Advertisement

Advertisement


Home > Politics - Political News

రంగంలోకి దిగిన బైడెన్.. దిద్దుబాటు చర్యలు షురూ

రంగంలోకి దిగిన బైడెన్.. దిద్దుబాటు చర్యలు షురూ

అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రంగంలోకి దిగారు. గత అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలన్నింటిపై సమీక్షలు మొదలుపెట్టారు. 

ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే, వైట్ హౌజ్ కు బయల్దేరిన బైడెన్.. "మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించుకునే క్రమంలో మన వద్ద వృధా చేసేందుకు సమయం లేదు" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తోనే తన మనసులో మాట చెప్పకనే చెప్పారు అమెరికా నూతన అధ్యక్షుడు.

అధికారంలోకి వచ్చిన తొలి రోజే 15 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు బైడెన్. కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన ఫైల్ మినహాయిస్తే.. మిగతావన్నీ దాదాపు ట్రంప్ నిర్ణయాల్ని రద్దు చేయడానికి సంబంధించినవే కావడం గమనార్హం. వీటిలో వాతావరణ మార్పులు, వలస విధానాలకు సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్ని రద్దు చేసే పలు కీలకమైన ఆదేశాలున్నాయి.

చైనాపై కోపంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతున్నట్టు ట్రంప్ గతంలో ప్రకటించారు. అతడు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు బైడెన్ స్పష్టంచేశారు. డబ్ల్యూహెచ్ఓ సమావేశాలకు హాజరవుతామని, ఫండింగ్ కూడా కొనసాగుతుందని తెలిపారు.

పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతూ ట్రంప్ గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని బైడెన్ రద్దుచేశారు. పారిస్ వాతావరణ ఒప్పందాన్ని అనుసరిస్తూ కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవడంతో పాటు.. ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.

దీంతో పాటు మెక్సికో-అమెరికా సరిహద్దులో గోడ నిర్మాణం కోసం నిధుల సేకరణకు ఉద్దేశిస్తూ ట్రంప్ తీసుకొచ్చిన నేషనల్ ఎమర్జెన్సీ డిక్లరేషన్ ను కూడా బైడెన్ రద్దుచేశారు. అటు పలు ముస్లిం దేశాలకు రాకపోకలపై ట్రంప్ విధించిన ఆంక్షల్ని కూడా ఎత్తేశారు.

గ్రీన్ గార్డుల జారీపై దేశాలవారీగా విధించిన పరిమితిని బైడెన్ ఉపసంహరించుకోవడంతో పాటు.. చిన్నతనంలోనే అమెరికా వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యమైనవాళ్లకు శాశ్వత పౌరసత్యం అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇలా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎన్నింటిలో పునఃసమీక్షిస్తున్నారు బైడెన్. 

ఆ ముగ్గురూ ముగ్గురే

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?