cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మ‌హాత్ముడిపై బుస కొడుతున్న ‘నాగ‌’బాబు

మ‌హాత్ముడిపై  బుస కొడుతున్న ‘నాగ‌’బాబు

మ‌హాత్మాగాంధీ అంటే భార‌త జాతిపిత‌. బ్రిటీష్ వారిపై స్వాతంత్ర్య పోరాటానికి నాయ‌క‌త్వం వ‌హించిన గొప్ప నేత‌. అహింస అనే ఆయుధంతో అద్భుతాలు సృష్టించ‌వ‌చ్చ‌ని ప్ర‌పంచానికి చాటి చెప్పిన పోరాట యోధుడు. సుదీర్ఘ కాలం పాటు సాగిన స‌మ‌రంలో ర‌క్తం చిందించ‌కుండా స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సాధించాల‌ని అహ‌ర్నిశ‌లు ఆకాంక్షించిన ధ‌న్య‌జీవి.

గాంధీజీ పేరే ఓ స్ఫూర్తి. ఆయ‌న మాట వింటే ఓ ఉత్తేజం. ఆయ‌న జీవితం నుంచి పాఠాలు నేర్చుకుని చైత‌న్య‌వంతులై త‌మ‌త‌మ దేశాల‌ను, జాతుల‌ను బానిస బ‌తుకుల నుంచి విముక్తి మార్గాన న‌డిపించిన మ‌హ‌నీయులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో అమెరికాకు చెందిన న‌ల్ల‌జాతీయులు మార్టిన్ లూథ‌ర్‌కింగ్‌, ఒబామా, ద‌క్షిణాప్రికాకు చెందిన నెల్స‌న్‌మండేలా...ఇలా ఎంతో మందిని ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

కానీ మ‌న దేశంలో, అదీ తెలుగు రాష్ట్రాల‌కు సుప‌రిచితుడైన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మాత్రం గాంధీజీని పొగుడుతూనే, ఆయన్ని భౌతికంగా అంత‌మొందించిన గాడ్సేను దేశ‌భ‌క్తుడంటూ వెనుకేసుకొస్తున్నారు. ఇటీవ‌ల గాడ్సే దేశ భ‌క్తి, గాంధీజీని చంప‌డానికి గ‌ల కార‌ణాల‌ను నాటి మీడియా వెల్ల‌డించ‌క‌పోవ‌డంపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆ ట్వీట్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

తాజాగా మ‌రోసారి గాంధీజీని టార్గెట్ చేస్తూ నాగ‌బాబు ట్వీట్ చేశారు. ‘ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం, సావర్కార్, వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనం మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు  బ‌తికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అంటూ నాగబాబు  ట్వీట్ చేశారు.

నాగ‌బాబుకు కొత్త‌గా వ‌చ్చిన స‌మ‌స్య ఏంటో అర్థం కావ‌డం లేదు. జ‌నానికి తెలియాలంటూ కొంద‌రి మ‌హానుభావుల పేర్ల‌ను ప్ర‌స్తావించారు. అంతేకాదు, గాంధీ గారు బ‌తికి ఉంటే ఆయ‌న కూడా దేశ‌భ‌క్తుల్ని గౌర‌వించ‌మ‌ని త‌ప్ప‌క చెప్పేవార‌ని ఓ వాక్యం జ‌త‌ చేసి నాగ‌బాబు త‌న అతి తెలివి తేట‌ల‌ను ప్ర‌ద‌ర్శించారు. నాగ‌బాబు చెప్పే ప్ర‌కారం ఇలా నోట్ల‌పై మహానుభావుల ఫొటోలు ముద్రించుకుంటూ పోతే...అంతమెక్క‌డ‌? ఎంత మంది ఫొటోల‌ని క‌రెన్సీ నోట్ల‌పై ముద్రిస్తారు?

ఏ దేశానికైనా జాతిపిత ఒక‌రే ఉంటారు. మ‌న దేశానికి జాతిపిత గాంధీజీ మాత్ర‌మే. ఆ మ‌హానుభావుడి అపార సేవ‌ల‌ను, త్యాగాల‌ను భార‌త జాతి గుర్తించి ఆయ‌న‌కు స‌ముచిత స్థానం క‌ల్పించింది. అంతే త‌ప్ప గాంధీజీని నాగ‌బాబులా ఓ వ్య‌క్తిగా ఎవ‌రూ గుర్తించ‌రు.

గాంధీజీ అంటే భార‌త‌జాతి శ‌క్తి. అలాంటి మ‌హ‌నీయుని గౌర‌వించ‌క‌పోయినా...అన‌వ‌స‌రంగా వివాదాల‌కు కేంద్రం చేయ‌డం సబ‌బు కాదు. గాంధీజీని ఎప్ప‌టికీ జాతిపిత‌గానే స్మ‌రించుకోవ‌డమే ఆయ‌న‌కు నిజ‌మైన నివాళి. అందుకు విరుద్ధంగా ఏం చేసినా ప్ర‌చారం రావ‌చ్చేమో గానీ, స‌మాజానికి మంచిది కాదు. ఇప్ప‌టికైనా ఏదో ఒక వంక‌తో గాంధీజీపై నాగ‌బాబు బుస కొట్ట‌డం ఆపాలి. 

అపూర్వ ఘట్టానికి సంవత్సరం