దారితీసి అసలుకే మోసం వస్తుందని, టెక్నికల్ గా ఇది తప్పుడు నిర్ణయం అంటున్నారు కొంతమంది నిపుణులు.

విద్యుత్ గ్రిడ్ కుప్పకూలితే దాన్ని సరిదిద్దుకోడానికి తంటాలు పడాల్సి వస్తుందని, అసలు మహారాష్ట్ర ప్రజలెవరూ ఇళ్లలోని లైట్లు ఆర్పొద్దని, అవసరమైతే గుమ్మం ముందు దీపాలు వెలిగించండి చాలు అని సూచించారు ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రావత్. వాస్తవానికి లాక్ డౌన్ కారణంగా దేశంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పడిపోయింది. ఫ్యాక్టరీలు ఆగిపోయాయి, కొన్ని కంపెనీలలో అతి తక్కువ విద్యుత్ వాడుతున్నారు. అలా అని వర్క్ ఫ్రం హోమ్ కారణంగా ఇళ్లలో విద్యుత్ వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోలేదు.

దీంతో దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పూర్తిగా పడిపోయింది. ఇలాంటి టైమ్ లో దేశమంతా ఒకేసారి అన్ని లైట్లు ఆపివేస్తే అది కచ్చితంగా గ్రిడ్ వైఫల్యానికి దారితీస్తుందనేది విద్యుత్ ఇంజనీర్లు చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై ప్రధానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభ్యర్థనలు అందాయి. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి లైట్లు ఆపివేసే విషయంపై ఓ ప్రకటన వెలువడే అవకాశముంది.

లైట్లు ఆపకుండా.. దీపాలు వెలిగించే నిర్ణయాన్ని వాయిదా వేయకుండా.. మధ్యే మార్గంగా ప్రధాని కొత్త నిర్ణయాన్ని వెలిబుచ్చుతారని చెబుతున్నారు. అదే జరిగితే మరోసారి మోడీపై విమర్శల జడివాన కురవక మానదు. దేశ ప్రజలందరికీ కీలక సందేశాన్నిచ్చే సమయంలో ప్రధాని స్థాయి వ్యక్తి కనీసం దాని పర్యవసానాలు ఆలోచించరా అని ఇప్పటికే ప్రతిపక్షాలు ఓ ఆట ఆడుకుంటున్నాయి.

వలస కూలీల కష్టాలు, వైద్యుల పరికరాల కొరత.. వంటి అంశాల జోలికి పోకుండా ప్రధాని దీపాలు వెలిగించమనడం పెద్ద ప్రహసనంగా మారింది. ఇప్పుడు విద్యుత్ ఇబ్బందులపై ప్రధాని వెనకడుగు వేసినా, వేయకపోయినా.. అది సంచలనమే అవుతుంది.

'విశ్వక్' మూవీకి నాకు సంబంధం..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?