Advertisement

Advertisement


Home > Politics - Political News

మోదీ మెడలో గంట కట్టలేని ఆరంభశూరులు

మోదీ మెడలో గంట కట్టలేని ఆరంభశూరులు

చిన్నపిల్లలు కథలు కోకొల్లలు. అందులో అనేక కథలు వినే బాలలకు జీవితాంతం వారికి తారసపడుతునే ఉంటాయి. అలాంటి కథనం ఇక్కడ గుర్తుతెచ్చుకుందాం.ఓగండుపిల్లి ఎలుకలు దండిగా ఉన్న ఇంటిలో దొరికిన ఎలుకల్ని చంపేసి ఒకటో రెండోతిని పోతుండేది.గండుపిల్లికి బుద్దిచెప్పాల్సిందేనని ఎలుకలన్నీ ఆ ఇంటి ధాన్యంకొట్టులో సమావేశమయ్యాయి. గండుపిల్లి మెడలో గంటకట్టేద్దాం. పిల్లి వచ్చిందంటే మెడలో గంట మ్రోగుతుంది, పారిపోవచ్చు అని అనుకున్నాయి. ఎలుకలన్నీ భలేభలే అని చప్పట్లుకొట్టాయి. దాంతో నిప్పులేని పొయ్యిలో పడుకున్న గండుపిల్లికి తెలివొచ్చి  ఎలుకల మాటలను చెవులెత్తి వినసాగింది. పిల్లిమెడలో గంటకట్టేదెవరు? నువ్వుకట్టు అంటే నువ్వు కట్టు అని ఎలుకలు వాదించుకోసాగాయి. మీరెవరు కట్టొద్దు నేనే మీకే గంటకొడతాను అని ఆపిల్లి మీద పడి దొరికిన ఎలుకలను కొరికి కొరికి వదిలింది. ఈ కథనం నేటి తెలుగురాష్ట్రాల పాలకులు కేసీఆర్‌, జగన్‌లకు, అధికారం కోల్పోయి జగన్‌ సర్కారుపై ఆరోపణలతో పెట్రేగే చంద్రబాబుకు వర్తిస్తుంది. ఇక ఆకథనంలోకి వెడదాం.

'ఏది ఎరగనోడికి పెళ్లయితే బోసిగానే పెళ్లాన్ని ఎత్తుకోనే తిరిగాడట' అనే ముతకసామెత ఒకటి పల్ల్లెల్లో ఉంది. అలాంటి సామెతను వాడుకోవడంలో ముందు వరుసలో నలుగురైదు గురు రాజకీయ మూలవిరాట్టులున్నారు. రెండోసారి గెలుపు హ్యట్రిక్‌ సాధించిన ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీలో తొలిసారి అఖండమెజార్టీతో కొలువుతీరిన జగన్‌, వారికి తోచిన విధంగా ప్రజలకు మేళ్లు చేసేవిధంగా పాలనను ఆరంభించారు. తమకు ఎదురేలేదని కొత్తగా తాము శాసనాలు చేసి చూపుతామన్నట్లు ఈ నేతల తీరుతెన్నులు వారి పాలనలో జనాలకు సుస్పష్టం అయ్యాయి. వీరి శాసనాలకు అడ్డం పడడానికి సరైన ప్రతిపక్షమే లేదు. ఉన్నా ప్రజల్లో పేలని ఆరోపణలతో, అధికారపక్షాన్ని ఇరుకున పెట్టలేక ఆ ఇరుకుల్లో ఇరుక్కుపోయి ప్రతిపక్షనేతలే అభాసుపాలవుతున్నారు. మోదీ సాబ్‌కు లోక్‌సభలో ప్రతిపక్షంగా అతితక్కువ సంఖ్యాబలంతో కాంగ్రెస్‌ పేలవమైపోయింది. దాంతో మోదీ కొత్తపాలనకు ఉవ్వెత్తున తెరలెత్తారు.

కాశ్మీర్‌లో పాక్‌ ముచ్చట్లపై గన్సు గురిపెట్టేసి తరిమేసారు. ఇప్పుడు దేశమంతా ఒకేపార్టీ ఒకే జండా నీడలో దేశం, రాష్ట్రాలు, ఒకే భాషతో ఉండాలనే దిశలో పావులు కదిపేందుకు సన్నాహాలు ఆరంభించారు. అందుకు గాను ప్రాంతీయపార్టీలను, విభిన్న భాషలను తుంగలోకి తొక్కడానికి మోదీ అండ్‌కో నడుం బిగించేసారు. రెండోసారి ప్రధాని కాగానే జమిలి ఎన్నికల బూచిని నెత్తికెత్తుకుని అన్నిరాష్ట్రాల జనాల్లో నానిపోయేలా తిప్పితిప్పి మరో మూడేళ్లలో జనాల్లో దించేసే సన్నాహం ఆరంభించారు. జమిలి ఎన్నికలకు లోక్‌సభతో బాటు అన్నిరాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఎత్తుగడలో మోదీ మాస్టర్‌ప్లాన్‌ చిత్తుప్రతి తయారుచేసేసారు. రోజూ దానిలో చేర్పులుమార్పులు చేసేస్తున్నారు. దాన్ని మీడియాల్లో, జనాల్లో కూయమని తొలికూతల రాయుడుగా కేంద్రమంత్రి అమిత్‌షాతో రాగయుక్తంగా కూయిస్తున్నారు. మా దక్షిణాదిలో హిందీ సిన్మాలను, సిన్మాతారలను నెత్తికెత్తుకుంటాం. హిందీ రుద్దుడుకు ఒప్పుకోం అని కర్ణాటక, తమిళనాడు, కేరళలో నిలువెత్తు నిరశనలతో మోడీ ఆలోచనకు అడ్డంపడడంలో అక్కడ రాజకీయనేతలు,పార్టీలు పోటీపడుతున్నారు.

తెలుగు పాలకపెద్దలు మాత్రం మోదీ ఆలోచనలపై మోకాలడ్డులకు మౌనంగా ఉన్నారు. కేసీఆర్‌ ఆకర్షతో తెలంగాణాలో టీడీపీని లేకుండాచేసి భుజాలు చరుచుకున్నారు. అలాగే, ఇప్పుడు కాంగ్రెస్‌ను కూడా మట్టిలో కలిపేందుకు తన అమ్ములపొదిలో నిక్షిప్తమై ఉన్న ఆకర్షకు వేగం పెంచారు. పక్కనే పొంచున్న బీజేపీ కేసీఆర్‌ నుంచి ఆకర్షను అమ్ముల పొదితో సహ దొరకపుచ్చుకుని కేసీఆర్‌ కోటలో ఎంఎల్‌ఏలను లాక్కునే ఎత్తుగడలు, మంతనాలు ఉధృతం చేసేసారు. దాంతో కేసీఆర్‌ ఎన్నిమెట్లు దిగాలో అన్నిమెట్లు దిగేసి అతలా కుతలం అయిపోతున్నారు. మరోవైపు ఏపీ పాలకుడు జగన్‌కు ఆర్ధికఇబ్బంది పెనుభూతమయ్యింది. ఖజానాలో ఎంతధనం చేరినా, దారుణంగా దించబడ్డ చంద్రబాబు చేసిన అప్పులు, పెండింగ్‌బిల్లులు, అంతులేని బాకీలతో ఏపీ పాలకులకు కాళ్లూచేతులు ఆడని పరిస్థితి నెలకొని ఉంది. వీటి చెల్లింపులకు ఏమూలకు అన్నట్లు రాష్ట్రఖజానా నిత్యం డొల్లగానే ఉంటోంది.

ఇప్పుడు మోదీ పాలనను, కేంద్రాన్ని పల్లెత్తు మాటంటే ఇవ్వవల్సిన చిన్నపాటి ధనసాయం చేయరు. రావాల్సిన ప్యాకేజీలు, హోదాఇవ్వరు. లేనిపోని కొర్రీలు వేస్తారు. ఈ భయంతో జగన్‌ ఆనాడు బద్దెనకవి విరచిత సుమతీ శతకంలో ఒక పద్యాన్ని అనునిత్యం మోదీ అండ్‌కో గుర్తుకు వచ్చినప్పుడల్లా వల్లె వేయడంలో ఉన్నారు. ఆపద్యం ఏమిటంటే 'ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి| యన్యుల మనముల్‌ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు| ధన్యుడు సుమతీ!' కేంద్రహోమ్‌ మంత్రి అమిత్‌షా అమితోత్సాహంతో హిందీభాషను దేశమంతా రుద్దేస్తామంటున్నారు. దానిపై దక్షిణాదిలో పలుపార్టీల నిరశనలను ఉదృతమవుతునే ఉన్నాయి. ఇంకా రుద్దలేదు కదా, అంతవరకు వస్తే ఆచితూచి అడుగులు వేద్దాం అనే మెతకమెతక తీరును జగన్‌ చూపారు.

జనాలు నోళ్లు బార్లా తెరిచేలా ఈఐదేళ్లలో పలువండర్సు చేద్దామని మోదీ పావులు కదుపుతున్నారు. అందులో బ్యాంకులు కుదించేసారు. ఏది చేయాలన్నా నిలదీసే పాలకులే లేని తెలుగు రాష్ట్రాలలో దాదాపు వందేళ్ల ఆంధ్రాబ్యాంకును మరో పెద్ద బ్యాంకులో నిమజ్జనానికి ఏర్పాట్లు బాజాభజంత్రీలతో ఆరంభించేసారు. మోదీకి 2019 ఎన్నికల్లో చుర్రుమనే మంట లెక్కించిన వారిలో శతశాతం చంద్రబాబు అయితే, అర్ధశత శాతం కేసీఆరే. బాబు కాంగ్రెస్‌తో సహ మరిన్ని తెగిపోయిన టిక్కెట్లులాంటి పార్టీలతో మోదీని కుప్పకూల్చుదాం. గోద్రా నరరూపరాక్షసుడు మోదీని ఇంట్లో కూర్చోబెడదాం అని వేసిన ఎన్నికల రంకెలు నేటికి మోదీచెవుల్లో గింగురుమంటూ నిద్ర పోనీయడంలేదు. మరోవైపు బాబుకు, కేసీఆర్‌లకు మోదీ అంటేనే హడల్‌గా ఉంది.

మోదీయే పక్కలోబల్లెంలా భూతద్దంలో త్రీడి ఎఫెక్టులో కన్పిస్తుంటే బాబు, కేసీఆర్‌లు మాగన్ను నిద్రకే పరిమితం అయ్యారు. నేరకపోయి మోదీతో పెట్టుకున్నామే అనే భయంతో విలవిలలాడిపోతున్నారు. అందుకే ఇద్దరు కేంద్రంతో పరుగులు మానేసి ఉన్నంతలో రాష్ట్రంలో ఇల్లు గెలిచి రచ్చగెలవచ్చని డిసైడ్‌ అయ్యారు. ఈ ఇద్దరిలో కేసీఆర్‌కు రెండోసారి పట్టాభిషేకం జరిగితే వంకర నిర్ణయాలతో ఒకింత పెట్రేగడంతో బీజేపీకి అవకాం లభించింది. పక్కపార్టీల్లో వారిని కలుపుకుని లేని బలుపును వాపులో అయినా చూపించాలనే తహతహలాడుతోంది. అలాంటి వాపు కూడా బీజేపీకి దక్కనీయరాదని కేసీఆర్‌ ఇల్లు గెలిచేందుకు యాతనలు పడడంలో ఉన్నారు. ఇక ఓడిన చంద్రన్న కేంద్రంవైపు చూడనట్టే నటిస్తూ  కృష్ణాకరకట్టల్లో ఉన్న అక్రమకట్టడంలో ఉంటూ జగన్‌ సర్కారుపై తట్టలకొద్దీ బురద జల్లుడుకి దారులు వెతకడంలో  తలము నకలయ్యారు.

రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి హత్య జరిగినా హతుడు నాపార్టీ సానుభూతిపరుడే. చంపింది వైసీపీవాళ్లే. చేయిస్తున్నది ఉన్మాది జగనే అని జగన్‌ హత్యలచిఠ్ఠా పేరిట పెద్దబైండ్‌బుక్‌లో చంద్రన్న రాసేసుకుంటున్నారు. పచ్చ మీడియాల్లో తన ఆస్థాన వాగుడుకాయల్లాంటి నేతలకు ఆచిఠ్ఠా ఇచ్చి గుండెలు బాదుకుని మరీ వాగమంటున్నారు. ఇంకా చంద్రబాబు అండ్‌కో, పచ్చమీడియా పెద్దలు జనాలకు ఏదిచెబితే అదే చెవులారా వింటారని, తలూపి నిజమే అనుకుంటారనే తలంపుల్లో తిమ్మినిబమ్మినిచేసే సాహసోపేతమైన చర్యలను 1982 నుంచి కలాలు మడమతిప్పకుండా రాసేస్తున్నారు. జనాలకు బాబు అండ్‌కో, పచ్చమీడియాల గురించి తెలిసినంతగా వైసీపీ నేతలకు,వాళ్ల మీడియాకు సయితం తెలియదనే చెప్పాలి. కనుకనే ఎన్నికల్లో ఏదో 100 సీట్లతో గెలుస్తామంటే గెలుస్తాం అని అనుకున్నారు వైసీపీ నేతలు. కానీ, జనాలు నిశ్శబ్ధవిప్లవాన్ని ఎంతమేరకు చూపాలో చూపేసారు. అంతగా రాష్ట్రమంతా ఒకేచోట కోట్లాది జనాలు గుమిగూడి నిర్ణయంచేసినట్లుగా 102 సీట్లున్న టీడీపీని 23 సీట్లకు కుదగొట్టేసారు. అయినా బాబుకు, పచ్చమీడియాకు వీసమెత్తు జ్ఞానోదయం కాలేదు. ఆపాతరాతలే, ఆపాత ఎత్తు బడులే ఇంకా ప్రజల్ని నమ్మించి బుట్టలో వేసుకునే ప్రదర్శనలకు తెగబడుతున్నారంటే ఏమనుకోవాలి?

తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో మొదలయిన టీడీపీ ఏనాడు ఆత్మగౌరవం అంటే ఏమిటో తెలుగువారి ముందు ప్రదర్శించలేదు. ఎన్ని వికారపుపనులు చేయాలో అన్నీ ఎడతెరిపిలేకుండా నాటి నుంచి నేటివరకు చూపుతునే ఉంది. ఆనాడు 1993లో ఫ్యాక్షనిస్టు శివారెడ్డిని హైద్రాబాద్‌లో పట్టపగలు హత్య చేస్తే, అప్పటి టీడీపీ మూలవిరాట్టు ప్రతి పక్షనేత ఎన్‌టీఆర్‌  తనమందితో శవం వద్దకు పోలీసులను రానీయలేదు. శవాన్ని ఎత్తుకుని గవర్నర్‌ వద్దకు పెద్ద ఊరేగింపుగా తీసుకుపోయారు. ఆయన ముందుపడేసి, హత్యల పిశాచి, నెత్తురు మరిగిన మృగం కాంగ్రెస్‌ చేసిన హత్య. రాష్ట్రాన్ని నెత్తురుమడుగుగా చేసేస్తున్న ఇందిరాకాంగ్రెస్‌ సర్కారును డిస్మిస్‌ చేయండి అని నినాదాలతో హోరెత్తిపోయారు. అప్పుడే టీడీపీ దృష్టిలో పోలీస్‌లన్నా, చట్టమన్నా ఎంత చులకనో సమస్త ప్రజలు బిక్కముఖాలు వేసి చూసారు.

ఈ తీరును ఇతర రాష్ట్రాలలో ప్రతిపక్షాలు నేటికి అనుసరించలేదు. అలాంటి శవరాజకీయాలు టీడీపీకి నేడు కొత్తకాదు. ఆపార్టీలో శవరాజకీయాలు పలుసందర్భాలలో నిస్సిగ్గుగా జనాల ముందు వికృతంగా ప్రదర్శించడంలో నేటి టీడీపీనేత చంద్రన్న మరీ ముందున్నారు. ఫ్యాక్షన్‌ హత్యకు గురయిన మాజీమంత్రి పరిటాలరవిని అప్పటి సీఎం రాజశేఖరరెడ్డే హతమార్చినట్లు ఆపైన వైయస్‌ కొడుకు జగనే హత్య చేసినట్లు ఆధారాలు తనవద్ద ఉన్నట్లు ప్రచారంతో హోరెత్తారు. పెద్దఎత్తున బాబు వందలాది బస్సులు తగలెట్టించారు. ఇలాంటి శవరాజకీయాల్లో బాబును మించినవాళ్లు లేరనిపించుకున్నారు. ఈ శవ రాజకీయాలను ఆపార్టీలో కూడా నమ్మేవారి శాతం బహుతక్కువ. ఇక జనాలు ఏమేరకు నమ్ముతారు? నమ్మినా నమ్మకపోయినా బాబు అధికారపార్టీపై బురదజల్లాననే ఆనందంలో ఓలలాడుతారు.

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?