cloudfront

Advertisement


Home > Politics - Political News

నాటి వైఎస్‌, బాబు.. నేటి జగన్‌ పాదయాత్రల తీరు..!

నాటి వైఎస్‌, బాబు.. నేటి జగన్‌ పాదయాత్రల తీరు..!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పాదయాత్రలను అధ్యయనం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేస్తే, ఆ తర్వాత ఆయన కుమార్తె షర్మిల, తదుపరి, ప్రస్తుతం వైఎస్‌ కుమారుడు, ఏపీ విపక్షనేత జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా పాదయాత్ర చేశారు. చంద్రబాబు పాదయాత్రకు, జగన్‌ పాదయాత్రకు ఒకతేడా కనిపిస్తుంది. చంద్రబాబు వద్ద పాసివ్‌గా ఉండే జనం కనిపిస్తే, జగన్‌ వద్ద యాక్టివ్‌ జనం కనిపిస్తున్నారు.

ఒకసారి గతంలోకి వెళితే దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి అప్పుడే పదిహేను సంవత్సరాలు అయిందా అనిపిస్తుంది. ఆ రోజులలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు ఉంటుందో తెలియదు. అందులోను 1999లో కచ్చితంగా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని భావిస్తే కార్గిల్‌ ఎఫెక్ట్‌ అనండి, వాజ్‌పేయి గాలి అన్నీకలిసి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి.

దాంతో అప్పటికే పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ శ్రేణులలో తీవ్ర నిరాశ ఏర్పడింది. ఆ తరుణంలో నాయకత్వ పగ్గాలు వదులుకోవడానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సిద్ధమయ్యారు. కాని ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలంతా వైఎస్‌ రాజశేఖరరెడ్డే శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండాలని భావించారు. అది కాంగ్రెస్‌కు పెద్దమలుపు అయింది. ఆ తర్వాత ఆయన శాసనసభలోను, బయట రాజకీయ పరిస్థితులను సవాల్‌గా తీసుకుని పనిచేశారు. నిరంతరం ప్రజలలో ఉంటూ టీడీపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను బలమైన పార్టీగా తయారు చేయడంలో కీలక భాద్యత వహించారు.

అప్పట్లో సీనియర్‌ నేత ఎమ్‌.సత్యనారాయణరావు పీసీసీ అధ్యక్షుడుగా ఉండేవారు. ఆ తర్వాత మరో సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ అధ్యక్షుడుగా ఉన్నారు. సాధారణంగా పీసీసీ అధ్యక్షుడిదే పైమాటగా ఉంటుంది. కాని వైఎస్‌ విషయంలో అలాకాదు. మొత్తం పార్టీ అంతటిని తన భుజస్కందాల మీద వేసుకుని తన సన్నిహితుడు మిత్రుడు కేవీపీ రామచంద్రరావుతో పాటు పలువురు నేతలను విశ్వాసంలోకి తీసుకుంటూ రాజకీయం సాగించారు. ఆ తరుణంలో వచ్చిన ఒక ఐడియా పాదయాత్ర. అప్పట్లో అది పెద్ద సంచలన వార్త అయింది.

తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ప్రజలలో విరక్తి ఏర్పడింది. చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. వ్యవసాయాన్ని ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయం ఉండేది. దానికి తోడు కరువు సమస్య అధికంగా ఉండేది. ఆ దశలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించడం మరో సంచలనం. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి అది బాగా ఉపకరించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏవేవో చేయగలమో వివరిస్తూ ఆయన పాదయాత్ర సాగించారు. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గమైన చేవెళ్ల నుంచి ఆయన పాదయాత్ర ఆరంభించారు.

అప్పటి నుంచి చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్‌గా పలు కార్యక్రమాలను కూడా వైఎస్‌ అక్కడే ఆరంభించేవారు. వైఎస్‌ పాదయాత్ర ఆరంభించినప్పుడు తెలంగాణ వాదులు, ముఖ్యంగా కాంగ్రెస్‌లోని తెలంగాణ వాదుల నుంచి కూడా ఇబ్బంది ఎదురైంది. ఆయనకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే చిన్నారెడ్డే ఈ నినాదాన్ని భుజాన ఎత్తుకుని చేవెళ్లలో కొద్దిగా ఇబ్బంది పెట్టారు. అయినా వైఎస్‌ చలించలేదు. ఆయన తెలంగాణలోని ఆయాజిల్లాల మీదుగా పాదయాత్ర సాగించారు. ఆయన పంచకట్టుతో, తలపాగాతో నడుస్తుంటే పల్లెటూళ్లలో అచ్చం ఒక రైతు నడుస్తున్నట్లుగా ఉండేది.

పెద్దగా సదుపాయాలు లేకుండానే ఆయన యాత్ర చేశారు. మధ్యలో రాజమండ్రి చేరుకునే సరికి ఆయనకు ఆరోగ్యం కూడా ఇబ్బంది పెట్టింది. కొన్నాళ్లపాటు ఆయన విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. అయినా ఆయన పట్టు వీడలేదు. ఇచ్చాపురం వరకు పాదయాత్ర పూర్తిచేసి పట్టుదల కల మనిషిగా రుజువు చేసుకున్నారు. దీని ప్రభావం వల్ల వైఎస్‌ కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా ప్రజలముందుకు రావడమే కాకుండా, దేశచరిత్రనే ఒకమలుపు తిప్పారు.

ఉమ్మడి ఏపీ నుంచి కాంగ్రెస్‌కు ముప్పైకి పైగా లోక్‌సభ సీట్లు రావడంతో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం తేలిక అయింది. 2009లో కూడా వైఎస్‌ ప్రభుత్వ పనితీరు వల్ల రెండోసారి అధికారంలోకి రావడమే కాకుండా మళ్లీ ముప్పైకి పైగా లోక్‌సభ స్థానాలు దక్కాయి. కాని కాంగ్రెస్‌లోని వర్గాలు ఇదంతా సోనియాగాంధీ ప్రభావం అని భ్రమపెట్టాయి. తద్వారా సోనియాగాంధీలో వైఎస్‌ కుటుంబం పట్ల ఒక అసూయ పెంచేలా చేశాయి.

అందువల్లే అనూహ్యంగా వైఎస్‌ మరణం తర్వాత సోనియాగాంధీ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుని, 2014 నాటికి ప్రభుత్వాన్ని కోల్పోయింది. పార్టీని ముంచేసుకుంది. ఆ తర్వాత పరిణామాలలో కాంగ్రెస్‌, టీడీపీ కలిసి రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌పై కేసులు పెట్టడం, ఆయనను జైలులో పెట్టి ఇబ్బంది పెట్టడం జరిగాయి. అయినా ఆయన ఎక్కడా వెరవలేదు. పైగా తన సోదరి షర్మిలను, తల్లి విజయమ్మను జనంలోకి పంపించారు. షర్మిల అయితే ఏకంగా పాదయాత్ర చేపట్టి తన సోదరుడి తరపున ప్రజలలో ప్రచారం చేశారు.

నిజానికి 2014లోనే జగన్‌ అధికారంలోకి రావల్సింది. కాని వివిధ కారణాలు ముఖ్యంగా మోడీ ఫ్యాక్టర్‌, పవన్‌ ప్యాక్టర్‌, చంద్రబాబు చేసిన అనేక వందల అబద్దపు హామీలు కలిసి ప్రజలను భ్రమింపచేయడంతో జగన్‌ అధికారంలోకి రాలేకపోయారు. చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. అయితే ఆయన దాదాపు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించి, ఆ తర్వాత రెండుసార్లు ఓడిపోయిన తర్వాత పాదయాత్ర చేశారు. అందులో ఆయన ఏ వాగ్దానం కావాలంటే దానిని చేయడానికి వెనుకాడలేదు.

తెలంగాణలో విభజనకు అనుకూలంగా ఉపన్యాసాలు ఇచ్చారు. ఆంధ్రలో ఆ ఊసు ఎత్తకుండా జాగ్రత్తపడేవారు. అలాగే తొంభైవేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని, పదిహేను వేలకోట్ల డ్వాక్రా రుణాలు మాఫీచేస్తామని, నెలకు రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇలా అనేక ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించే యత్నంచేశారు. ఆయన అధికారంలోకి వచ్చారు కాని, ఇప్పుడు అబద్దాలు ఆడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు అప్రతిష్టపాలడం ఒక విషాదంగా చెప్పాలి.

చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను నిజామాబాద్‌లో ఒక సభ వద్దకు వెళ్లాను. సభ పూర్తి అయ్యాక ఒక సామన్య రైతును స్పందన కోరా. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగాచేసి ఉంటే ఇప్పుడు ఇలా పాదయాత్ర చేయవలసిన అవసరం ఏమి వచ్చేది అని సింపుల్‌గా చెప్పారు. అది చంద్రబాబుకు ఉన్న క్రెడిబిలిటీ. ఇక ఇప్పుడు జగన్‌ కూడా తన తండ్రి అడుగుజాడలో పాదయాత్ర చేస్తున్నారు. గతంలో జగన్‌ వాస్తవాలు చెప్పడం, ఆచరణ సాధ్యంకాని హామీలను ఇవ్వకపోవడం వంటి వాటి వల్ల ఆయన అధికారంలోకి రాలేకపోయినా, ఒక విశ్వసనీయత నిలబెట్టుకున్నారు.

అదే ఆయనకు ఇప్పుడు వరంగా మారింది. అందువల్ల తన తండ్రి పాదయాత్రలో కన్నా ఇప్పుడు ప్రజలు విశేష సంఖ్యలో వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నప్పుడు పాసివ్‌ ఆడియన్స్‌ ఎక్కువగా ఉండేవారు. అంటే ఏదో వచ్చారులే.. చూసిపోదాం అన్నట్లుగా ఉండేవారు. కాని జగన్‌ పాదయాత్రలో యాక్టివ్‌ ఆడియన్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే జగన్‌ మాటలకు ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారు.

జగన్‌ కూడా ప్రజలను తన ప్రసంగంలో భాగస్వాములను చేస్తూ వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటూ కొనసాగిస్తున్నారు. దాంతో అవి రక్తికడుతున్నాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర కాంగ్రెస్‌కు ప్రాణంపోస్తే, ఇప్పుడు జగన్‌ పాదయాత్ర వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను అధికార పీఠం వైపు నడిపిస్తోందన్న భావం కలుగుతోంది.

-కొమ్మినేని శ్రీనివాసరావు