Advertisement

Advertisement


Home > Politics - Political News

వైసీపీకి నిమ్మ‌గ‌డ్డ షాక్

వైసీపీకి నిమ్మ‌గ‌డ్డ షాక్

అధికార పార్టీ వైసీపీ భ‌య‌ప‌డ్డ‌ట్టే జ‌రిగింది. ఎస్ఈసీపై అధికార పార్టీ అనుమానమే నిజ‌మైంది. రాష్ట్రంలో కొన్ని మున్సిపాల్టీల్లో త‌మ‌ను అధికార పార్టీ నేత‌లు నామినేష‌న్లు వేయ‌నివ్వ‌లేద‌ని, దౌర్జ‌న్యానికి పాల్ప‌డి నామినేష‌న్ల ప‌త్రాల‌ను చించివేశార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఆరోపించ‌డంతో పాటు పెద్ద ఎత్తున ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. 

ఈ నేప‌థ్యంలో నిజానిజాల‌ను నిగ్గు తేల్చి నివేదిక‌లు ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఎస్ఈసీ ఆదేశించారు. క‌లెక్ట‌ర్ల నివేదిక‌ల ఆధారంగా  తాను తుది నిర్ణ‌యం తీసుకుంటాన‌ని ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ చెప్పిన‌ సంగ‌తి తెలిసిందే.  

ఈ నేప‌థ్యంలో నిమ్మ‌గ‌డ్డ తీసుకునే  నిర్ణ‌యంపై మున్సిపాల్టీల్లో ఏక‌గ్రీవం చేసుకున్న అభ్య‌ర్థుల్లో ఒక ర‌క‌మైన భ‌యం, ఆందోళ‌న నెల‌కున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్టీల్లో అధికార పార్టీ ఎక్కువ మొత్తంలో ఏక‌గ్రీవాలు చేసుకుంది. ఎస్ఈసీ ఆదేశాల మేర‌కు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు నివేదిక‌లు స‌మ‌ర్పించారు. ఆ నివేదిక‌ల ఆధారంగా ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

తిరుపతి కార్పొరేషన్‌‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ పుంగనూరు, ప్ర‌భుత్వ చీఫ్‌విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయచోటి మున్సిపాలిటీ, జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని ఎర్రగుంట్ల నగర పంచాయతీల్లో మొత్తం 14 స్థానాల‌కు నామినేష‌న్లు వేసేందుకు  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి అవకాశం కల్పించారు.  

తిరుపతిలో 2, 8, 10, 21, 41, 45 వార్డులు, పుంగనూరులో 9, 14, 28 వార్డులు,  రాయచోటిలో 20, 31 వార్డులు,  ఎర్రగుంట్లలో 6, 11, 15 వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం అంటే రేపు మధ్యాహ్నం వరకు నామినేషన్లు వేసేందుకు అవ‌కాశం క‌ల్పించారు.  అలాగే 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. 

ఇదిలా ఉండ‌గా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సొంత ప్రాంత‌మైన క‌డ‌ప జిల్లాలోని రాయ‌చోటి మున్సిపాలిటీ,  ఎర్ర‌గుంట్ల న‌గ‌ర పంచాయ‌తీల్లో మ‌రోసారి నామినేష‌న్లు వేసేందుకు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి అధికార పార్టీకి నిమ్మ‌గ‌డ్డ షాక్ ఇచ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కుట్ర

రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద చంద్రబాబు హైడ్రామా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?