cloudfront

Advertisement


Home > Politics - Political News

రేవంత్‌ను తిడితే కోపం చల్లారుతుందా?

	రేవంత్‌ను తిడితే కోపం చల్లారుతుందా?

'నిను వీడని నీడను నేనే...కలగా మిగిలే కథ నేనే'...అనే సినిమా పాట మాదిరిగా తెలంగాణ టీడీపీ మాజీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వదలడంలేదు. ఈయన పార్టీ నుంచి బహిష్కరణకు గురై సుమారు నెలన్నర కావొస్తోంది. అయినప్పటికీ బూతుల పర్వం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు హైదరాబాదులో, ఆలేరులో తిట్టిన మోత్కుపల్లి తాజాగా తిరుపతి వెళ్లి బూతుల పంచాంగం విప్పాడు.  తిట్టిన తిట్లే మరోసారి తిట్టాడు.

ఆరోగ్యం బాగాలేకపోయినా కాలి నడకన తిరుమల వెళ్లి వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీని గెలవకుండా చేయాలని ఏడుకొండలవాడికి కోరుకున్నాడు. 'చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, మోసగాడు, గజదొంగ, నమ్మకద్రోహి'..అంటూ విరుచుకుపడ్డాడు. గవర్నర్‌ పదవి, రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి నట్టేట ముంచాడని అన్నాడు. ఇంకా చాలా తిట్లు తిట్టాడనుకోండి. ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు. అన్నీ పాతవే. గత ఎన్నికల్లో బాబు అధికారంలోకి రాగానే మోత్కుపల్లికి గవర్నర్‌ పోస్టు ఇప్పిస్తానని వాగ్దానం చేశారు. గవర్నర్‌ పదవి కథ సాగి...సాగి ఆగిపోయింది.

ఇదిలా ఆగిపోవడానికి కేంద్ర ప్రభుత్వం కారణం కాదని, చంద్రబాబేనని మోత్కుపల్లి ఇదివరకు చెప్పాడు. 'గవర్నర్‌ పదవి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే, ప్రత్యేక హోదా ఉద్యమం నడుస్తోందని దాన్ని ఆపించింది మీరు కాదా?' అని మోత్కుపల్లి బాబును ప్రశ్నించాడు. ఈయనకు రేవంత్‌ రెడ్డి అంటే పడదు. పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరూ పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆయనపై చర్య తీసుకోలేదని మోత్కుపల్లికి ఆగ్రహంగా ఉంది.

రేవంత్‌ పార్టీ నుంచి వెళ్లిపోయినా, పార్టీని విమర్శించినా ఏమీ అనలేదని చెప్పారు. మోత్కుపల్లి చెప్పింది నిజమే. కాని రేవంత్‌ రెడ్డిని చంద్రబాబు ఏమీ అనరు. అనలేరు. వీరిద్దరూ ఓటుకు నోటు కేసులో పాత్రధారులు కదా. రేవంత్‌ రెడ్డి ప్రత్యక్ష పాత్ర పోషించి తెర మీదికి ఎక్కగా, చంద్రబాబు తెర వెనక గొంతు వినిపించారు. రేవంత్‌ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు అధ్యక్షుడు రమణతో, మోత్కుపల్లితో గొడవ పడినా చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు. ఇప్పటికీ అదే వైఖరి కొనసాగిస్తున్నాడు.

టీడీపీకీ రాజీనామా చేయగానే అమరావతికి వెళ్లిపోయి, శాసనసభ్యతానికి రాజీనామా లేఖను అక్కడే అందించాడు. వాస్తవానికి దాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకరుకు అందించాలి. చంద్రబాబు దాన్ని స్పీకరుకు పంపకుండా పక్కన పెట్టేశారు. తెలంగాణలో కాంగ్రెసుతో టీడీపీ పొత్తు పెట్టుకునే విషయంలో రేవంత్‌ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇదంతా బాబు-రేవంత్‌ మధ్య అవగాహన మేరకే జరుగుతోంది. వచ్చే ఎన్నికల తరువాత రేవంత్‌ కాంగ్రెసును నుంచి బయటకు వస్తే చేరేది టీడీపీలోనే. మోత్కుపల్లి ఎంత అరిచి గీపెట్టినా రేవంత్‌ను చంద్రబాబు ఏమీ అనరు.