cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్‌ లేకపోతే చంద్రబాబు గెలిచే ఛాన్సుండేదా.?

పవన్‌ లేకపోతే చంద్రబాబు గెలిచే ఛాన్సుండేదా.?

తెలుగుదేశం పార్టీకి జనసేన దెబ్బ చాలా గట్టిగానే తగిలింది. కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ ఇంకొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జనసేన కొట్టిన దెబ్బను తలచుకుని కుమిలిపోతున్నారట టీడీపీ అభ్యర్థులు. దాదాపు 8 లోక్‌సభ నియోజకవర్గాల్లో జనసేన దెబ్బ గట్టిగా తగలడం వల్లే ఓడిపోయామని టీడీపీ అధినేత చంద్రబాబుకి, పార్టీ ముఖ్యనేతలు సమాచారమిచ్చారట. ఓ 30 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ విజయావకాశాల్ని దెబ్బకొట్టిందన్నది తెలుగు తమ్ముళ్ళ విశ్లేషణ.

అయితే, ఒక్క లోక్‌సభ నియోజకవర్గంలోనూ కనీసం రెండో స్థానానికి కూడా ఎగబాకలేకపోయింది జనసేన. ఒకట్రెండు చోట్ల మినహాయిస్తే అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. మరీ ఇంత దారుణమైన పరిస్థితి జనసేనకు వస్తుందని ఎవరు ఊహించలేదు. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత.. అన్నట్టు, జనసేన పార్టీకి ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణే బలం, బలహీనత కూడా.!

జనసేన సంగతి పక్కన పెడితే, తమ ఓటమికి ఓ కుంటి సాకు దొరికిందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారిప్పుడు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు, చిరంజీవి కారణంగానే తాము ఓడిపోయామంటూ బుకాయింపులు షురూ చేసిన విషయం విదితమే. మెజార్టీల లెక్కలు కట్టి, వాటిని జనసేనకి వచ్చిన ఓట్లతో పోల్చి.. టీడీపీ నేతలు కిందామీదా పడ్తున్నారు.. ఓటమికి గల కారణాల్ని వెతుక్కుంటూ.

ఒకవేళ జనసేన అనే పార్టీ లేకపోయి వుంటే, మొత్తంగా 175 స్థానాల్లో 165 నుంచి 170 స్థానాల్లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయబావుటా ఎగురవేసి వుండేదేమో.! లోక్‌సభ నియోజకవర్గాలన్నిటిలోనూ టీడీపీకి గుండు గీసేసి వుండేదేమో.! ఇదీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాదన. అవును మరి, 150 మార్క్‌ని అందుకోవడమంటే ఆషామాషీ విషయం కాదు. ఇది నిఖార్సయిన ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీ అంటే.