Advertisement


Home > Politics - Political News
నాయకుడు కాదు...ఎందుకు కనబడాలి?

'ప్రశాంత్‌ కిశోర్‌ కనబడటంలేదు. ఆయన్ని వెతికి తెచ్చినవారికి ఐదు లక్షల బహుమానం ఇస్తాం'...ఇదీ ఉత్తరప్రదేశ్‌లోని లఖనవ్‌లో కాంగ్రెసు పార్టీ కార్యాలయం ముందు ఓ కాంగ్రెసు నాయకుడు పెట్టిన హోర్డింగ్‌. కార్యకర్తలు అడిగే కొన్ని ప్రశ్నలకు ప్రశాంత్‌ సమాధానాలు చెప్పాల్సివుందని, కాబట్టి ఆయన వెతికి పట్టుకురావాలని ఆ హోర్డింగ్‌లోని సారాంశం. ఇది లేనిపోని వివాదానికి దారి తీస్తుందని పార్టీ యూపీ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ భావించారేమో ఆ హోర్డింగ్‌ తీసేయడంతోపాటు దాన్ని పెట్టిన నాయకుడిని పార్టీ నుంచి ఆరేళ్లు సస్పెండ్‌ చేశారు. అంతేకాకుండా కాంగ్రెసు ఘోర పరాజయానికి ఇప్పటికిప్పుడు ఏ ఒక్కరినీ బాధ్యులను చేయలేమన్నారు. పార్టీ ఓటమికి వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కారణమనేది కొందరిలో ఉన్న అభిప్రాయం. దానికి నిదర్శనం ఈ హోర్డింగ్‌. ప్రశాంత్‌ రాజకీయ నాయకుడు కాదు. ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. అలాంటప్పుడు ఆయన కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓటమికి ఎవరు బాధ్యులో కాంగ్రెసు నాయకత్వమే తేల్చుకోలేనప్పుడు ప్రశాంత్‌ కిశోర్‌ ఎలా కారకుడవుతారు? 

పంజాబ్‌లోనూ కాంగ్రెసుకు ఈయనే వ్యూహకర్త. అక్కడ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశాంత్‌ను ప్రశంసించారు. పంజాబ్‌లో కాంగ్రెసు విజయం సాధించడంలో ప్రశాంత్‌ కీలక పాత్ర పోషించాడన్నారు. మణిపూర్‌, గోవాలో కాంగ్రెసు బీజేపీ కంటే ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ బీజేపీ వ్యూహాల ముందు తట్టుకోలేక అధికారంలోకి రాలేకపోయింది. ఎన్నికలు ముగిశాక ప్రశాంత్‌ కనబడాల్సిన అవసరం లేదు. గెలుపు కోసం వ్యూహాలు రూపొందిచడం వరకే ఆయన బాధ్యత. ఆ వ్యూహాలను సమర్థంగా అమలు చేయడం నాయకుల బాధ్యత. యూపీలో ఆ పని జరగలేదు. 

యూపీలో ప్రశాంత్‌ను వ్యూహకర్తగా నియమించడం కాంగ్రెసులోని కొందరు పెద్ద నాయకులకు సైతం ఇష్టం లేదు. ఆ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌, మరి కొందరితో ప్రశాంత్‌ ఘర్షణ పడాల్సిన సందర్భాలు వచ్చాయి.  ఆయన వ్యూహకర్తేగాని కాంగ్రెసు నాయకులు, గాంధీ కుటుంబం ఆయన్ని పనిచేయనిస్తే కదా...! బీజేపీకి, మహాకూటమికి వ్యూహకర్తగా ఉన్నప్పుడు పనిచేసే అవకాశం దొరికింది కాబట్టి ఆయన వ్యూహాలు విజయవంతమయ్యాయి. కాంగ్రెసులో పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. కాంగ్రెసును ఒంటరిగా గెలిపించాలనేది ప్రశాంత్‌ వ్యూహం. ఒంటరిగా పోటీ చేసి గెలవాలనేదే ఆ పార్టీ ఆలోచన కూడా. కాని తరువాత కాంగ్రెసు నాయకుల, గాంధీ కుటుంబీకుల ఆలోచనలు మారిపోయి సమాజ్‌వాదీతో పొత్తుకు దారితీసింది. ఈ సందర్భంలోనే ప్రశాంత్‌-కాంగ్రెసు నాయకుల మధ్య విభేదాలొచ్చాయి. అయినప్పటికీ సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెసుకు పొత్తు కుదర్చడంలో కీలక పాత్రే పోషించారు.

ప్రశాంత్‌ను వ్యూహకర్తగా తీసుకోవడం కాంగ్రెసులోని ఓ వర్గానికి ఇష్టం లేకపోయినా సోనియా, రాహుల్‌ తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేకపోయారు. ఒంటరిగానే పోటీ చేయాలనుకున్నప్పుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కాకుండా ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని, దీంతో పార్టీ దశ తిరిగే అవకాశం ఉంటుందని ప్రశాంత్‌ ప్రతిపాదించారు. కాని అది వర్క అవుట్‌ కాలేదు. బిహార్లో మహాకూటమి గెలిచినప్పుడు ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆ క్రెడిట్‌ను ప్రశాంత్‌కు కట్టబెట్టారు. ఒకవిధంగా చెప్పాలంటే ఆకాశానికెత్తేశారు. తన ప్రభుత్వంలో సలహాదారుగా నియమించుకొని కేబినెట్‌ ర్యాంకు ఇచ్చారు. ఆయన అక్కడే ఉంటే ఎలా ఉండేదో...! ఆయన సామర్థ్యాన్ని చూసి కాంగ్రెసు వ్యూహకర్తగా నియమించుకుంది. కాంగ్రెసులో అందరూ నాయకులే. ప్రతి ఒక్కరూ వ్యూహకర్తలే. అందుకే ప్రశాంత్‌ను సరిగా పనిచేయనివ్వలేదు. ఫలితాలూ దానికి తగ్గట్లే వచ్చాయి. ప్రశాంత్‌ కనబడకపోవడానికి ఆయన దేశం విడిచి పారిపోయాడా? కార్యకర్తలకు చెప్పుకునే సమాధానాలు రాహుల్‌ గాంధీ, ఇతర పెద్ద నాయకులు చెప్పుకోవాలి.