Advertisement

Advertisement


Home > Politics - Political News

ముర‌ళీ మోహ‌న్, చంద్ర‌బాబుల మ‌ధ్య ఏం జ‌రిగింది?

ముర‌ళీ మోహ‌న్, చంద్ర‌బాబుల మ‌ధ్య ఏం జ‌రిగింది?

త‌ను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కే కాదు, ప‌రోక్ష రాజ‌కీయాల‌కు కూడా పూర్తిగా దూరం అయిన‌ట్టుగా సినీ న‌టుడు, నిర్మాత‌.. ఒక‌ప్ప‌టి తెలుగుదేశం నేత ముర‌ళీ మోహ‌న్ కొన్నాళ్లుగా స్ప‌ష్టం చేస్తూ వ‌స్తున్నారు. రియ‌లెస్టేట్ వ్యాపారంలో బాగా స్థిర‌ప‌డ్డార‌నే పేరును కూడా క‌లిగి ఉన్న ముర‌ళీ మోహ‌న్ ఇప్పుడు పూర్తిగా త‌న వ్యాపార వ్య‌వ‌హారాల‌కు ప‌రిమితం అయిన‌ట్టుగా చెబుతూ వ‌చ్చారు. అలాగే వీలైతే త‌ను మ‌ళ్లీ సినిమాల నిర్మాణానికి కూడా పూనుకొంటానంటూ ఆయ‌న కొన్నాళ్ల నుంచి చెబుతున్నారు.

గ‌తంలో జ‌య‌భేరీ బ్యాన‌ర్ పై ప‌లు సినిమాల‌ను రూపొందించారు ముర‌ళీ మోహ‌న్. ద‌శాబ్దాల కింద‌టే చిన్న సినిమాల‌తో మొద‌లుపెట్టి ఆ త‌ర్వాత నాగార్జున‌, మ‌హేశ్ బాబు వంటి స్టార్ల‌తో కూడా సినిమాల‌ను నిర్మించారు ముర‌ళీ మోహ‌న్. పొలిటిక‌ల్, రియ‌లెస్టేట్ యాక్టివిటీల్లో బిజీగా ఉంటూ కూడా ఆయ‌న సినిమాలు తీశారు. అత‌డు సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న నిర్మించిన ఆఖ‌రి సినిమా. క‌మ‌ర్షియ‌ల్ గా ఆ సినిమాతో ఆయ‌న న‌ష్టాల‌ను ఎదుర్కొన్నారనే మాట వినిపిస్తూ ఉంటుంది. దాంతోనే ఆయ‌న సినిమాల నిర్మాణం ఆపార‌నే విశ్లేష‌ణా వినిపిస్తూ ఉంటుంది.

ఈ అంశాల‌పై తాజాగా ఒక టీవీ చాన‌ల్ ఇంట‌ర్వ్యూలో ముర‌ళీమోహ‌న్ స్పందిస్తూ, అత‌డు సినిమాను త‌ను పూర్తిగా మేనేజ‌ర్ల మీద వ‌దిలి పెట్టాన‌ని, సినిమా నిర్మాణాన్ని ద‌గ్గ‌రుండి చూసుకోలేక‌పోతే దాని జోలికి పోకూడ‌ద‌ని త‌ను ఆ త‌ర్వాత మ‌ళ్లీ సినిమాలు ప్రొడ్యూస్ చేయ‌లేద‌ని ముర‌ళీ మోహ‌న్ అన్నారు.

ఇక త‌ను రాజ‌కీయాల‌కు పూర్తిగా దూరం అయిన‌ట్టుగా, త‌న వార‌సులు కూడా వ్యాపారం మీదే దృష్టి పెట్టార‌ని, ఇక రాజ‌కీయాల జోలికి వెళ్లే  ఉద్దేశం లేద‌ని ఆయ‌న తెలిపారు. మాజీ ఎంపీగా కొన్ని అంశాల‌పై పొలిటిక‌ల్ కామెంట్లు చేయ‌మ‌ని మీడియా నుంచి కాల్స్ వ‌చ్చినా, వాటికి త‌ను దూరంగా ఉన్న‌ట్టుగా చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ముర‌ళీ మోహ‌న్ రాజ‌కీయంగా త‌న తీర‌ని కోరిక‌ను తెలిపారు. ఒక్క సారి టీటీడీ చైర్మ‌న్ కావాల‌నేది త‌న దీర్ఘ‌కాల వాంఛ అని, ఈ విష‌యంలో చంద్ర‌బాబును అడిగి త‌ను కుద‌ర‌ద‌ని అనిపించుకున్న‌ట్టుగా ఆయ‌న తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న‌కు టీటీడీ చైర్మ‌న్ అవ‌కాశం గురించి చాలా విన్న‌వించుకున్న‌ట్టుగా ముర‌ళీ మోహ‌న్ చెప్పారు. త‌న‌కు ఆ ప‌ద‌వి ఖ‌రారు అయ్యింద‌ని కూడా మీడియాలో ప్ర‌చారం జ‌రిగింద‌ని, అయితే త‌న నియామ‌కం జ‌ర‌గ‌లేద‌న్నారు.

ఈ విష‌యం గురించి చంద్ర‌బాబును అడిగితే.. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీల‌కు టీటీడీ చైర్మ‌న్ పోస్టు ఇవ్వ‌కూడ‌ద‌ని పాల‌సీ పెట్టుకున్న‌ట్టుగా త‌న‌తో అన్నార‌ని ముర‌ళీ మోహ‌న్ తెలిపారు. ఇక త‌ను ఏం చెప్ప‌లేక‌పోయిన‌ట్టుగా, ఇక టీటీడీ చైర్మ‌న్ పీఠం దొరికే అవ‌కాశం లేద‌ని త‌న‌కు అర్థ‌మైంద‌ని ఆయ‌న అన్నారు. టీటీడీ చైర్మ‌న్ గా నియ‌మితం కావ‌డం రాజ‌కీయంగానే సాధ్యం అవుతుంది కాబ‌ట్టి, ఇక రాజ‌కీయంగా కూడా త‌న‌కు అది సాధ్యం కాద‌ని త‌ను అనుకుని ఇంట్లోనే వెంక‌టేశ్వ‌రుడి ప్ర‌తిమ‌ను పెట్టి పూజించుకుంటున్న‌ట్టుగా ముర‌ళీ మోహ‌న్ అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?