Advertisement

Advertisement


Home > Politics - Political News

ఏపీలో చైనా ఫార్ములా

ఏపీలో చైనా ఫార్ములా

కరోనా కట్టడిలో ఎవరి విధానాలు ఎలా ఉన్నా.. చైనా ఫార్ములా ఎవర్ గ్రీన్ అని చెబుతుంటారు. కరోనా విజృంభిస్తున్న తొలినాళ్లలో.. కేవలం పదంటే పది రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని ఆగమేఘాల మీద నిర్మించి చరిత్ర సృష్టించింది చైనా. 

తనదేశ ప్రజల్ని కాపాడుకుంది. అయితే భారత్ లో మాత్రం ఫస్ట్ వేవ్ వెళ్లిపోయింది, సెకండ్ వేవ్ విజృంభిస్తోంది, రేపో మాపో పిల్లల మీద థర్డ్ వేవ్ దెబ్బ గట్టిగా పడుతుందనే వార్తలొస్తున్నాయి. అయినా కూడా ఇంకా చైనా తరహా ప్రయోగాలు, ప్రతిపాదనలు ఇక్కడ లేవు. కొత్త ఆస్పత్రుల సంగతి దేవుడెరుగు.. ఉన్న ఆస్పత్రిల్లో కొత్తగా బెడ్లు ఏర్పాటు చేయడానికి కూడా దిక్కులేదు.

కరోనా తొలి దశలో రైల్వే కోచ్ లు, ఇండోర్ స్టేడియంలను కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చడం వంటి ప్రయోగాలు జరిగాయి కానీ సెకండ్ వేవ్ లో మాత్రం ఎక్కడా అలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే ప్రయత్నం ప్రారంభించింది. 

రాజమండ్రిలో ఆర్టీసీ బస్సులను ఆక్సిజన్ బెడ్లతో కూడిన మినీ ఐసీయూలుగా మార్చేస్తున్నారు. 'జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు' అనే పేరుతో రెండు బస్సుల్లో 12 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయించారు వైసీపీ ఎంపీ భరత్ రామ్. స్లీపర్ బస్సుల్లో ఏర్పాటు చేసిన ఈ మినీ ఐసీయూలను ప్రారంభిస్తూ.. వీటిని సీఎం జగన్ కి దృష్టికి తీసుకెళ్తామని, ఆయన సూచనలతో మిగతా చోట్ల కూడా ఇలాంటి ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ప్రస్తుతానికి ''ఐసీయూ ఆన్ వీల్స్'' అన్నట్టు కాకుండా.. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఈ బస్సుల్ని ఉంచారు. ఆస్పత్రికి వచ్చి బెడ్లు దొరక్క ఇబ్బంది పడే రోగుల కోసం వీటిని వినియోగిస్తారు. ఆక్సిజన్ సౌకర్యం కూడా ఉండటంతో వీటి వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఈ విధానం సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 22 జర్మన్ షెడ్లు..

కొవిడ్ పేషెంట్లు బెడ్లు లేక ఇబ్బంది పడుతుండటంతో.. రాష్ట్రవ్యాప్తంగా జర్మన్ షెడ్లు నిర్మించి వాటిలో వైద్య సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఒక్కో షెడ్ లో 30 మందికి చికిత్స అందించేలా వీటిని రూపొందిస్తున్నారు. 

ప్రస్తుతానికి తిరుపతి స్విమ్స్ పద్మావతి ఆస్పత్రి ప్రాంగణంలో ఇలాంటి జర్మన్ షెడ్ నిర్మించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 22 షెడ్ల నిర్మాణం కోసం రూ.3.52 కోట్ల నిధులు మంజూరు చేసింది టీటీడీ. నేరుగా జిల్లా కలెక్టర్లకు ఈ నిధులు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

మొత్తమ్మీద ఏపీలో బెడ్ల కొరత ఇలా తీరబోతుంది. ఖాళీగా ఉన్న బస్సులను ఐసీయూలుగా మార్చడం, ఆస్పత్రి వద్ద షెడ్లు నిర్మించి ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడం ద్వారా కరోనా రోగులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. 

నిర్మాణం చివరి దశలో ఉన్న గృహకల్ప అపార్ట్ మెంట్లను కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చి ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది ఏపీ. ఇప్పుడు స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడం, కొత్తగా జర్మన్ షెడ్లను నిర్మించడం వంటి వినూత్న ఆలోచనలతో మరో ముందడుగు వేసింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?