Advertisement

Advertisement


Home > Politics - Political News

అప్ప‌టి నుంచి జేసీ ఫ్యామిలీ తీరులో చాలా మార్పు!

అప్ప‌టి నుంచి జేసీ ఫ్యామిలీ తీరులో చాలా మార్పు!

గ‌త కొన్నాళ్లుగా చ‌డీచ‌ప్పుడు లేకుండా గ‌డుపుతున్నారు జేసీ సోద‌రులు. జేసీ సీనియ‌ర్లు కానీ, జేసీ జూనియ‌ర్లు కానీ.. ఈ మ‌ధ్య మీడియాకు ఎలాంటి మేత‌ను అందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఒక్క మాట‌లో చెప్పాలంటే వీళ్లు ఇప్పుడు కిక్కురుమ‌న‌డం లేదు. 

అధికారం కోల్పోయిన కొత్త‌లో కూడా జేసీ సోద‌రులు బాగా రంకెలు వేశారు. అటు దివాక‌ర్ రెడ్డి, మ‌రోవైపు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.. ఇంకోవైపు జేసీ ప‌వ‌న్, అస్మిత్ లు కూడా హ‌డావుడి చేశారు. ఇద్ద‌రికి న‌లుగురు అన్న‌ట్టుగా సాగింది వీరి ర‌చ్చ‌.

ప్ర‌త్యేకించి ప్ర‌భాక‌ర్ రెడ్డి అయితే ఒక రేంజ్ లో హ‌డావుడి చేశారు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో వ‌ర‌స‌గా రెండు సార్లు జైలుకు వెళ్లారు. అనుచితంగా ప్ర‌వ‌ర్తించి, ఏం చేస్తారో చేసుకోండ‌న్న‌ట్టుగా ఆయ‌న ర‌చ్చ చేశారు. ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఏదో ఒక ర‌క‌మైన కామెంట్ చేస్తూ వ‌చ్చారు దివాక‌ర్ రెడ్డి.  

త‌న వ్యాపారాల్లో లొసుగులున్నాయ‌ని ఒప్పుకుంటూనే.. లొసుగులు లేకుండా వ్యాపారాలు చేయ‌డం సాధ్యం కాదంటూ ర‌చ్చ చేశారు. జ‌గ‌న్ కు శాప‌నార్థాలు పెట్టారు, వ్యంగ్యంగా స్పందించారు, ఏదేదో చేశారు.

ఇక జేసీ ప‌వ‌న్ యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ఎక్కి నీతి శ‌త‌కాల‌ను వ‌ల్లెవేశారు. నీతులు చెబితే వీళ్లే చెప్పాల‌న్న‌ట్టుగా ఉంటాయి ఆ వీడియో ఇంట‌ర్వ్యూలు. చ‌రిత్ర అడ‌క్కు చెప్పింది విను అన్న‌ట్టుగా ఉంటాయి ప‌వ‌న్ మాట‌లు. అంతులేని ఆ నీతి శ‌త‌కాలు వింటే మ‌తిపోతుంది.

ఎలాగైతేనేం.. ఇప్పుడు జేసీ ఫ్యామిలీ చ‌డీచ‌ప్పుడు చేయ‌డం లేదు. దివాక‌ర్ రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డిలు మీడియాకు క‌నిపించ‌డం లేదు. దివాక‌ర్ రెడ్డి త‌న చీనీ తోట‌లో సేద‌తీరుతుంటార‌ట‌. ప్ర‌భాక‌ర్ రెడ్డి అప్పుడ‌ప్పుడు తాడిప‌త్రిలో ద‌ర్శ‌న‌మిస్తుంటారు. అయితే హాట్ కామెంట్స్ లేవు, వాడీవేడీ రాజ‌కీయం లేదు. 

ప్ర‌త్యేకించి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వ‌ర్గాన్ని గెలిపించుకుని.. జ‌గ‌న్ నుంచి అడ్డుపుల్ల ఏదీ ప‌డ‌కుండా మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విని ప్ర‌భాక‌ర్ రెడ్డి సొంతం చేసుకున్న త‌ర్వాత వారి వ్య‌వ‌హ‌ర‌ణ తీరులో చాలా మార్పు వ‌చ్చింది. 

జ‌గ‌న్ అనుకుని ఉంటే.. తాడిప‌త్రి మున్సిపాలిటీ త‌మ‌కు ద‌క్క‌కుండా చేయ‌డం క‌ష్టం కాద‌ని, కానీ ఆయ‌న ఆ ప‌ని చేయ‌లేదంటూ స్వ‌యంగా ప్ర‌భాక‌ర్ రెడ్డి కితాబిచ్చారు. స‌రిగ్గా అప్ప‌టి నుంచినే నోరు పారేసుకోవ‌డం త‌గ్గిపోయింద‌నేది బ‌య‌ట‌కు స్ప‌ష్టం అవుతున్న విష‌యం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?