Advertisement


Home > Politics - Political News
నా సంకల్పం ఓ భగవద్గీత

నవ నిర్మాణ దీక్ష నేపథ్యంలో తాను చేపట్టిన మహా సంకల్పాన్ని భగవద్గీతగా భావించాలని ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. తన సంకల్పాన్ని బైబిల్‌, ఖురాన్‌గా తీసుకోవాలన్నారు. అలాగే ప్రతివొక్కరు ఒక బాహుబలి కావాలని, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి సినిమాను అందరూ తప్పనిసరిగా చూడాలని పిలుపునిచ్చారు.

బాహుబలి అంతటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన నిపుణులు నేడు చరిత్ర సృష్టించారన్నారు. ప్రతివొక్కరు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని కూడా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. అలనాడు నిర్మించిన నాగార్జున సాగర్‌, శ్రీశైలం వంటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను మనం చూడలేదని, అటువంటి అరుదైన ప్రాజెక్ట్‌ మన కాలంలో నిర్మింతమవుతున్న నేపథ్యంలో, నిర్మాణ దశలో ప్రతివొక్కరు ప్రాజెక్ట్‌ను చూసి తీరాలని పిలుపునిచ్చారు.

మళ్ళీ ఇటువంటి ప్రాజెక్ట్‌ను దేశ చరిత్రలో చూడలేమని వ్యాఖ్యానించారు. పేదరికంపై పోరాడుతున్నానని, పేదరికమే తన కులమని ఆయన వ్యాఖ్యానించారు. తన చివరి రక్తపు బొట్టు వరకు పేదల కోసం జీవిస్తానని చెప్పారు. గతంలో కాపులకు ఇచ్చిన హామీని తాను మరచిపోనని, మంజునాథ కమీషన్‌ నివేదిక అనంతరం ఇందుకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు.

అంతవరకు కులం, మతం పేరుతో రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు... రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 33వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా అందించారని, ఒక్కపైసా కూడా ఆశించకుండా కేవలం తనపై నమ్మకంతో భూములు ఇచ్చారంటే ఇదొక చరిత్ర అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రైతుల సంక్షేమానికి  ప్రభుత్వం అన్ని విధాలుగా చిత్తశుద్ధితో ఉందని, అధికారంలోకి రాగానే రాష్ట్రంలో విద్యుత్‌ కోతల్లేకుండా, 24 గంటల విద్యుత్‌ అందించగలిగినట్టు చెప్పారు. ప్రతివొక్కరు అమ్మను దైవంగా పూజించాలని, అమ్మతో మాతృభూమి ఆంధ్రప్రదేశ్‌, అమరావతిని మరువకూడదని సూచించారు.

త్వరలో పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమాన్ని చేపడతామన్నారు. త్వరలో నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని చెప్పారు. 2013 జూన్‌ 2న పంతమాత్రం హేతుబద్ధత లేకుండా, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని, అదేరోజు ఇటలీ దేశానికి రిపబ్లిక్‌డే అని చంద్రబాబు తెలిపారు.

అత్యంత దుర్మార్గంగా, పార్లమెంట్‌ తలుపులు మూసివేసి, టీవీల ప్రసారాలు నిలిపివేసి, రాష్ట్రానికి చెందిన పంపీలను చితకబాది, అత్యంత కిరాతకంగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారని వ్యాఖ్యానించారు. అందుకే జూన్‌ 2వ తేదీని అందరూ గుర్తు పెట్టుకుని, కాంగ్రెస్‌ పార్టీ చేసిన ద్రోహనికి చిహ్నంగా ప్రతిఏటా నిర్మాణ దీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.