cloudfront

Advertisement


Home > Politics - Political News

నాలిక తెగ్గోసుకునేంత అభిమానమా? సిగ్గు సిగ్గు.!

నాలిక తెగ్గోసుకునేంత అభిమానమా? సిగ్గు సిగ్గు.!

సినీ ప్రముఖుల మీదా, రాజకీయ నాయకుల మీదా వెర్రి అభిమానం.. ఒక్కోసారి ప్రాణాలు తీసేస్తుంటుంది. చెప్పుకోవాలంటే కుప్పలు తెప్పలుగా ఉదాహరణలు దొరుకుతుంటాయి. సినీ అభిమానం సంగతి పక్కన పెడితే, రాజకీయాల్లో 'అభిమానం' అంటే, అది నిజంగానే వైపరీత్యం. తమ ప్రాపకం పెంచుకోవడానికి రాజకీయ పార్టీలు సెంటిమెంట్‌ రగలించి, ఆ మంటల్లో అమాయకుల్ని బలి చేసేస్తుండడం చూస్తూనే వున్నాం.

అసలు విషయానికొస్తే, ఓ యువకుడు నాలిక తెగ్గోసుకున్నాడు. అదీ ఓ రాజకీయ ప్రముఖుడి కోసం. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఆ యువకుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ కోసం 'నాలికని తెగ్గోసుకుని.. దేవుడి హుండీలో వేయడం' కలకలం సృష్టించింది. సరిగ్గా, ఎన్నికల ప్రచారం తెలంగాణలో ముగిసిన సమయంలో.. ఈ ఘటన వెలుగులోకి రావడం ఆశ్చర్యకరమే.

పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన యువకుడిగా నాలిక తెగ్గోసుకున్న వ్యక్తిని గుర్తించారట. ఏంటీ, ఇదంతా అభిమానమేనా.? అన్న డౌట్‌ వస్తే, అది మీ తప్పు కానే కాదు. ఎందుకంటే, రాజకీయాల్లో ఇలాంటి చిత్ర విచిత్రాలు కన్పిస్తూనే వుంటాయి. ఈ తరహా సంఘటనలకు ఎంత తక్కువ ప్రచారం లభిస్తే అంత మంచిది. లేకపోతే, ఈ వెర్రి ఇతరులకూ అంటుకునే ప్రమాదం లేకపోలేదు.

ఆందోళనలు, నిరసనల సందర్భంగా కార్యకర్తలు ఒంటికి నిప్పంటించుకోవడం.. ప్రాణాలు కోల్పోవడం తెల్సిన విషయాలే. తమ అభిమాన నేతల కోసం అరగుండు కొట్టించుకుంటే తప్పు లేదుగానీ, నాలిక తెగ్గోసుకోవడమేంటి.?

చూడబోతే, ఇదేదో పొలిటికల్‌ మోటివేటెడ్‌ వ్యవహారంలాగానే కన్పిస్తోంది తప్ప.. ఇందులో 'అభిమానం' అనే కోణం ఏమాత్రం కన్పించదు. ఎన్నికల సమయంలో జరిగిన ఈ ఘటన ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి దిశా నిర్దేశంతో జరిగిందో తేలాల్సివుంది.

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్