cloudfront

Advertisement


Home > Politics - Political News

నరేంద్రమోడీ.. ఈ ప్రశ్నలకు బదులేదీ.!

నరేంద్రమోడీ.. ఈ ప్రశ్నలకు బదులేదీ.!

ప్రధాని నరేంద్రమోడీ మళ్ళీ తన మాటలతో మాయ చేశారు. 2014 ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామనీ, విభజన హామీలన్నీ నెరవేరుస్తామనీ, విభజన చట్టానికి మించి ఆంధ్రప్రదేశ్‌కి అన్నీ చేస్తామనీ చెప్పిన నరేంద్రమోడీ, 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పర్యటన చేశారుగానీ.. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మారింది ఏమీ లేదు. ఆయన మాటల్లో ఇప్పటికీ అదే 'మాయ' కన్పిస్తోంది. మాటలు కోటలు దాటేస్తోంటే, చేతలు కనీసం గడప దాటని పరిస్థితి నరేంద్ర మోడీది. 

ప్రత్యేక హోదా అంశాన్ని ఎప్పుడో అటకెక్కించిన నరేంద్ర మోడీ నుంచి, గుంటూరు సభలో ప్రత్యేక హోదాపై హామీ వస్తుందని ఎవరైనా ఆశించగలరా.? ఛాన్సే లేదు. కానీ, మోడీ ఆ ప్రత్యేక హోదాని మించి ఆంధ్రప్రదేశ్‌కి అన్నీ చేసేశామని చెప్పేశారు. 'ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు జతకట్టారు..' అంటూ మోడీ ప్రకటించుకున్నారుగానీ, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఎందుకు ఇవ్వలేదో మాత్రం చెప్పలేకపోయారు. అదొక్కటే కాదు, స్టీల్‌ ప్లాంట్‌ విషయమై పెదవి విప్పలేదు. వెనుక బడిన జిల్లాలకు ఇవ్వాల్సిన 'ప్యాకేజీ'కి సంబంధించి నిధుల్ని ఇచ్చినట్టే ఇచ్చి కేంద్రం వెనక్కి తీసుకోవడంపైనా మోడీ నుంచి వివరణ రాలేదు. 

అసలు, నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కి ఎందుకు వచ్చారు.? అని ఆలోచిస్తే, కేవలం చంద్రబాబుని తిట్టడానికే అన్న సమాధానం వచ్చింది మోడీ గుంటూరు సభ ద్వారా. చంద్రబాబుని మోడీ విమర్శించాల్సిందే.. కానీ, ఆ విమర్శల్లో సగ భాగం తనకూ చెందుతుందని నరేంద్ర మోడీ మర్చిపోయినట్టున్నారు. సగమేంటి.? నాలుగేళ్ళ పాపం చంద్రబాబుతో సహా నరేంద్ర మోడీ కూడా మోసి తీరాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందన్నదే నిజమైతే, ఆ అవినీతిలో నరేంద్ర మోడీ వాటా ఎంతన్నదీ తేలాలి కదా.! 

ప్రత్యేక హోదా దండగని నరేంద్ర మోడీ చెబితే, చంద్రబాబు 'అవును కదా..' అంటూ బాకా ఊదారు. నాలుగేళ్ళు చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిసిటీ స్టంట్లు చేస్తే, ఇదే మోడీ 'సెహబాష్‌' అంటూ చంద్రబాబుని పొగిడారు. ఇప్పుడు సీన్‌ మారింది. ఇద్దరూ ఒకర్ని ఒకరు తిట్టుకుంటున్నారు. గుంటూరుకి వచ్చి మోడీ, చంద్రబాబుని కడిగి పారేస్తే.. 'నన్ను తిట్టడానికే మోడీ వచ్చినట్టున్నారు..' అంటూ చంద్రబాబు ఎగతాళి చేసేశారు. 

ఇక్కడ చంద్రబాబుకిగానీ, నరేంద్ర మోడీకిగానీ పెద్దగా నష్టమేమీ లేదు. రాష్ట్ర ప్రజలు మధ్యలో నష్టపోయారు. కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌ని అడ్డగోలుగా విభజిస్తే, ఆ తర్వాత నరేంద్ర మోడీ - చంద్రబాబు ఒక్కతాటిపైకి వచ్చి, నస్టపోయిన ఆంధ్రప్రదేశ్‌తో మరింతగా ఆటలాడుకున్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహంతో పండగ చేసుకున్న నరేంద్ర మోడీకి, పోలవరం ప్రాజెక్ట్‌ తాలూకు ప్రాముఖ్యత అర్థం కాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? బుల్లెట్‌ ట్రైన్‌ దేశానికి అవసరమట.. మరి, ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అమరావతి అవసరంలేదా.? ఇలా ఏ ప్రశ్నకీ నరేంద్ర మోడీ దగ్గర సమాధానం లేదు, వుండదు కూడా.! 

నల్ల జెండాలతో జనం నిరసన, నల్ల బెలూన్లతో వ్యతిరేకత.. ఇవన్నీ నరేంద్ర మోడీకి అర్థం కావని ఎలా అనుకోగలం.? అర్థమయ్యే, వాటిని 'ఆశీర్వాదాలుగా.. దిష్టి చుక్కలుగా' మోడీ చెప్పుకున్నారంటే, దిగజారుడు రాజకీయాలకు ఇంతకన్నా పరాకాష్ట ఇంకేముంటుంది.!  

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా