Advertisement


Home > Politics - Political News
మరోసారి లోకేష్ పై పవన్ విమర్శలు

చంద్రబాబు సొంతజిల్లా చిత్తూరులో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బాబుపై విమర్శలు చేశారు. టీడీపీ సర్కార్ అవినీతిని ఎండగడతామని, ప్రజల సహకారంతో ప్రభుత్వంపై తిరగబడతామని హెచ్చరించారు పవన్. చిత్తూరు జిల్లా శెట్టిపల్లి గ్రామంలో రైతులకు ఇష్టంలేకుండా వాళ్ల భూముల్ని స్వాధీనం చేసుకోవడాన్ని పవన్ తప్పుబట్టారు. 

"రైతులకు అండగా ఉంటామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ల భూములు లాక్కుంటున్నారు. మేం ఎందుకు తిరగబడకూడదు. నా పార్టీకి అన్యాయం చేస్తే వేరే రకంగా పరిష్కరించుకుంటాను. కానీ ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం రోడ్డుపైకొచ్చి పోరాటం చేస్తాను."

తన పర్యటనలో భాగంగా లోకేష్ పై మరోసారి పరోక్షంగా విమర్శలు చేశారు పవన్. వేలకోట్ల రూపాయలు దోచేసే తెలివితేటలున్న టీడీపీలోని ముఖ్యనేతలకు, 6వందల ఎకరాలు కాపాడే తెలివితేటలు లేవా అని ప్రశ్నించారు. సంపన్నులకు ఓ న్యాయం, రైతులకు మరో న్యాయం అనే విధంగా చంద్రబాబు పరిపాలన ఉందన్నారు పవన్. 

రాష్ట్ర అభివృద్ధి కోసం సుస్థిరమైన ప్రభుత్వం వస్తుందనే ఉద్దేశంతో అప్పట్లో టీడీపీకి మద్దతిచ్చానని, కానీ అది భ్రమనే విషయం తెలిసిందన్నారు జనసేనాని. త్వరలోనే శ్రీకాకుళం జిల్లా నుంచి తన బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు పవన్. 2 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించబోతున్నారు. ప్రస్తుతం పవన్ విశాఖలో ఉన్నారు.