cloudfront

Advertisement


Home > Politics - Political News

పూర్తిగా 'చంద్ర'ముఖిలా మారిన పవన్ ను చూడు

పూర్తిగా 'చంద్ర'ముఖిలా మారిన పవన్ ను చూడు

మంచినీటి కనెక్షన్ కి కూడా డబ్బులు వసూలు చేస్తున్న రోజులివి. అలాంటిది ఏకంగా వంట గ్యాస్ ని ఇంటింటికీ ఉచితంగా ఇస్తానని ప్రకటించిన నాయకుడిని ఏమనాలి. మతి భ్రమించిందేమో చెక్ చేయాలి, మనం అంత వెర్రివాళ్లుగా కనిపిస్తున్నామా అని మనకు మనం చెక్ చేసుకోవాలి. ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా వెనకాడరని నవ్వుకోవాలి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను చూసి ఇప్పుడు ఇలానే నవ్వుకోవాలేమో.

అనంతపురంలో జనతరంగం అనే తతంగాన్ని ప్రారంభించిన పవన్, ఓ ఇంటికి వెళ్లి వారి కష్టాలు చూడలేక జనసేన అధికారంలోకి వస్తే ఉచితంగా గ్యాస్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చేశారు. వినడానికి బాగానే ఉంది, పేదలకు ఉచితంగా గ్యాస్ ఇస్తే వద్దనేవారు ఎవరూ లేరు, కానీ అది సాధ్యమేనా అనేది ఆలోచించాలి కదా.

ఆ మధ్య గోదావరి జిల్లాల్లో గ్యాస్ పైప్ లైన్లు లీకవుతున్నా కంపెనీలు పట్టించుకోవడం లేదని, మన సహజ వనరుల్ని ఉత్తరాది వారు దోచుకెళ్తున్నారని నానా హంగామా చేశారు పవన్. ఆ సందర్భంలో తట్టిన ఐడియా కావొచ్చు, మన గ్యాస్ ని మనమే ఉచితంగా ఇచ్చుకుంటే బాగుంటుందని ఎవరో పవన్ చెవిలో ఊదినట్టున్నారు. అనుకున్నదే తడవుగా అనంతపురంలో ఈ ఐడియాని జనాలపైకి వదిలారు పవన్.

బియ్యం, పప్పులు ఫ్రీగా అడిగామా, మాకు కావాల్సింది ఉద్యోగాలు అంటూ కొన్నాళ్లుగా పవన్ కల్యాణ్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అలాంటి ఆయనే ఇప్పుడు వాగ్దానాల్లో ఆల్ ఫ్రీ బాబుని వెనక్కి నెట్టేసేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే రేషన్ స్థానంలో డబ్బులిస్తామని, నేరుగా బ్యాంక్ ఎకౌంట్లోకి డబ్బు వేస్తాం, నచ్చినవి కొనుక్కొని తినండంటూ ప్రకటించారు పవన్.

ఇప్పుడు ఫ్రీ గ్యాస్ పథకంతో మరోసారి చంద్రబాబును తలపిస్తున్నారు. గ్యాస్ సిలిండర్లపై రాయితీ కోసమే ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాయి. అటు కేంద్రానికి కానీ, ఇటు రాష్ట్రాలకు కానీ గ్యాస్ సబ్సిడీని భరించడం తలకుమించిన భారంగా మారింది.

ఇక మోడీ వచ్చిన తర్వాత గ్యాస్ ధర పెంపు అంశమనేది పిచ్చోడి చేతిలో రాయిగా మారింది. ఇప్పటికే చమురు సబ్సిడీ భారాన్ని మెల్లగా తగ్గించుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. త్వరలోనే గ్యాస్ సబ్సిడీ భారాన్ని కూడా వదిలించుకోవాలని చూస్తున్నాయి. గ్యాస్ చుట్టూ ఇంత రాజకీయం, ఇన్ని లక్షల కోట్ల వ్యవహారం నడుస్తోంది.

ఇవన్నీ తెలిసి కూడా గ్యాస్ ఉచితంగా ఇచ్చేస్తానని ప్రకటించారు పవన్. అలా ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్ లో సగం కూడా సరిపోదనే విషయాన్ని కూడా ఆలోచించకుండా హామీ ఇచ్చేశారు. గతంలో చంద్రబాబు చెప్పిన రుణమాఫీ పథకం లాంటిదే ఇది కూడా.

గత ఎన్నికల్లో రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించిన బాబు.. నాలుగున్నరేళ్లు తిరిగేసరికి ఏ స్థాయిలో రుణమాఫీ చేశారో అంతా చూశాం. అన్నేళ్లు బాబుతో సావాసం చేసిన పవన్ కూడా ఇప్పుడు "ఫ్రీ గ్యాస్" అంటూ మరో రుణమాఫీ టైపు పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రజల్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్