cloudfront

Advertisement


Home > Politics - Political News

నంద్యాల బ‌రిలో మ‌రోసారి త‌ల‌ప‌డనున్న యువ‌కిశోరం

నంద్యాల బ‌రిలో మ‌రోసారి త‌ల‌ప‌డనున్న యువ‌కిశోరం

క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయంగా ఎంతో ప్రాధాన్యం సంత‌రించుకొంది. దేశానికి సంస్క‌రణ‌ల ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావును అందించిన ఘ‌న‌త నంద్యాల పార్ల‌మెంట్ స్థానానికే ద‌క్కుతుంది. 2017, ఆగ‌స్టులో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల పోరు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల తీరును చెప్ప‌క‌నే చెప్పింది. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున 27వేల పైచిలుకు ఓట్ల‌తో గెలుపొంది అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన యువ‌కిశోరం భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి మ‌రోసారి దిగ్గ‌జాల‌తో త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. 

క‌ర్నూలు రాజ‌కీయాల్లో భూమా కుటుంబానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆ జిల్లాలో  ప‌రిచ‌యం అక్క‌ర్లేని బ‌ల‌మైన రాజ‌కీయ కుటుంబ నేప‌థ్యం వారి సొంతం. 1983లో ఆళ్ల‌గ‌డ్డ నుంచి టీడీపీ త‌ర‌పున ఎస్వీ సుబ్బారెడ్డి విజ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. అనంత‌ర ప‌రిణామాల్లో ఎస్వీ సుబ్బారెడ్డి నాదేండ్ల పంచ‌న చేరారు. నాదేండ్ల అప్ర‌జాస్వామిక విధానాల‌ను నిర‌సిస్తూ పెద్ద ఉద్య‌మం జ‌రిగింది. 1985లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎస్వీ సుబ్బారెడ్డి స్థానంలో భూమా వీర‌శేఖ‌ర‌రెడ్డిని ఆళ్ల‌గ‌డ్డ నుంచి టీడీపీ నిలిపింది. ఆ ఎన్నిక‌ల్లో వీర‌శేఖ‌ర‌రెడ్డి ఓట‌మి పాల‌య్యారు. అయితే పార్టీ అవ‌స‌రాల రీత్యా  వీర‌శేఖ‌ర‌రెడ్డిని క‌ర్నూలు స‌హ‌కార కేంద్ర బ్యాంకు చైర్మ‌న్‌గా ఎన్టీఆర్ నియ‌మించారు. క‌ర్నూలు జిల్లా వ్యాప్తంగా రైతుల‌కు పెద్ద ఎత్తున రుణాలు ఇప్పించ‌డం ద్వారా ఆ ప‌ద‌వికి వ‌న్నె తెచ్చారు.   ఆ త‌ర్వాత 1989 ఎన్నిక‌ల్లో   వీర‌శేఖ‌ర‌రెడ్డి విజ‌యం సాధించి  జిల్లా రాజ‌కీయ చ‌రిత్ర పుటల్లో త‌మ కుటుంబానికి ఓ పేజీని సొంతం చేసుకున్నారు.

ఆ త‌ర్వాత ఒక ఏడాదికి ఆయ‌న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అన్న స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు భూమా నాగిరెడ్డి రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశం చేశారు. ఆయ‌న ప‌లుమార్లు ఎమ్మెల్యేగా, నంద్యాల ఎంపీగా ప్రాతినిథ్యం వ‌హించారు. భూమా భార్య శోభానాగిరెడ్డి కూడా ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మ‌న్‌గా ప‌నిచేసి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందారు. దుర‌దృష్టం ఆ కుటుంబాన్ని వెంటాడింది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ షాక్ నుంచి కోలుకుంటుండ‌గానే  భూమా నాగిరెడ్డి గుండె పోటుతో అన్న‌లాగే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆళ్ల‌గ‌డ్డ స్థానం నుంచే అప్ప‌టికే భూమా అఖిల‌ప్రియ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె మంత్రి.

భూమా నాగిరెడ్డి త‌మ పార్టీ నుంచి గెలుపొంది టీడీపీలోకి వెళ్ల‌డంతో ఆ కుటుంబానికి సీటు వ‌దిలేందుకు వైసీపీ అంగీక‌రించ‌లేదు. దీంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. టీడీపీ త‌మ అభ్య‌ర్థిగా భూమా నాగిరెడ్డి అన్న, దివంగ‌త మాజీ ఎమ్మెల్యే వీర‌శేఖ‌ర‌రెడ్డి కుమారుడు బ్ర‌హ్మానంద‌రెడ్డిని బ‌రిలో నిలిపింది. భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి బీటెక్ ప‌ట్ట‌భ‌ద్రుడు. చిన్నాన్న నాగిరెడ్డి, చిన్న‌మ్మ శోభాకు రాజ‌కీయంగా చేదోడువాదోడుగా ఉంటుండ‌టంతో ఈ వాతావ‌ర‌ణం కొత్త‌గా క‌నిపించ‌లేదు. అంతేకాదు జ‌గ‌త్ డెయిరీ నిర్వ‌హిస్తూ రైతులు, గ్రామీణుల‌తో నిత్యం మాట్లాడుతుండ‌టంతో ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం మ‌రింత సులువైంది. ర‌స‌వ‌త్త‌ర పోరులో ఆయ‌న 27వేల పైచిలుకు ఓట్ల‌తో గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. 31 ఏళ్ల యువ‌కిశోరం మ‌రోసారి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

పార్టీలో సీటు ఆశిస్తున్న నాయ‌కులున్న‌ప్ప‌టికీ బ్ర‌హ్మానంద‌రెడ్డి వైపు టీడీపీ అధినేత మొగ్గు చూపుతున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌ల ఆ విష‌యాన్నే నేరుగా అధినేతే చెప్పి ముందుకు పోవాల‌ని భుజం త‌ట్టి ప్రోత్స‌హించార‌ని తెలిసింది. దీంతో ఆయ‌న మ‌రింత  ఉత్సాహంగా ప్ర‌జ‌ల్లోకి  వెళుతూ  ఎప్ప‌టిక‌ప్పుడు వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ మ‌రోసారి విజ‌యం సాధించేందుకు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు.