Advertisement

Advertisement


Home > Politics - Political News

నిమ్మ‌గ‌డ్డ‌కు దిక్కేది?

నిమ్మ‌గ‌డ్డ‌కు దిక్కేది?

బెల్లం చుట్టూ ఈగ‌లు అన్న చందంగా  రాజ‌కీయాల్లో కూడా  అధికారం ఉంటే అంద‌రూ అయిన‌వారే. అధికారం లేక‌పోతే ద‌గ్గ‌రి వాళ్లు కూడా కానివార‌వుతారు.  ఇదేమీ కొత్త విష‌యం కాదు. రాజ‌కీయాల‌కున్న ల‌క్ష‌ణ‌మే అది. అలాగే ఉద్యోగులకు కూడా ఈ సూత్రం వ‌ర్తిస్తుంది. ఉన్న‌త స్థానంలో ఉన్నంత వ‌ర‌కే ... సార్ సార్ అంటూ ఒక‌టికి ప‌దిసార్లు సెల్యూట్లు. ఆ ఉద్యోగ‌మే లేక‌పోతే నీవెవ‌రో తెలియ‌న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తారు.

మాన‌వ స‌మాజం ప‌ర‌స్ప‌ర అవ‌స‌రాలు, అవ‌కాశాలు అనే ప్రాతిప‌దిక‌న న‌డుస్తుంద‌ని గ్ర‌హించి మ‌స‌లుకుంటే ఎలాంటి ఇబ్బం దులుండ‌వు. అలా కాకుండా అధికారం, ఉన్న‌తోద్యోగం శాశ్వ‌త‌మ‌ని భ్ర‌మించి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తే, భ‌విష్య‌త్ ప‌రిణామాల‌కు ఎవ‌రికి వారే బాధ్యులు. అంతేత‌ప్ప ఇత‌రుల‌ను నిందించ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు. ఇప్పుడిదంతా ఎందుకంటే, ఈ నెలాఖ‌రులో రిటైర్డ్ కానున్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ గురించి రెండు మాట‌లు చెప్పుకునేందుకే.

నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ త‌న‌కు ఎస్ఈసీ ప‌ద‌వి శాశ్వ‌త‌మ‌నే రీతిలో ప్ర‌వ‌ర్తించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎస్ఈసీగా రాజ్యాంగం ఆయ‌న‌కు ఇంత వ‌ర‌కూ అండ‌గా ఉంటూ వ‌చ్చింది. అలాగే కీల‌క‌మైన ప‌ద‌విలో ఉండ‌డంతో ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా త‌మ వంతు మ‌ద్ద‌తుగా నిలిచాయి. న్యాయ‌స్థానాల్లో కోట్లాది రూపాయ‌లు ఫీజుల చెల్లింపు వెనుక టీడీపీ హ‌స్తం ఉంద‌నే ఆరోప‌ణ‌లు కూడా లేక‌పోలేదు. 

ఇందులో నిజానిజాలను ప‌క్క‌న పెడితే, ఆ ర‌క‌మైన ప్ర‌చారం విస్తృతంగా సాగి నిమ్మ‌గ‌డ్డ‌పై టీడీపీ ముద్ర‌ప‌డేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఈ నేప‌థ్యంలో రిటైర్మెంట్ త‌ర్వాత కూడా నిమ్మ‌గ‌డ్డ‌కు జ‌గ‌న్ స‌ర్కార్ నుంచి ఇబ్బందులు త‌ప్పేలా లేవు. 

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన ఎన్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ నుంచి వివ‌రణ కోరాల‌ని అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటీ నిర్ణ‌యించింది. నిమ్మ‌గ‌డ్డ ఇచ్చే వివ‌ర‌ణ‌పై త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే నిమ్మ‌గ‌డ్డ ఇచ్చే వివ‌ర‌ణ‌తో ప్రివిలేజ్ క‌మిటీ సంతృప్తి చెందుతుంద‌ని ఏ ఒక్క‌రూ భావించ‌డం లేదు.  

నిమ్మ‌గ‌డ్డ‌ను అరెస్ట్ చేసేంత వ‌ర‌కూ జ‌గ‌న్ స‌ర్కార్ నిద్ర‌పోద‌ని గ‌త కొంత కాలంగా ఏపీలో చ‌ర్చ‌లో న‌డుస్తోంది. ఒక‌వేళ అదే జ‌రిగితే నిమ్మ‌గ‌డ్డ‌ను కాపాడేదెవ‌రు? ఇప్పుడిదే అస‌లుసిస‌లు ప్ర‌శ్న‌. ఎస్ఈసీ హోదాలో కోర్టుకెళ్ల‌డానికి కూడా ఆయ‌న‌కు అవ‌కాశం ఉండ‌దు. అలాగ‌ని ఏ హోదాలో లేని నిమ్మ‌గ‌డ్డ ఆల‌నాపాల‌నా చూసుకోడానికి చంద్ర‌బాబేమీ అమాయ‌కుడు కాదు. 

త‌న స‌మ‌స్య‌ల నుంచే ఎలా బ‌య‌ట‌ప‌డాలో దిక్కుతోచ‌ని స్థితిలో చంద్ర‌బాబు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో నిమ్మ‌గ‌డ్డ‌కు ఇక దిక్కెవ‌ర‌నే ప్ర‌శ్నకు స‌మాధానం దొర‌క‌డం లేదు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రుస్తూ, లేని ఉద్దేశాల‌ను అంట‌క‌డుతూ కేంద్ర‌హోంశాఖ‌కు లేఖ రాయ‌డాన్ని నిమ్మ‌గ‌డ్డ మ‌రిచిపోయి ఉండొచ్చు. 

కానీ ఆ లేఖ చేసిన గాయంతో ర‌గిలిపోతున్న వాళ్లు అంత సుల‌భంగా విడిచిపెడ‌తార‌ని ఎవ‌రూ అనుకోరు. ఏది ఏమైనా నిమ్మ‌గ‌డ్డ క‌ష్టాల‌కు ఆయ‌న స్వీయ త‌ప్పిదాలే త‌ప్ప మ‌రొక‌రు కార‌ణం కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?