cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఈ లెక్కేంటి పవన్.. ఇంత తిక్క తిక్కగా ఉంది

ఈ లెక్కేంటి పవన్.. ఇంత తిక్క తిక్కగా ఉంది

పరిషత్ ఫలితాలపై పూర్తి సమాచారం తెప్పించుకుని మళ్లీ స్పందిస్తానంటూ పవన్ కల్యాణ్ చెబితే.. ఆ వివరణ ఇంకెలా ఉంటుందో అని అనుకున్నారంతా. కానీ ఫలితాల విశ్లేషణలో చంద్రబాబుని మించిపోయారు పవన్ కల్యాణ్. తనకో లెక్క ఉందని, దానికో తిక్క ఉందని సినిమాలో చెప్పినట్టు.. నిజజీవితంలో కూడా తిక్క లెక్క చెప్పి కామెడీ పండిస్తున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేనకు ఏకంగా 25 శాతం ఓట్లు వచ్చాయన చెప్పుకున్నారు పవన్ కల్యాణ్. పాతిక శాతం ఓట్లు పవన్ పార్టీకి వస్తే, మరి వైసీపీ 95శాతం సీట్లు ఎలా గెలిచిందా అని ఈ విశ్లేషకులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. 

జనసేన బలం పెరిగిందని చెప్పుకుంటే పర్లేదు, బీజేపీ కంటే జనసేన మెరుగ్గా పనిచేసిందని అనుకున్నా అతిశయోక్తి లేదు, ఫలితాలతో టీడీపీలో భయం మొదలైందని అంటే.. అక్కడి వరకూ ఓకే. కానీ ఏకంగా పాతిక శాతం ఓటర్లు తమవైపే ఉన్నారంటూ పవన్ సరికొత్త లెక్క చెప్పి, వినేవాళ్లకు తిక్క తెప్పిస్తున్నారు.

త్రివిక్రమ్ డైలాగులు.. టీఆర్ఎస్ తో పోలిక..

బిందువుగా మొదలై, సింధువుగా మారి, మార్పుకి శ్రీకారం చుట్టామంటూ ఫలితాల విశ్లేషణ సందర్భంగా ప్రాస కోసం పాకులాడారు పవన్ కల్యాణ్. త్రివిక్రమ్ డైలాగుల్ని గుర్తు చేశారు. అయితే ఇక్కడ ఆయన ఇంకో అడుగు ముందుకేసి టీఆర్ఎస్ తో పోలిక పెట్టుకున్నారు.

టీఆర్ఎస్ కూడా మొదట్లో తక్కువ స్థానాలే గెలుచుకుందని, అలాగే జనసేన ప్రస్థానం కూడా తక్కువ సీట్లతో మొదలైందని చెప్పుకొచ్చారు పవన్. టీఆర్ఎస్ ఎలా బలపడిందో, అలాగే జనసేన కూడా బలం పెంచుకుంటుందని, ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తుందని సెలవిచ్చారు.

తమిళనాడులో స్థానిక ఎన్నికలను బహిష్కరించిన అన్నాడీఎంకే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అధికారంలోకి వచ్చిందో.. అలాగే టీడీపీ కూడా వ్యూహాత్మకంగా అధికారంలోకి వస్తుందంటూ ఇటీవల పచ్చ పార్టీ నేతలు పలికిన ప్రగల్భాలకు ఏమాత్రం తక్కువలేవు పవన్ కల్యాణ్ ప్రవచనాలు.

బీజేపీకి చురక.. వదిలించుకునేందుకు మెలిక..

పరిషత్ ఎన్నికల్లో బీజేపీకి కొన్ని సీట్లు కేటాయించామని, అందువల్లే ఫలితాల్లో తమ విజయాల సంఖ్య తగ్గిందని పరోక్షంగా కమలదళంపై సెటైర్లు వేశారు పవన్ కల్యాణ్. వారికి కేటాయించిన సీట్లలో ఆ పార్టీ బాగా పనిచేసి ఉంటే.. మరింత మెరుగైన ఫలితాలు సాధించేవారమంటూ చెప్పుకొచ్చారు. దీనిపై బీజేపీ, జనసేన కలసి కూర్చుని మాట్లాడుకుంటాయమని అన్నారు.

బీజేపీ బాగా పనిచేసి ఉంటే.. అనే డైలాగ్ కొట్టారంటే కచ్చితంగా ఆ పార్టీని చెంపదెబ్బ కొట్టినట్టే లెక్క. గతంలో కూడా పలు సందర్భాల్లో త్యాగరాజులా మారి ఆనక తీరిగ్గా బాధపడిన పవన్ కల్యాణ్, పరిషత్ ఎన్నికల ఫలితాల విశ్లేషణలో కూడా ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు కొట్టారు. బీజేపీతో సర్దుబాటు లేకపోతే.. తమ సత్తా చూపించేవారిమన్నారు.

నవ్విపోదురుగాక..

గతంలో ఎన్నికల ప్రక్రియ సరిగ్గా జరగలేదని, అధికార దుర్వినియోగం జరిగిందని, అందుకే వాటిని రద్దు చేయాలంటూ తాము కోర్టు మెట్లెక్కామని చెప్పిన పవన్ కల్యాణ్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే జనసేన 1500 ఎంపీటీసీ సీట్లు గెలిచేదంటూ జోస్యం చెప్పారు. అక్కడితో ఆగలేదు, 40నుంచి 80 జడ్పీటీసీ స్థానాల్లో కూడా జనసేన అభ్యర్థులు గెలిచేవారని జబ్బలు చరుచుకున్నారు.

మొత్తమ్మీద పవన్ కల్యాణ్ గోరంత విజయానికి కొండంత ప్రచారం చేస్తున్నారని మాత్రం అర్థమవుతోంది. ఆమాత్రం కాన్ఫిడెన్స్ ని ఎవరూ కాదనలేరు కానీ, అది ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారి మొదటికే మోసం తెస్తే మాత్రం ప్రమాదం.

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×