cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్‌‌ కొత్తగా రాలేదు.. నాగబాబు హీరో కాదు

పవన్‌‌ కొత్తగా రాలేదు.. నాగబాబు హీరో కాదు

రఘురామ కృష్ణంరాజు.. నరసాపురం నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గట్టి క్యాండిడేట్‌. సినిమా సర్కిళ్లలో, బిజినెస్‌ సర్కిళ్లలో, రాజకీయ వర్గాల్లో కాస్త గట్టిపేరున్న వ్యక్తి. ఆయన ఇప్పుడు ఈ ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా ఎంపిక కావడానికి వైకాపా తరపున పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ముఖాముఖి.

నమస్కారం రాజుగారూ.. ఎలా వుంది ఎన్నికల వేడి.
మాకేం పెద్ద వేడిగా లేదండీ. మీడియాకు వుండొచ్చు. కానీ గెలుపు గ్యారంటీ మీద వున్న పార్టీ కనుక మేమేమీ పెద్దగా టెన్షన్‌ పడడంలేదు.

గెలుపు మీద అంత ధీమా వుందా?
నా సంగతి అలా వుంచండి. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రావడం, జగన్‌ ముఖ్యమంత్రి కావడం నూటికి నూరుపాళ్లు ఖాయం. ఇప్పటి లెక్కల ప్రకారం 120 సీట్లు కచ్చితంగా వైకాపా గెల్చుకోబోతోంది.

సరే, రాష్ట్రం సంగతి పక్కనపెట్టి, మీదాకా అంటే మీ నియోజకవర్గం వరకు వస్తే, ఎలావుంది మీకు ట్రెండ్‌?
ఇటీవల కాలంలో బీసీలకు పార్టీ బాగా దగ్గరయింది. దాదాపు 80శాతం మంది బీసీలు వైకాపాకు అనుకూలంగా వున్నారు.

వెస్ట్‌ గోదావరిలో 2014లో తెలుగుదేశం స్వీప్‌ చేసింది. కానీ ఈ అయిదేళ్లలో ఎందుకు పరిస్థితి రివర్స్‌ అయింది? పరిస్థితి రివర్స్‌ అయిందని వస్తున్న వార్తలు నిజమేనా?
2014లో స్వీప్‌ చేసినమాట వాస్తవమే. ఇప్పుడు అట్నించి ఇటు పూర్తిగా తిరిగిపోయిందని నేను అనలేదు. ఓవరాల్‌గా వెస్ట్‌ గోదావరిలో ఇన్‌ జనరల్‌ బీసీల్లో గ్రాడ్యువల్‌గా మూవింగ్‌ టువర్డ్స్‌ వైకాపా.

2014లో క్షత్రియులు, కాపులు కలిసి పనిచేసారు. అందువల్లే స్వీప్‌ సాధ్యమైందని టాక్‌ వుంది. మరి ఇప్పుడు ఎలా వుంది?
అప్పట్లో కాపులు పూర్తిగా తెలుగుదేశం వైపు వున్నది వాస్తవం. క్షత్రియులు కూడా అంటే అలాగే అనుకోవాలి. దానికి రకరకాల కారణాలు. నేను కూడా ఓ కారణం.

ఇప్పుడు క్షత్రియుల్లో మార్పు?
అవును. 80శాతం మంది వైకాపా వైపు వున్నారు అన్నది వాస్తవం.

దీనికేమైనా ప్రత్యేకమైన కారణం వుందా? మంత్రిపదవి క్షత్రియులకు ఇవ్వలేదన్న అసంతృప్తి ఏమన్నా వుందా?
అసంతృప్తి ఏమిటి అనికాదు కానీ, వుంది అనే అనిపిస్తుంది. స్పెసిఫిక్‌ అని చెప్పలేను కానీ, అసంతృప్తి వుందని మాత్రం చెప్పగలను.

కేవలం వెస్ట్‌ గోదావరి క్షత్రియుల్లోనేనా, ఈస్ట్‌, విశాఖ ప్రాంతాల్లోని క్షత్రియుల్లో కూడా ఈ విధమైన అసంతృప్తి వుందని మీరు భావిస్తున్నారా?
మిగిలిన ఏరియాలను నేను అంతగా పరిశీలించలేదు.

అసలు జనసేన నుంచి మీరు ఏ మేరకు పోటీ వుంటుందని భావిస్తున్నారు.
జనసేనకు ఏ సర్వే చూసినా, ఒక్క తాడేపల్లిగూడెం మినహా మిగిలిన చోట్ల సింగిల్‌ డిజిట్‌నే కనిపిస్తోంది.

పవన్‌ సోదరుడు నాగబాబు పోటీ అవుతాడని మీరు ఊహించారా?
ఊహించాను. ముందే అంచనా వేసా.

నాగబాబుతో మీకు పోటీ ఎలా వుంటుందనుకుంటున్నారు?
ఏముంటుంది? ఏమీ వుండదు. నాగబాబు ఏమన్నా పెద్ద స్టార్‌ నా ఏమిటి? జస్ట్‌ ఓ యాంకర్‌ అంతే. ఆయన కొన్ని సినిమాలు చేసారు. అవేం పెద్దగా ఆయనకు పేరు తెచ్చినవి కాదు. యాంకర్‌గానే ఆయన ఎక్కువగా పాపులర్‌ అయ్యారు. ఏముంటుంది నాగబాబుకు. చిరంజీవిగారినే ఓడించారు ఇక్కడి జనం.

పవన్‌ కళ్యాణ్‌ పోటీచేస్తున్న భీమవరం కూడా మీ నియోజకవర్గంలోనిదే. దాని ప్రభావం ఎలా వుంటుంది?
ఏం ఉంటుందండీ బాబూ? ఏం వుంటుంది? సినిమాలు వేరు రాజకీయాలు వేరు. జనాలు ఇప్పుడు ఎమ్మెల్యేలో పాలేరును చూస్తున్నారు. వాళ్లకి ఎప్పుడూ ఎమ్మెల్యే అందుబాటులో వుండాలి. పలకరించాలి. పనులు చేయాలి. పవన్‌కళ్యాణ్‌లో పాలేరును చూడలేరు కదా? పవన్‌లో పాలేరును చూడాలి అనుకునే వాళ్లు ఓటేయరు. ఆయన్ను దేవుడిగా భావించేవారు ఫ్యాన్స్‌. కానీవాళ్లు ఆయనతో ఒక్క పని కూడా చేయించుకోలేరు. ఒక్క ఫోటో కూడా తీయించుకోలేరు. కొందరు వుంటారు. మనకి ఏ పనీ చేయకపోయినా ఒకే. ఫోటో దిగకపోయినా ఓకే. ఆయన పేరు, రూపంచాలు అనుకునే వీరాభిమానులు వుంటారు. వాళ్లు ఆయనకు ఓటేస్తారు. వీళ్లు ఓ పదిశాతం వరకు వుంటారేమో? ఆ మేరకు ఓట్లు పడతాయి. ఎవరైతే ఎమ్మెల్యేతో పనిచేయించుకోవాలి అనుకునేవారు పవన్‌కు ఓటేయరు. భీమవరంలో వైకాపా అభ్యర్థి శ్రీనివాస్‌ మంచి మెజార్టీతో గెలుస్తారు.

మీరు ఒకటి గమనించండి. లాస్ట్‌ టైమ్‌ చిరంజీవిగారు సూపర్‌ స్టార్‌డమ్‌లో వున్నారు. సూపర్‌ స్టార్‌డమ్‌. అప్పుడే ఆయన పాలకొల్లులో ఓడిపోయారు. నాకు ప్రాణ స్నేహితుడు ఆయన. ఇప్పటికీ టచ్‌లో వుంటాను. ఆయనకు వున్న చరిష్మా పవన్‌ కళ్యాణ్‌కు లేదు నాకు తెలిసి. అది అలావుంచితే పవన్‌ కళ్యాణ్‌ కొత్తగా రాలేదు. ప్రజారాజ్యం టైమ్‌లో యువరాజ్యం అంటూ పవన్‌ కళ్యాణ్‌ వచ్చారు. అప్పుడుదానికి నేత. ఇప్పుడు జనసేన నేత. అంతేతేడా.

అప్పట్లో చిరంజీవిగారు టూర్‌ చేసారు. రెండురోజల్ను. పవన్‌ కళ్యాణ్‌ కూడా తిరిగారు. ఇప్పుడు కూడా పవన్‌ అంతకు మించి తిరగలేరు. చిరంజీవిని ఓడించేంత చైతన్యం వుంది ఇక్కడి ఓటర్లకు. ఇప్పుడు కూడా అదే విజ్ఞత చూపిస్తారన్న నమ్మకం వుంది. పవన్‌కళ్యాణ్‌ స్టార్‌ అయినా, గెలుస్తారని నాకు నమ్మకంలేదు. ఇక నాగబాబు అటు చిరు, పవన్‌ సోదరుడిగా అభిమానం వుండొచ్చు. కానీ ఓటేసే ముందు వాళ్లు అది మాత్రమే చూడరు.

ఓటర్లలో అంతటి ఆలోచనా శక్తి వుందంటారా?
కచ్చితంగా. మనం ఓటర్లకు ఏమీతెలీదు అనుకుంటాం కానీ వాళ్లలో చాలా పరిణితి వుంది. వాళ్ల మనసులో మాట మనకు అంత సులవుగా అంతుపట్టదు.

ఈ పసుపు కుంకుమలు, ఫింఛన్ల ప్రభావం ఏ మేరకు వుంటుంది అనుకుంటున్నారు.
పసుపుకుంకుమ అంటూ చంద్రబాబు మహిళల కళ్లలో కొట్టారు. నిజానికి డ్వాక్రా మహిళలకు వున్న రుణాలు తీర్చాల్సివుంది. కానీ అవన్నీ అలా వున్నాయి. వాటి జోలికిపోకుండా, పదివేలు ఇచ్చి, పసుపుకుంకుమ అంటున్నారు. మరి అక్కడ అసలు బాకీ, వడ్డీ అలా పెరుగుతున్నాయి. వాటి సంగతి ఏమిటి? జగన్‌ అందుకే చెప్పారు. తాను అధికారంలోకి వస్తే ఆ రోజుకు వున్న మొత్తం డ్వాక్రా బాకీలు అన్నీ నాలుగు విడతలలో తీరుస్తా అంటున్నారు. మహిళలు ఈ పసుపుకుంకుమల పదివేలు బెటర్‌ నో, బాకీ మొత్తం తీర్చడం బెటర్‌ అన్నది ఆలోచించుకోవాలి.

ఈ విషయాన్ని జనానికి మీరు చెబుతున్నారా?
నేనయితే చెబుతున్నాను. నేను వెళ్లిన ప్రతిచోటా చెబుతున్నాను. జనాలు రియలైజ్‌ అవుతున్నారు చాలావరకు కూడా. వాళ్ల అదృష్టం బాగాలేక చంద్రబాబు పవర్‌లోకి వస్తే రూపాయి రాదు. అలాకాకుండా నిజమైన పసుపుకుంకుమ, రుణమాఫీ జరగాలంటే జగన్‌ సీఎం కావాలి.

జగన్‌ మోహన్‌రెడ్డి మీకు అత్యంత ఆప్తుడు. అందుకే మీరు రాజకీయాల్లోకి వచ్చారా?
2014లో వైఎస్‌ మీద అభిమానం, జగన్‌తో సాన్నహిత్యం వుండి రాజకీయాల్లోకి వచ్చాను. అయితే అనుకోని కారణాల వల్ల బయటకు వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ ఏదైతేనేం పొలిటికల్‌ ఆలోచనలు వున్నాయో, వాటిలోకి వచ్చాను.

మీ వియ్యంకుడు కేవీపీగారి ప్రోబ్బలం, ప్రోత్సాహం ఏ మేరకు?
అదేంలేదు. ఆయన ఎప్పుడూ నాకు ఏ రాజకీయ సలహా ఇవ్వలేదు. ఇవ్వరు. నేనే, ఇలా చేస్తున్నాను అని ఓ ముక్క చెబుతాను. అంతే.

నరసాపురానికి మీ పర్సనల్‌ మ్యానిఫెస్టో ఏమిటి?
ఇక్కడ ఓ పదివేల ఎకరాలు ప్రభుత్వ భూమి వుంది. జాతీయ రహదారి కనెక్టివిటీ వుంది. ఓఎన్జీసీ కనెక్టివిటీ కూడా తెచ్చుకోవచ్చు. అక్కడ ఎన్విరాన్‌ మెంటల్‌ హెజార్డ్‌ లేని పరిశ్రమలను తీసుకువచ్చి, ఓ భారీ పారిశ్రామికవాడను తయారుచేయాలన్నది కోరిక. ఇండస్ట్రియల్‌ పార్క్‌కు మంచి అవకాశం వుంది. అగ్రికల్చర్‌, అక్వాకల్చర్‌కు కెనాల్‌ సిస్టమ్‌ను బలోపేతం చేయాలి. అలాగే పొల్యూషన్‌ కారణంగా నీటి సదుపాయం పాడవుతోంది. దాన్ని రెక్టిఫై చేయాలి.

ఇక అన్నింటికి మించి భీమవరంలో ప్రభుత్వం వైద్య సదుపాయాలు లేవు. ప్రయివేటు ఆసుపత్రులు వందలు వున్నాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రి జస్ట్‌ 50 పడకలు మాత్రమే. మందులు అంతంతమాత్రం. అందువల్ల మాంచి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి తేవాల్సి వుంది. అలాగే ఇవ్వాళ డయాబెటిక్‌ బారిన పడనివారు లేరు. సో, నేరుగా కంపెనీలతో మాట్లాడి, ప్రభుత్వం ద్వారా భారీగా, హోల్‌సేల్‌ రేటుకు కొనుగోలు చేసి, సబ్సిడీ జోడించి, డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తులకు నెలనెలా ఉచితంగా లేదా తక్కువ ధరలకు మందులు అందించాలి. వైద్య శిబిరాలు నిర్వహించి, వీరిని గుర్తించాలి అన్నది కూడా ఆలోచన. వశిష్ట నదిమీద వంతెన అన్నది ఎప్పటి నుంచో పెండింగ్‌లో వుంది. అది కూడా నెరవేరాలి.

మీకు సినిమా రంగంతో మాంచి సంబంధాలు వున్నాయి కదా?
నాకు అందరూ క్లోజ్‌నే. ఈవెన్‌ పవన్‌కళ్యాణ్‌, నాగబాబు కూడా. నాగార్జున, వెంకటేష్‌తో చాలా సాన్నిహిత్యం వుంది.

మరి హీరోలు కానీ, సినిమా జనాలు కానీ మీకు మద్ధతుగా ప్రచారానికి వచ్చే అవకాశం వుందా?
అబ్బె.. వాళ్లనెందుకు ఇబ్బంది పెట్టడం. నాకు నేనే బ్రాండ్‌ ఇక్కడ. మీరు కనుక్కుంటే తెలుస్తోంది. నా ప్రచారం నేను వొళ్లు దగ్గర పెట్టుకుని చేసుకోవాలి. చేసుకుంటాను. అంతే కానీ వేరేవాళ్లు అక్కరలేదు. ఇక్కడ ఇద్దరు కాపులు, ముగ్గురు రాజులు పోటీ పడుతున్నారు. మరి ఓట్ల పోలింగ్‌ ఎలా వుంటుందనుకుంటున్నారు. ఏముంది? కాంగ్రెస్‌కు వన్‌ పర్సంట్‌ వుంటుంది. తెలుగుదేశానికి 30 నుంచి 33శాతం వుంటుంది. నా వరకు నాకు నలభై శాతానికి పైగా వస్తాయి అనుకుంటున్నాను.

మీ నియోజకవర్గం సంగతి వదిలేస్తే, అసలు జనసేన పట్టుకెళ్లే ఓట్లు ఎవరివి అనుకుంటున్నారు మీరు?
తెలుగుదేశానివే. ఒక హిడెన్‌ అండర్‌ స్టాండింగ్‌తో వున్నారు వాళ్లంతా. జనం ఏమనుకుంటున్నారు. ఇక్కడ వైకాపా-తెలుగుదేశం పోటీ అనుకోవడం లేదు. జనసేన-వైకాపా పోటీ అనుకుంటున్నారు. యాంటీ ఓటు చీలిపోవాలని చంద్రబాబు చేస్తున్న వ్యూహం ఇది. క్రిస్టియన్‌ ఓట్లు వన్‌పర్సంట్‌ అయినా పోవాలని పాల్‌ను రంగంలోకి దింపారు. ఇక్కడ ఎవరికీ తెలియని మాయావతి పార్టీని తీసుకువచ్చి ఇక్కడ సీట్లు ఇచ్చి, ఆ విధంగా ఎస్సీ ఓట్లు పక్కకు తప్పించాలని ప్రయత్నిస్తున్నారు.

కాపుల ఓట్లు వైకాపాకు వెళ్లకూడదని జనసేనను రంగంలోకి దింపారు. ఇక కాంగ్రెస్‌తో నేషనల్‌ లెవెల్‌లో బాబకు పొత్తువుందన్న సంగతి తెలిసిందే. అసలు జగన్‌ 175 సీట్లు ఒక్కసారి ప్రకటించేసారు. కానీ చంద్రబాబుకు అలా సాధ్యంకాలేదు. ఎందువల్ల అనుకుంటున్నారు. అటు జనసేన, ఇటు తెలుగుదేశం, వామపక్షాలు ఇలా అన్ని ఈక్వేషన్లు తెరవెనుక చంద్రబాబే చూడాల్సి వచ్చింది. అందుకే టైమ్‌ పట్టింది. సీపీఎమ్‌ బలంగా వుంటే సీపీఐ, బ్రాహ్మణులు బలంగా వున్నచోట్ల కమ్యూనిస్టులు, వైకాపా బలంగా వున్నచోట్ల జనసేన, ఇలా రకరకాల ఈక్వేషన్లు చూసుకుని రంగంలోకి దిగారు.

ఇలా అన్ని రకాలుగా ఓట్లు లాగి, చీల్చి వైకాపాను కట్టడిచేసి గెలవాలన్నది ఆయన వ్యూహం. అయితే జనాలు ఇదంతా గమనిస్తున్నారు. మొన్న హర్షకుమార్‌ ఏమని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. జనసేన-తేదేపా వేరు వేరు అనుకున్నాను. రెండూ ఒకటే అంటూ. జనసేన-సీపీఎమ్‌, సీపీఐ, బీఎస్‌పీ ఓ కూటమి. దానికి తెదేపాతో అనధికారపొత్తు. మరోపక్క పాల్‌, ఇంకోపక్క కాంగ్రెస్‌. ఇలా మొత్తం ఏడుపార్టీల కూటమి అన్నమాట. తెలుపు రంగును నిశితంగా పరిశీలిస్తే ఏడురంగులు బయటపడినట్లు, తెలుగుదేశాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఏడు పార్టీలు బయటపడతాయి. విజయవాడలో బోండాఉమ కాపు. అక్కడ జనసేన పోటీచేయాలి. కానీ చేయకుండా కమ్యూనిస్టులకు ఇచ్చారు. అలాగే కమ్యూనిస్టులు బలంగా వున్నచోట ఇవ్వకుండా లేనిచోట్ల ఇచ్చారు. ఇదంతా స్ట్రాటజీ.

ఈ వ్యూహం అంతా ఏమేరకు ఫలిస్తుంది?
జనాల తెలివి తేటల ముందు చిత్తవుతుంది. నేను గట్టిగా ప్రజలకు చెబుతున్నాను. వాళ్లు అర్థం చేసుకుంటున్నారు. జనాలకు ఆ మాత్రం తెలివితేటలు వున్నాయి. అందువల్ల సరైన పాఠం 11న చెబుతున్నారు.

థాంక్యూ సర్‌. బెస్టాఫ్‌ లక్‌.
థాంక్యూ

-విఎస్‌ఎన్‌ మూర్తి