cloudfront

Advertisement


Home > Politics - Political News

పచ్చ ప్రచారం: మోడీ సభకి వైసీపీ జనాలట.!

పచ్చ ప్రచారం: మోడీ సభకి వైసీపీ జనాలట.!

అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోడీ వస్తే, అప్పట్లో ఆ కార్యక్రమం కోసం చంద్రబాబు సర్కార్‌ చేసిన పబ్లిసిటీ స్టంట్‌ అంతా ఇంతా కాదు. దాదాపు వెయ్యి కోట్ల దాకా చంద్రబాబు ఆ కార్యక్రమ ప్రచారం కోసం ఖర్చు చేశారంటూ అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది. చంద్రబాబు కిందా మీదా పడినా, నరేంద్ర మోడీ మాత్రం చెంబుడు నీళ్ళు, గుప్పెడు మట్టి మాత్రమే తీసుకొచ్చి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌కి.

నిజానికి, అప్పట్లోనే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రంపైనా, చంద్రబాబుపైనా అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మోడీ, చంద్రబాబు కలిసే అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసమంటూ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కానీ, చంద్రబాబు ఏం చేశారు.? ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ని పదే పదే అవమానిస్తూ వచ్చారు. ప్రత్యేక హోదా దండగని చెప్పారు.. చెప్పడమేంటి, ప్రత్యేకహోదా కోసం ఎవరు మాట్లాడినా జైలుకెళ్ళక తప్పదని హెచ్చరించారు.

ఇప్పుడు, మళ్ళీ ఎన్నికల ముందర నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వస్తే, చంద్రబాబు మొహం చాటేశారు. ఎందుకు? అంటే, బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాం.. రాష్ట్ర ప్రజల కోసమేనని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. పైగా, నరేంద్రమోడీ సభకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జనాల్ని తరలించిందంటూ చంద్రబాబు అండ్‌ టీమ్‌ 'పచ్చ' ప్రచారం షురూ చేసింది. వైఎస్‌ జగన్‌కి హైద్రాబాద్‌లో ఏం పని? అంటూ తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నించేస్తున్నారు.

అప్పుడూ నరేంద్రమోడీని వైఎస్‌ జగన్‌ వెనకేసుకురాలేదు.. ఇప్పుడూ నరేంద్రమోడీకి మద్దతుగా వైఎస్సార్సీపీ వ్యవహరించడంలేదు. అప్పట్లో చంద్రబాబు పదే పదే ఒకేమాట చెబుతుండేవారు.. 'మేం ఎన్డీయే నుంచి బయటకొస్తే, వైఎస్సార్సీపీ అందులో దూరదామనుకుంటోంది..' అని. చిత్రంగా బీజేపీ నేతలు కూడా ఇలాంటి మాటలే విన్పించేవారు.. టీడీపీ, ఎన్డీయేని వీడితే వైఎస్సార్సీపీ తమ వద్దకు రావాలనుకుంటోందనీ, ఎన్డీయేలోకి వైఎస్సార్సీపీని రానివ్వబోమని బీజేపీ నేతలు సెలవిచ్చారు అప్పట్లో.

అప్పటికీ ఇప్పటికీ వైఎస్సార్సీపీ వాదన ఒకేలా వుంది ప్రత్యేక హోదా విషయంలోనూ, కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌పై విమర్శల విషయంలోనూ. హైద్రాబాద్‌ నుంచి అమరావతికి వచ్చి ప్రధానికి ప్రతిపక్ష నేత నిరసన తెలపాలని డిమాండ్‌ చేస్తోన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏం చేశారు.? ప్రధాని పర్యటనని ఆయన అడ్డుకోగలిగారా.? ప్రత్యక్షంగా నిరసన తెలపగలిగారా.? ముఖ్యమంత్రి పదవిలో వున్నారు కాబట్టి, అలాంటి పనులు చేయకూడదు కాబట్టి, టీడీపీ నేతలతో నిరసనలు చేయించి సరిపెట్టేశారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌ విషయమై చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. గడచిన నాలుగున్నరేళ్ళలో మోడీ విషయంలోనూ, ప్రత్యేకహోదా విషయంలోనూ ఒకటికి వందసార్లు చంద్రబాబు మాటమార్చిన వైనానికి సంబంధించిన వీడియోలు అందరికీ అందుబాటులోనే వున్నాయి. అయినా, చంద్రబాబు బుకాయిస్తూనే వున్నారు.. రాజకీయంగా అక్రమ సంబంధాలు నడుపుతూ పబ్బం గడుపుకుంటున్న చంద్రబాబు, వైఎస్‌ జగన్‌కి రాజకీయ అక్రమ సంబంధాలు అంటగట్టేందుకు చూడటమేంటట.?

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా