Advertisement

Advertisement


Home > Politics - Political News

అయ్య‌య్యో...జ‌గ‌న్‌కు ఎంత క‌ష్టమొచ్చిందో!

అయ్య‌య్యో...జ‌గ‌న్‌కు ఎంత క‌ష్టమొచ్చిందో!

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చింది! చివ‌రికి తిరుప‌తి ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా రాలేని ప‌రిస్థితిని టీడీపీ యువకిశోరం నారా లోకేశ్ తెచ్చార‌ని... ఆ పార్టీ నేత‌ల మాట‌లు విన్న త‌ర్వాతే లోకానికి తెలిసొచ్చింది. టీడీపీ నేత‌లు చెప్పే ప్ర‌కారం... ఇక ఆ పార్టీకి మంచి భ‌విష్య‌త్ ఉన్న‌ట్టే లెక్క‌. తిరుప‌తి ఉప ఎన్నిక‌ను అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ పార్టీ శ్రేణుల‌కు భ‌రోసా ఇస్తున్నారు. బీజేపీ అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ‌కు మ‌ద్ద‌తుగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇటీవ‌ల తిరుప‌తిలో పాద‌యాత్ర‌, బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొని శ్రేణుల్లో జోష్ నింపారు. 

ఇక అధికార పార్టీ వైసీపీ విష‌యానికి వ‌స్తే ...ఎల్లో మీడియా రాత‌లు, కూత‌ల‌ను బ‌ట్టి, ఆ పార్టీ భారీ మెజార్టీ సంగ‌తి అలా ఉంచితే, గెలుపే క‌ష్టంగా మారింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్క‌ని టీడీపీ... తిరుప‌తి ఉప పోరుకు వ‌చ్చేస‌రికి అనూహ్యంగా బ‌ల‌ప‌డింద‌ట‌. ఎలా బ‌ల‌ప‌డిందో ఎవ‌రూ అడ‌గ‌కూడ‌దు, మే 2న ఎన్నిక‌ల ఫ‌లితాల రోజు తెలుసుకోవ‌చ్చు.

ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తిరుప‌తి ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌స్తున్న‌ట్టు నిన్న సాయంత్రం వ‌ర‌కూ ర‌క‌ర‌కాల లెక్క‌లేసి రాత‌లు, చాన‌ళ్ల‌లో ప్ర‌త్యేక క‌థ‌నాల ప్ర‌సారాలు, చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రిపారు. 

ఇంతలోనే పిడుగులాంటి వార్త‌... కోవిడ్ నేప‌థ్యంలో ఈ నెల 14న తిరుప‌తిలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ ర‌ద్దు చేసుకున్న‌ట్టు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అంతేకాదు, ఈ సంద‌ర్భంగా తాను ప్ర‌చారానికి రాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను చెప్ప‌డంతో పాటు త‌మ అభ్య‌ర్థి గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు.

నిన్న‌టి వ‌ర‌కు ఓట‌మి లేదా మెజార్టీ త‌గ్గుతుంద‌నే భ‌యంతోనే తిరుప‌తి ప్ర‌చారానికి జ‌గ‌న్ వ‌స్తున్నార‌ని మేడ‌లెక్కి ఠాంఠాం చేసిన నోళ్లే, వెంట‌నే ప్లేటు ఫిరాయించాయి. జ‌గ‌న్ తిరుప‌తి రావ‌డానికి లోకేశ్ విసిరిన స‌వాలే కార‌ణ‌మ‌ని స‌రికొత్త వాద‌న‌ను తెర‌పైకి తెచ్చాయి.  

బాబాయి వివేకా హత్య కేసుతో సంబంధం లేదని భగవంతుడి ముందు ప్రమాణం చేసుకుందాం రమ్మని లోకేశ్‌బాబు విసిరిన సవాలుకు భయపడే జ‌గ‌న్ తిరుపతి పర్యటనను కొవిడ్‌పై నెట్టి రద్దు చేసుకున్నార‌ని టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు త‌దిత‌రులు కొత్త విష‌యాన్ని క‌నుగొని ప్ర‌క‌టించారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపున‌కే సొంత‌పార్టీలో ప‌ట్టించుకునే దిక్కులేదు.

అలాంటిది నారా లోకేశ్ స‌వాల్ విసిరితే, దానికి భ‌య‌ప‌డి జ‌గ‌న్ ఏకంగా ప్ర‌చార స‌భ‌నే ర‌ద్దు చేసుకున్నార‌ని రామ్మోహ‌న్ నాయుడు లాంటి టీడీపీలో అంతోఇంతో గౌర‌వం ఉన్న యువ‌నాయ‌కుడు చెప్ప‌డం... ఎవ‌రిని సంతృప్తి ప‌ర‌చ‌డానికో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

లోకేశ్‌ను ప‌రోక్షంగా హేళ‌న చేయ‌డానికే టీడీపీ ముఖ్య‌నేత‌లు వెట‌కారంగా ఇలాంటి వాద‌న‌ను తెర‌పైకి తెస్తున్నార‌నే అభిప్రాయాలు కూడా లేక‌పోలేదు. మొత్తం మీద జ‌గ‌న్ ప్ర‌చారానికి వ‌స్తే ఒక బాధ‌, రాక‌పోతే మ‌రో బాధ అన్న‌ట్టుగా టీడీపీ నేత‌ల మాట‌లుంటున్నాయి.

సొదుం ర‌మ‌ణ‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?