Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆహ్వానం లేదా..? పవన్ ఆవేశ పడలేదా..?

ఆహ్వానం లేదా..? పవన్ ఆవేశ పడలేదా..?

అమరావతి జనభేరి సభని అన్నీ తానై నడిపించింది టీడీపీ. వేదికపై ఉద్యమ నాయకుల కంటే ఎక్కువగా టీడీపీ నేతలే కనిపించారు. అయితే అలవాటు ప్రకారం పసుపు పచ్చ కండువాలు కాకుండా.. తెలివిగా ఆకుపచ్చ కండువాలు వేసుకొని ఊసరవెల్లుల్లాగా మారిపోయారు. బీజేపీ తరపున కూడా అటెండెన్స్ పడింది. 

వామపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. ఉందో లేదో తెలియని కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి హాజరయ్యారు. పేరు తెలియని చాలా పార్టీలను కూడా చంద్రబాబు అనుకూల మీడియా బాగా హైలెట్ చేసి మరీ హడావిడి చేసింది. రాగా పోగా జనసేన తరపునే ఎవరూ హాజరు కాలేదు. ఇంతకీ జనభేరికి పవన్ కి ఆహ్వానం అందలేదా.. లేక పవన్ స్వయంగా తప్పుకున్నారా అనేది తేలాల్సి ఉంది.

అమరావతి పేరుతో జరుగుతున్న ఉద్యమాన్ని టీడీపీయే మొదలుపెట్టినా.. ఇతర ప్రాంతాల్లో వస్తున్న నిరసనలతో కొన్ని రోజులు అంటీ ముట్టనట్టు వ్యవహరించారు ఆ పార్టీ నేతలు. జోలెపట్టి ఊరూరా తిరుగుతానన్న బాబు, అర్థాంతరంగా అడుక్కునే కార్యక్రమాన్ని అటకెక్కించారు. కరోనా దెబ్బతో తండ్రీకొడుకులిద్దరూ హైదరాబాద్ చెక్కేయడంతో ఇక్కడ ఎవరూ కనిపించలేదు.

బీజేపీ కూడా మధ్యలో మానేసి, ఇటీవలే ఉద్యమానికి పూర్తి మద్దతివ్వడం మొదలు పెట్టింది. కానీ పవన్ కల్యాణ్ మొదటి నుంచీ ఒకే మాటపై ఉన్నారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచీ పవన్ అమరావతికే జై అంటున్నారు. 

రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదేనంటూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేసినా.. ఏపీ హైకోర్టులో జనసేన తరపున అమరావతికి జై అంటూ పవన్ అఫిడవిట్ వేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు.

అలాంటి పవన్ ఏడాది సంబరంలో ఎందుకు పాల్గొనలేదు. కనీసం తన ప్రతినిధులనైనా అక్కడికి ఎందుకు పంపించలేదు. అసలు పవన్ కల్యాణ్ కి ఆహ్వానం అందిందా.. లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి అమరావతి రైతుల తరపున అన్ని పార్టీలకూ ఆహ్వానాలు వెళ్లాయి, కానీ జనసేన మాత్రం ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకుంది.

జనసేన తరపున ఎవరినైనా పంపించడం, వారు హైలెట్ కావడం పవన్ కి ఇష్టం లేదు. ఒకవేళ తానే నేరుగా వెళ్లాలంటే అక్కడ బాబు పక్కన కూర్చోవాల్సి వస్తుందనే భయం ఉండనే ఉంది, అన్నిటికీ మించి ఆయన సినిమా షూటింగ్ లో ఉన్నారు. షూటింగ్ మూడ్ లోకి వెళ్తే ఇక పవన్ కి ప్రజలు పట్టరు. అందుకే ఆయన జనభేరిని పక్కనపెట్టి, సినిమా భేరిలో మునిగిపోయారు.

అన్నిటికంటే ముఖ్యమై కారణం ఏంటంటే.. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో జై అమరావతి అంటే, రాయలసీమవాసులు ఏమంటారోననే భయం కూడా పవన్ లో ఉంది. దీంతో కొన్ని రోజుల పాటు ఉద్యమానికి, ఆ వ్యవహారానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట జనసేనాని. 

జనభేరితో జరిగిన హడావిడికి పవన్ దూరంగా ఉండటానికి ఇదే అసలు కారణం అంటున్నారు. జనభేరికి డుమ్మాకొట్టిన పవన్.. తన నిర్మాత దిల్ రాజు ఇచ్చిన బర్త్ డే పార్టీకి మాత్రం సూటు వేసుకొని హాజరయ్యారు.

రాబోయే ఎన్నికల్లో కుప్పంలో బాబును ఓడిస్తారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?