cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్‌ కళ్యాణ్‌ నాకు దేవుడే: బండ్ల గణేష్‌

పవన్‌ కళ్యాణ్‌ నాకు దేవుడే: బండ్ల గణేష్‌

సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్‌, కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. 'నేను చిన్నప్పటి నుంచీ కాంగ్రెస్‌ వాదినే. పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీకి అధినేత అయినాసరే, నాకు కాంగ్రెస్‌ పార్టీ అంటే ఇష్టం కాబట్టే కాంగ్రెస్‌ పార్టీలో చేరాను. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ పవన్‌కళ్యాణ్‌ నాకు దేవుడే. ఇందులో ఎలాంటి మార్పూలేదు..' అంటూ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనంతరం బండ్ల గణేష్‌ ఓ ప్రశ్నకు బదులిచ్చాడు. 

బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినా, ఆయనకు అన్ని పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. టీఆర్‌ఎస్‌లో సన్నిహితులున్నారు.. టీడీపీలోనూ స్నేహితులున్నారు.. జనసేన సంగతి సరే సరి. మొన్నీమధ్యనే బండ్ల గణేష్‌, టీడీపీ ఎంపీ (రాజ్యసభ) సీఎం రమేష్‌, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసమంటూ నిరాహార దీక్ష చేస్తే, ఆ దీక్షా శిబిరంలో హల్‌చల్‌ చేసిన సంగతి తెల్సిందే. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన మాజీమంత్రి బొత్స సత్యనారాయణ, బండ్ల గణేష్‌కి అత్యంత సన్నిహితుడు. 

మొత్తమ్మీద, టీఆర్‌ఎస్‌ నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ బండ్ల గణేష్‌, అత్యంత వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారన్నమాట. నిజానికి టీడీపీ నుంచి పోటీ చేయాలనుకున్నా, తెలంగాణలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్‌నే ఆయన బెస్ట్‌ ఆప్షన్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 

'బండ్ల గణేష్‌ అనే నేను..' అనే మాటని అసెంబ్లీలో చెప్పాలని వుందంటూ బండ్ల గణేష్‌, మీడియా ముందు వ్యాఖ్యానించడం గమనార్హం. కాంగ్రెస్‌లో చేరాడు సరే, పవన్‌కళ్యాణ్‌ని రాజకీయంగా విమర్శించాల్సి వస్తేనో.? 'ఛస్తే విమర్శించను..' అని క్లారిటీ ఇచ్చేశాడు బండ్ల గణేష్‌.

ఇదికాస్త ఆశ్చర్యకరమే. రాజకీయాలన్నాక నిన్నటిమాట నేడు పనిచేయదు.. నేటిమాట, రేపటికి పనిచేయదు. బండ్ల గణేష్‌ కూడా ఆ టైపేనా.? వేచి చూడాల్సిందే.