Advertisement


Home > Politics - Political News
మళ్లీ వినబడుతున్న 'నాగ'స్వరం...!

సంగీతం సప్తస్వరాలమయం. ఆ స్వరాలు లేకపోతే సంగీతం ఉండదు. నేటి రాజకీయాలు ఫిరాయింపులమయం. అవి లేకపోతే రాజకీయ ప్రయోజనాలు ఉండవు. సంగీతంలో ఏడు స్వరాలు మాత్రమే ఉంటే, రాజకీయాల్లో ఎన్నెన్నో స్వరాలుంటాయి. కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో 'నాగ'స్వరం వినబడుతోంది.

ఇంకా చెప్పాలంటే గత ఏడాదిలోనే మొదలైన ఈ 'నాగ'స్వరం ఈమధ్య ఎక్కువ ధ్వనితో వినబడుతోందని వార్తలొస్తున్నాయి. ఈ నాగస్వరం ఊదుతున్న నాయకుడు ఎవరు? ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో ఓ వెలుగు వెలిగి, ప్రత్యేక తెలంగాణ నెపంతో బయటకు వచ్చి బీజేపీలో చేరిన డాక్టర్‌ నాగం జనార్ధన్‌ రెడ్డి. కమలం పార్టీలో అసంతృప్తిగా ఉంటున్న ఈ డాక్టరుగారు తాను పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నానంటూ నాగస్వరం ఊదుతున్నారు.

బీజేపీ నుంచి బయటకు వస్తే ఈయన స్వరం కాంగ్రెసులో వినిపిస్తుందని, ఈయన గళం అక్కడ మోగుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒకప్పుడు బీజేపీని వదిలేది లేదన్న ఈ నాయకుడికి రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయేమోనని ఇప్పుడు భయం పట్టుకుంది. తెలంగాణలో కమలం పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న ఈ నాయకుడు అక్కరకురాని చుట్టాన్ని వదిలేయడం మంచిదని సుమతీ శతకకారుడు చెప్పిన పద్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తాను వదిలేసిన 'పచ్చ' పార్టీలోకి పోలేరు. టీఆర్‌ఎస్‌లోకి పోవడం ఇష్టం లేదు. మిగిలింది హస్తం పార్టీయే. దానికి బలం పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది కాబట్టి అందులోకి పోవడం మంచిదని అనుకుంటున్నారట. ఈ శుభకార్యం ఎప్పుడు జరుగుతుందో తెలియదు.

బీజేపీలో తనకు ప్రాధాన్యం లేదని నాగం ఎప్పటినుంచో బాధపడుతున్నారు. మాజీ మంత్రినైన తనను పట్టించుకోవడంలేదని అసంతృప్తిగా ఉన్నారు. ఇష్టం లేకుండా కొనసాగవద్దని అభిమానులు కూడా సలహా ఇచ్చారట. రాహుల్‌ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు వెళ్లి కలవాలని నాగం ప్లాన్‌ చేసుకున్నారట. ఈయన బీజేపీ నుంచి బయటకు వస్తారనే ప్రచారం కొత్తది కాదు.

సుమారుగా రెండేళ్లుగా అనుమానాలు వస్తూనే ఉన్నాయి. టీడీపీలో ఆర్‌.కృష్ణయ్య ఎలాగైతే పార్టీకి దూరంగా అంటీముట్టనట్లున్నారో బీజేపీలో నాగం అదే టైపు. పార్టీ మారనని చెప్పినప్పటికీ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారనేది వాస్తవం. భాజపాలో బలమైన నేతగా ఎదగాలనే ఆశలు నెరవేరలేదు.  గతంలో  కిషన్‌ రెడ్డి (మాజీ అధ్యక్షుడు) నాగంను ఎదగనీయకుండా చేశారని ఆయన వర్గీయులు ఆరోపించారు.

విద్యార్థి జీవితంలో నాగం ఏబీవీపీలో పనిచేసినా  రాజకీయ జీవితం టీడీపీతో మొదలైంది. ఆ పార్టీలోనే బలమైన నాయకుడిగా ఎదిగి మంత్రి అయ్యారు. కాని తెలంగాణ విషయంలో చంద్రబాబుతో విభేదాలు వచ్చాయి. పార్టీలోనూ బలమైన ప్రత్యర్థులు తయారయ్యారు. దీంతో టీడీపీని వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందులోంచి నుంచి బయటకు వచ్చాక   'తెలంగాణ నగర సమితి' అనే పార్టీ పెట్టినా వర్కవుట్‌ కాలేదు.

ఒంటిరిగా ఉంటే లాభం లేదని గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిపోయి మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత నుంచి కమలం పార్టీలో సంతోషంగా లేకపోయినా, బలవంతంగా అందులోనే కొనసాగుతూ 'తెలంగాణ బచావ్‌ మిషన్‌' అనే సంస్థ పెట్టి కేసీఆర్‌పై పోరాటం చేశారు. పార్టీలోని ఇతర నాయకులతో కలవకుండా తన సొంత మార్గంలో పోతున్నారు. బీజేపీని వదలితే ఆయనకు కాంగ్రెసు తప్ప మరో పార్టీ లేదు.