cloudfront

Advertisement


Home > Politics - Political News

ఎదుగుదల చూశాడు... సీఎంగా చూడలేకపోయాడు..!

ఎదుగుదల చూశాడు... సీఎంగా చూడలేకపోయాడు..!

'ప్రతి మగవాడి విజయం వెనక స్త్రీ ఉంటుంది' అంటారు పెద్దలు. అది ఎంత నిజమో, మహిళల విజయాల పట్ల కూడా మగవారు ఉంటారు. ముఖ్యంగా భార్యల విజయం వెనక భర్తల సహకారం ఉంటుంది. ఇది రాజకీయాల్లో ఎక్కువగా కనబడుతుంది. 'చదవినంత నిన్ను చదవిస్తనమ్మ.. ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మ' అని ఓ సినిమాలో నారాయణమూర్తి పాడినట్లుగా దివంగత జయలలిత ప్రియ సఖి శశికళ భర్త మరుత్తప్ప నటరాజన్‌ ఆమెను ఎదిగినంత మేరకు ఎదిగించాడు.

ఆయనకు కూడా అందనంత ఎత్తుకు ఎదిగింది. కాని ఏం ప్రయోజనం? చివరకు ఆమె అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లగా, ఆయన అనారోగ్యం పాలై , కిడ్నీలు పాడైపోయి ఈరోజు కన్నుమూశాడు. వయసు 74ఏళ్లు. భార్యను సీఎంగా చూడాల్సిన నటరాజన్‌ ఆమె దోషిగా జైలుకెళ్లడం చూశాడు.

ఇది ఆయన ఆరోగ్యంపై ఎంతమేరకు ప్రభావం చూపిందో తెలియదుగాని ఆమె జైల్లో ఉండగానే దూరమైపోయాడు. జైలు జీవితమే విషాదకరమంటే భర్తను కోల్పోయిన విషాదం దానికి తోడైంది. పదో తరగతి మాత్రమే చదువుకొని, వీడియో క్యాసెట్ల వ్యాపారం చేసుకునే శశికళ జీవితాన్ని భర్త నటరాజన్‌ తన తెలివితేటలతో అనూహ్యమైన మలుపు తిప్పాడు.

తమిళనాడు ప్రభుత్వంలో సాధారణ ఉద్యోగి అయిన ఈయన రాజకీయంగా తిరుగులేని జయలలితకు తన భార్యను దగ్గర చేసి, రాజకీయాల్లో పరోక్షంగా తాను కీలక పాత్ర పోషించాడు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరకముందు నటరాజన్‌ డీఎంకే నాయకుడు. కరుణానిధికి వీరాభిమాని. 1965లో చెలరేగిన హిందీ వ్యతిరేకోద్యంలో చురుగ్గా పాల్గొన్నాడు.

డిఎంకే నాయకులే శశికళను చూసి ఆయనకు పెళ్లి జరిపించారు. కరుణానిధి సమక్షంలోనే వివాహం జరిగింది. కరుణానిధి సహాయంతోనే 1970-71 కాలంలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారిగా ప్రభుత్వ సర్వీసులో చేరాడు. కాలక్రమంలో ఓ చిన్న విషయంలో గొడవైపోయి డీఎంకే నుంచి బయటకు వచ్చేశాడు నటరాజన్‌. కరుణానిధికి దూరమైపోయాడు. కాని ఇది ఆయన జీవితానికి మైనస్‌ కాకుండా ప్లస్‌ అయింది. 1980 కాలంలో అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శిగా  పనిచేస్తున్న జయలలిత విచిత్రంగా పరిచయం కావడంతో శశికళ ఎదుగుదలకు మార్గం ఏర్పడింది.

ఒకసారి జయలలిత కడలూరు వెళ్లినప్పుడు అక్కడి కలెక్టర్‌ చంద్రలేఖను కలుసుకున్నారు. అక్కడే నటరాజన్‌ పీఆర్‌వోగా పనిచేస్తున్నారు. జయలలిత కడలూరు పర్యటన కార్యక్రమాన్ని వీడియో తీసే కాంట్రాక్టు శశికళకు దక్కింది. అదే జయ-శశి అపూర్వ స్నేహానికి బీజం వేసింది. ఆ తరువాత కథ తెలిసిందే. జయలలితతో  స్నేహం కారణంగా పోయస్‌ గార్డెన్‌లో తిష్ట వేసిన శశికళ భర్తకు దూరంగా ఉండిపోయింది. తన ఎదుగుదలకు, డబ్బు సంపాదనకు అదో మార్గం అనుకుందిగాని బాధపడలేదు. జయ-శశి స్నేహం చివరకు అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడం వరకు వెళ్లింది.

జయ మరణించాక ముఖ్యమంత్రి కావడానికి శశికళ చేసిన ప్రయత్నాలు, తెర ముందు, తెర వెనక నడిచిన రాజకీయాలు చూశాం. నటరాజన్‌ ఎప్పుడూ తెర వెనకే ఉన్నాడుతప్ప నేరుగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించలేదు. గతంలో నటరాజన్‌ తీవ్ర అనారోగ్యంతో, ఆపరేషన్‌లు చేయించుకొని ఆస్పత్రిలో ఉండగా,  భర్తను చూసేందుకు ఇచ్చిన ఐదు రోజుల పెరోల్‌లో  శశికళ కన్నీరుమున్నీరైంది. 'నా భర్తను కాపాడండి' అని వైద్యులను కన్నీటితో బతిమాలుకుంది. భర్తను దగ్గరుండి చూసుకోలేని దుస్థితి శశికళది. చివరకు ఆమె జైల్లో ఉండగానే ఆయన దూరమైపోయాడు.