Advertisement


Home > Politics - Political News
పవన్‌కళ్యాణ్‌ స్కోర్‌ ఎంత వుండొచ్చంటే.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా 2019 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో అసలు పోటీ అధికార తెలుగుదేశం పార్టీకి, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మధ్యనే వుంటుంది. మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని టీడీపీ, ఎలాగైనా అధికారంలోకి రావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఓ రేంజ్‌లో వుండబోతోంది. మరి, ఈ ఫైట్‌లో పవన్‌కళ్యాణ్‌ పాత్ర ఏంటి.? త్రిముఖపోటీ జరిగితే, పవన్‌కళ్యాణ్‌ ఎవరి విజయావకాశాల్ని దెబ్బతీస్తారు.? అన్న చర్చ జరగడం సహజమే.

మిగతా విషయాల్ని పక్కనపెడితే, అన్నయ్య చిరంజీవి రికార్డ్‌ని పవన్‌కళ్యాణ్‌ ముందుగా దాటాల్సి వుంటుంది. భారీ అంచనాల నడుమ సూపర్‌ ఫ్లాప్‌ అయ్యింది చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ. ఎన్నికలు జరిగాక, కొంతకాలం కూడా ఆ పార్టీ మనుగడ సాధించలేక చతికిలపడిపోయింది. ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలో కలిపేసి చేతులు దులిపేసుకున్నారు. మరి, పవన్‌కళ్యాణ్‌ పరిస్థితి ఏంటట.!

చిరంజీవి లాగానే పవన్‌కళ్యాణ్‌ కూడా, అభిమానులే ఓటర్లు.. ఆ అభిమానులకు తోడు ఇతరత్రా అంశాలు కలిసొస్తే, అధికార పీఠమెక్కొచ్చనే ఆలోచనతోనే వున్నారు. అయితే, రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవికి పెద్దగా సమయం లేకపోయింది. వున్న సమయాన్నే ఆయన వీలైనంత ఎక్కువగా వినియోగించుకున్నారన్నది కాదనలేని వాస్తవం. పార్టీ నిర్మాణం దగ్గర్నుంచి, ప్రతి విషంలోనూ ప్రస్తుత జనసేనతో పోల్చితే, ఒకప్పటి ప్రజారాజ్యమే చాలా బెటర్‌.

పార్టీ ప్రారంభమయి నాలుగేళ్ళు పూర్తయినా ఇంతవరకు జనసేనకి సంబంధించి పూర్తిస్థాయి నిర్మాణమే జరగలేదాయె. మరి, 2019 ఎన్నికలకు జనసేన ఎలా సన్నద్ధమవుతుంది.? అన్న ప్రశ్నకు పవన్‌కళ్యాణ్‌ దగ్గరే సమాధానంలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా ప్రతిపక్షానికే వెళుతుంది. దాంట్లో ఎంతోకొంత షేర్‌ పవన్‌కళ్యాణ్‌ తీసుకోగలగుతారేమో. మరి, అభిమానుల మాటేమిటి.? మెగా అభిమానుల్ని పవన్‌ ఇటీవలే అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నించారు.

అభిమానుల్లో ఒకరిది జనసేన పార్టీ.. అంటూ చెప్పిన పవన్‌, 'అతి చేయొద్దు..' అంటూ అదే మీటింగ్‌లో అభిమానులకు ఇచ్చిన షాక్‌తో అంతా అవాక్కవ్వాల్సి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే చిరంజీవికి 20 ప్లస్‌ అసెంబ్లీ సీట్లు కూడా రాలేదాయె. ఒక్క ఎంపీ సీటు కూడా దక్కించుకోలేకపోయింది ప్రజారాజ్యం పార్టీ. మరి, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో జనసేన 'స్కోర్‌' ఎంత.? 20 ప్లస్‌ సాధిస్తే మాత్రం, జనసేన ఎంతోకొంత సక్సెస్‌ అయినట్లే.

కాదు, అధికారం దక్కించుకుంటామని జనసేన పార్టీ చెబుతున్న మాటలు నిజమవుతాయా.? వేచి చూడాల్సిందే.