cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

నాగబాబు వెటకారం.. రివర్స్ కొట్టిందిలా!

నాగబాబు వెటకారం.. రివర్స్ కొట్టిందిలా!

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. నాగబాబుకి వెటకారం పాళ్లు కాస్త ఎక్కువే. జబర్దస్త్ లో చేరిన తర్వాత అది మరింత ఎక్కువైంది. ఏకంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఆమధ్య బాలకృష్ణను చెడుగుడు ఆడుకున్న మెగా బ్రదర్ కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. పవన్ కల్యాణ్ ని సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శించినప్పుడు కూడా బైటకు రాలేదు. ఇప్పుడు జబర్దస్త్ మానేసిన తర్వాత నాగబాబు తిరిగి జనసేన మీటింగుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ట్విట్టర్ లో కూడా జోరు పెంచారు.

ముఖ్యంగా ఈమధ్య నాగబాబు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని బాగా టార్గెట్ చేశారు. జుట్టు తెల్లబడిన ప్రతి వ్యక్తి పెద్దమనిషి అనుకుని భ్రమపడ్డాను. ప్రజలు నన్ను క్షమించాలి అంటూ విజయసాయిరెడ్డిపై కౌంటర్లు స్టార్ట్ చేశారు నాగబాబు. ఆ తర్వాత వరుసగా తెల్ల జుట్టున్న చింపాంజీ బొమ్మలు పోస్ట్ చేస్తూ తన కసి తీర్చుకున్నారు. ఇక్కడ నాగబాబుకి బాగా మండిన విషయాలు చాలానే ఉన్నాయి.

పవన్ కల్యాణ్ ని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ఘాటుగా విమర్శిస్తున్నారు. మిగతా వాళ్లంతా దత్తపుత్రుడు అనే పదం దగ్గరే ఆగిపోతే, విజయసాయి మాత్రం పావలాగాడు అంటూ మరింత రెచ్చగొడుతూ కామెంట్స్ పెట్టారు. పవన్ పెళ్లిళ్ల గురించి కూడా ఆయన నిర్మొహమాటంగా ప్రస్తావిస్తూ వచ్చారు. దీనిపై అట్నుంచి కౌంటర్ ఇచ్చేంత ధైర్యమున్నవారెవరూ కనిపించడం లేదు. అందుకే నాగబాబు రంగంలోకి దిగారు. రెండు రోజులుగా విజయసాయిరెడ్డిపై విమర్శలు చేస్తున్నారు.

ఇక్కడ విచిత్రం ఏంటంటే.. నాగబాబు సెటైర్లు తిరిగి మెగా ఫ్యామిలీకే తగులుతున్నాయి. చింపాంజీ బొమ్మల్ని పెట్టి విజయసాయిరెడ్డిని కామెంట్ చేయాలని నాగబాబు ట్రై చేస్తే.. ఆ ఫొటోలకి రామ్ చరణ్ ని, ఇతర మెగా హీరోలను జోడిస్తూ.. ట్రోలింగ్ మొదలుపెట్టారు వైసీపీ అభిమానులు. ఇలా నాగబాబు వెటకారం ఆయనకే రివర్స్ తగలడం ఇక్కడ జాలిపడాల్సిన విషయం.