ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బీభత్సమైన పబ్లిసిటీ స్టంట్ చేస్తున్న వేళ, సినీ నటుడు నాగబాబు సోషల్ మీడియాలో ఒకటిన్నర నిమిషం నిడివిగల 'సైకిల్' స్కిట్‌తో తెలుగు తమ్ముళ్ళకి పెద్ద షాకే ఇచ్చాడు. ఈ స్కిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్కిట్లో ఏముందంటే.. ఇద్దరు చిన్న పిల్లలు.. ఒకడేమో సైకిల్ తొక్కుతుంటే, ఇంకొకడు కింద పడ్డ సైకిల్ని కుమ్మేస్తుంటాడు. ఏంటి సంగతి? అనడిగితే, సైకిల్ని తొక్కుతున్నోడేమో, 'సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిది' అంటాడు. ఇంకొకడేమో సైకిల్ని తొక్కితేనే ఆంధ్రప్రదేశ్‌కి మంచిదని తొక్కేస్తున్నట్లు కసికసిగా చెప్పేస్తాడు. అదండీ సంగతి. విషయం అర్థమయిపోయింది కదా.!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని తొక్కి పడేయాలన్నది నాగబాబు ఉవాచ. అదేదో డైరెక్ట్‌గా చెప్పాల్సింది పోయి, ఈ స్కిట్‌ని ఓ సైకిల్ కంపెనీ కోసం చేసిన యాడ్‌గా నాగబాబు పేర్కొనడం ఆశ్చర్యకరమే. 'మై ఛానల్ నా ఇష్టం' అంటూ యూ ట్యూబ్ ఛానల్లో హల్చల్ చేస్తున్న నాగబాబు, ఈ వీడియో చేశాడు సరే.. తెలుగుదేశం పార్టీని తొక్కి పడెయ్యమని ధైర్యంగా ఎందుకు చెప్పలేదట.? పాపం, ధైర్యం చాలలేదేమో.!
అన్నట్టు, బ్యాక్‌గ్రౌండ్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా పోస్టర్ కన్పిస్తోంది ఈ స్కిట్లో. కావాలనే, ఆ బ్యాక్‌గ్రౌండ్ అలా వచ్చేలా ప్లాన్ చేశారా.? లేదంటే, ఏదో కాకతాళీయంగా జరిగిన వ్యవహారమా.? ఏమో, నాగబాబుకే తెలియాలి. తమ్ముడు పవన్‌కళ్యాణ్ పార్టీకి ప్రచారం చేస్తే నాగబాబుని పవన్ అభిమానులు అభినందిస్తారేమోగానీ.. ఈ స్కిట్లతో నాగబాబుకి ఒరిగేదేంటట.? ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తూ, నాగబాబుతో సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేస్తున్నారు.
వైఎస్సార్సీపీ మీదా, తెలుగుదేశం పార్టీ మీదా నాగబాబు పేల్చుతున్న ఈ జబర్దస్త్ సెటైర్లు, నవ్వు తెప్పించడం మాటెలా వున్నా.. నవ్వులపాలైపోతున్నాయన్నది చాలామంది అభిప్రాయం.