cloudfront

Advertisement


Home > Politics - Political News

ప‌వ‌న్ గౌర‌వాన్ని పెంచే రేణు మాట‌లివే...

ప‌వ‌న్ గౌర‌వాన్ని పెంచే రేణు మాట‌లివే...

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి ఆయ‌న మాజీ భార్య రేణుదేశాయ్ ఒక ఇంట‌ర్వ్యూలో కొన్ని మాట‌లు ఆయ‌న గౌర‌వాన్ని పెంచేలా ఉన్నాయి. అయితే నెగ‌టీవ్ అంశాల‌కు ఉన్న ఆక‌ర్షణ అంద‌మైన ఆడ‌పిల్లకు కూడా లేదంటారు. ఈ కార‌ణం వ‌ల్లే కాబోలు ప‌వ‌న్‌క‌ల్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న అంశానికి మీడియా ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. నిజానికి ఆయ‌న సినీరంగానికే ప‌రిమితమై ఉంటేనో లేక టీడీపీతో విభేదించి ఉండ‌క‌పోయి ఉంటే ప‌వ‌న్‌ గురించి నెగ‌టీవ్‌గా ఎవ‌రేమి మాట్లాడినా పెద్దగా ప్రచారానికి నోచుకుని ఉండేవి కాదు.

ప్రపంచంలో మ‌న దేశానికి ప్రత్యేక గౌర‌వం, గుర్తింపు రావ‌డానికి ప్రధాన కార‌ణం మ‌న సంస్కృతి, సంప్రదాయాలు. మ‌న క‌ట్టుబొట్టు, వివాహ వ్యవ‌స్థ త‌దిత‌ర అంశాలు మ‌న‌కు ప్రత్యేక స్థానం క‌ల్పించాయి. అమెరికా, బ్రిట‌న్ త‌దిత‌ర పాశ్చాత్య దేశాల్లో స్ర్తీ, పురుష సంబంధాలు, బిడ్డల‌తో త‌ల్లిదండ్రుల అనుబంధాలు ఆత్మీయంగా ఉండ‌వు. మ‌నదేశంలో ఒంట‌రిగా బ‌తుకున్న స్ర్తీలంటే చుల‌క‌న భావం. అదే పాశ్చాత్య దేశాల్లో అలాంటివి స‌ర్వసాధార‌ణం. అలాగే విడాకులు తీసుకుంటే నేరం చేసిన‌ట్టుగా స‌మాజం నుంచి వెలేసిన‌ట్టు ప్రవ‌ర్తిస్తారు.

అదే పాశ్చాత్య దేశాల్లో క‌ల‌సి ఉండేవారి కంటే విడాకులు తీసుకున్న వారిసంఖ్యే ఎక్కువ‌గా ఉంటుంది. యుక్త వ‌య‌స్సు వ‌చ్చిన పిల్లలు బ‌ల‌వంతం చేసినా త‌ల్లిదండ్రుల‌తో క‌ల‌సి ఉండ‌ని ప‌రిస్థితులు అక్కడ ఉన్నాయి. కాని మ‌న‌దేశంలో అందుకు భిన్నమైన ప్రేమానుబంధాలు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి రేణుదేశాయ్ విడాకుల ర‌హ‌స్యాన్ని బ‌య‌ట పెట్టడంపై ర‌చ్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో రెండు మాట‌లు చెప్పాల‌ని. నిజానికి ఆ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి ఆమె గొప్ప‌గా చెప్పారు.

ఆమె ఎంత గొప్ప మ‌న‌స్కురాలో ఆ మాట‌లు వింటే అర్థమ‌వుతుంది. విడాకులు తీసుకున్నప్పుడు ఆద్య చాలా చిన్నపిల్ల. ఎనిమిదేళ్లు ఒంట‌రిగా ఉండ‌డం, ఇద్దరు పిల్లల‌ను పెంచ‌డం న‌ర‌కంగా ఉంటుంది. విడాకుల త‌ర్వాత నా బాధ‌ను వ‌ర్ణించ‌డానికి క‌ష్టం కంటే పెద్ద ప‌దంకావాలి. వ్యక్తి జీవితంలో పొర‌పాట్లు చేసి ఉండొచ్చు. కాని సామాజికంగా ఆయ‌న చాలా స్ర్టాంగ్‌. ప‌వ‌న్ నిజంగా గొప్పతండ్రి. ఏడాదికి రెండుసార్లు వ‌చ్చి పోతుంటారు. టైం దొరికిన‌ప్పుడ‌ల్లా పిల్లల్ని బాగా చూసుకుంటారని త‌న మ‌న‌సులో మాట‌ను వెల్లడించారు. 

ఇద్దరు పిల్ల‌ల‌ను పెంచ‌డం న‌ర‌కంగా ఉంటుందని చెప్పడంలోనే ఆమె ఎంత వేద‌న అనుభ‌వించి ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. త‌న క‌ష్టన‌ష్టాల‌కు, సుఖ‌దుఃఖాల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ కార‌ణ‌మైన‌ప్పటికీ అత‌న్ని కించ‌ప‌రిచేలా ఎక్కడా నోరుజార‌లేదు. పైగా జీవితంలో పొర‌పాట్లు జ‌రిగి ఉండొచ్చని, అత‌ను సామాజికంగా చాలా బ‌ల‌వంతుడ‌ని కితాబిచ్చారు. రాజ‌కీయ నాయ‌కుడికి ఉండాల్సిన అస‌లుసిస‌లు ల‌క్షణం సామాజిక దృఢ‌త్వమే. అంటే దేన్నైనా ఎదురించ‌గ‌లిగే సాహ‌సం, త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగే అంకితభావం ప‌వ‌న్‌లో పుష్కలంగా ఉన్నాయ‌ని ఆమె ఒక్కమాట‌లో చెప్పారు.

మ‌హాభారతంలో ధ‌ర్మజుడు అశ్వత్థామ హతః అని పెద్దగా చెప్పి కుంజ‌ర‌హః అని మెల్లగా త‌న గురువు, అశ్వత్థామ తండ్రైన ద్రోణుడికి వినిపించ‌కుండా చెబుతాడు. అబ‌ద్ధాలు చెప్పని ధ‌ర్మజుడు త‌న కుమారుడు చ‌నిపోయాడ‌ని ప్రక‌టించ‌డంతో ద్రోణుడు యుద్ధభూమిలో క‌న్నీటిప‌ర్యంత‌మై ఉండ‌గా పాండ‌వుల ప‌క్షంవారు అంత‌మొందిస్తారు.ఇప్పుడు ప‌వ‌న్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. రేణూ మెచ్చుకోలునూ స‌మాధి చేస్తూ మిగిలిన అంశాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.

నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింట‌న్‌కు మోనికాలెవ‌నెస్కీతో వివాహేత‌ర సంబంధం వెల్లడైన‌ప్పుడు హిల్లరీ త‌న భ‌ర్తకు అండ‌గా నిలిచింది. దీనికి ఆ దేశ సాంస్కృతిక నేప‌థ్యమే కార‌ణం. ప‌వ‌న్‌కు కూడా హిల్లరీ లాగా రేణూ అండ‌గా నిల‌వాల‌ని ఎలా కోరుకుంటాం? మ‌నదేశంలో వివాహం అంటే ఒక న‌మ్మకం, విశ్వాసం. అవి కోల్పయిన‌ప్పుడు ఆ సంబంధం కొన‌సాగ‌డం అర్థర‌హిత‌మ‌ని మ‌నదేశ మ‌హిళ‌లు భావిస్తారు.

ప‌వ‌న్ విష‌యంలో రేణూ అదే భావంచి ఉంటుంది. అలాగ‌ని అత‌న్ని బ‌జారుకీడ్చాల‌ని ప‌వ‌న్ నుంచి విడిపోయిన త‌ర్వాత ఈ ఎనిమిదేళ్లలో ఏనాడు చిన్న ప్రయ‌త్నం కూడా చేయ‌లేదు. చాలా హూందాగా ప్రవ‌ర్తించారామె. ఆమె సంస్కారానికి ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న అభిమానులు చేతులెత్తి న‌మ‌స్కరించాలి. అంతేకాదు త‌న గురించి రెండు మంచి మాట‌లు చెప్పిన రేణుదేశాయ్ కొత్త జీవితం స‌జావుగా సాగేలా ఆమెలా విజ్ఞత‌తో మెల‌గాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.