Advertisement

Advertisement


Home > Politics - Political News

పవన్ బాబుతో ఊహాజనిత ఇంటర్వ్యూ!

పవన్ బాబుతో ఊహాజనిత ఇంటర్వ్యూ!

ఎవరు మీలో కోటీశ్వరులు లాంటి కార్యక్రమానికి రామ్ చరణ్, మహేష్ బాబు, సమంత, రాజమౌళి, కొరటాల శివ, దేవీ శ్రీప్రసాద్, థమన్ లాంటి సెలబ్రిటీలు హాజరయ్యరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఆయన ఇలాంటి వాటికి రారు. ఆయన లెవెల్ వేరు. అది వాస్తవం. అలాగే పవన్ సాధారణంగా ఇంటర్వూలు ఇవ్వరు. ఇచ్చినా ప్రశ్నలు అడిగేవారు మనకు కనిపించరు. ముందుగా రాసి ఇచ్చిన ప్రశ్నలు ఎవరో కనిపించకుండా చదువుతున్నట్లు అడుగుతుంటారు. 

కానీ సరదాగా ఓ ఊహ. పవన్ కళ్యాణ్-కనుక ఓ ఓ క్విజ్ కార్యక్రమం లేదా ఇంటర్వ్యూకి హాజరయితే ఎలా వుంటుంది. జస్ట్ ఇది సరదా గల్పిక మాత్రమే. ఎవరినీ నొప్పించేందుకు కాదు.

...రండి..రండి అన్నగారూ..స్వాగతం మా షో కి

... బేసిక్ గా నాకు ఇలాంటి బంధాలు అవీ పెద్దగా ఇష్టం వుండవు. నాకు ఎనిమిదేళ్ల వయసు వున్నపుడు అనుకుంటాను స్కూల్లో టీజర్ ఓరేయ్ అబ్బాయ్ ఇలా అని పిలిస్తే, ఆ రోజే నేను ఇలాగే చెప్పాను. నాలో అలాంటి భావాలు అప్పటి నుంచే వున్నాయి. కళ్యాణ్ అని పిలిస్తే చాలు.

సరే..కళ్యాణ్ గారూ ఈ క్విజ్ కార్యక్రమం గురించి మీకు తెలుసు అనుకుంటాను. 

నాకు తెలియదు. ఇందాక బయల్దేరే ముందు త్రివిక్రమ్ ను అడిగితే కొంచెం చెప్పారు. మీకు తెలుసు కదా ఆయన గోల్డ్ మెడలిస్ట్..ఆయనకు చాలా తెలుసు.

సరే కొన్ని ప్రశ్నలు వుంటాయి. కొన్ని ఆప్షన్లు వుంటాయి. ప్రశ్న ప్రశ్నకు బహుమానం పెరుగుతుంది.

బేసిక్ గా నాకు ఈ ఆప్షన్లు వద్దు. నేను ఏది అనుకుంటే అదే చెబుతాను. చేస్తాను. చాయిస్ తీసుకోను. ఇంటర్ లో ఏ గ్రూప్ అంటూ ఆప్షన్స్ ఇచ్చారనే నేను దాని జోలికి వెళ్లలేదు.

అంటే మీరు ఇంటర్ కూడా. 

ఇప్పుడు అది అంత ముఖ్యంకాదు. ప్రశ్నలు అడగండి

రాజకీయాల్లో మీకు ఆదర్శం ఎవరు..ఆప్షన్లు ఇవ్వనా

అవసరం లేదు అని చెప్పాను కదా..నాకు ఆదర్శం అంటే ఒక్కోసారి ఒక్కోలా వుంటుంది. ప్రజారాజ్యం టైమ్ లో ఒకలా..జనసేన ఆరంభంలో ఇంకోలా. ఇప్పుడు మరోలా. మీరు స్పెసిఫిక్ గా పీరియడ్ చెప్పి క్వశ్చను అడగండి

గత ఎన్నికల ముందు భాజపాతో ఎందుకు పొత్తు కట్ చేసుకున్నారు. ఎన్నికలయ్యాక ఎందుకు పెట్టుకున్నారు. ఇది వుంటుందా? ఊడుతుందా?

నేను ఒంగోలులో వున్నపుడు అనుకుంటాను మా నాన్నగారికి నెల్లూరు బదిలీ అయింది. నాకు అప్పుడు నెల్లూరు నచ్చింది. ఆ తరువాత అన్నయ్యతో చెన్నయ్ కు వచ్చాను. అప్పుడు నాకు చెన్నయ్ నచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ లో వుంటున్నా. ఇది నచ్చింది. టైమ్ ను బట్టి నచ్చడం, కలిసి వుండడం వుండకపోవడం వుంటాయి.

బాగుంది...ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపినపుడు మీరు అన్నయ్యతో ఏకీభవించారా? విబేధించారా?

అన్నయ్య అంటే నాకు గౌరవం. ఆయన ఓ సినిమా నటుడిగా కాదు. చాలా కష్టపడి పైకి వచ్చారు. ఎందరినో పైకి తీసుకువచ్చారు. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం. 

మేము అడిగింది వేరు సర్...

మీరు ఏం అడిగినా, ఈ సమాధానానికి తగినట్లు క్వశ్చను మార్చుకోండి. అది బెటర్ కదా.

మీరు రాజకీయ పాదయాత్ర చేస్తారు? చేయరు? ఏది కరెక్ట్.

నేను ఏది చేస్తాను? ఏది చేయను అన్నది నాకే తెలియదు. ఏది కరెక్టో మీకు ఎలా చెబుతాను.పాదయాత్ర చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే చేయనేమో? కానీ అలా చేయను అని కాదు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంటుంది. చేద్దాం అని. చేస్తానేమో?

2019 ముందు గ్యాస్ ఫ్రీగా ఇస్తాను అని మీరు వాగ్దానం చేసారు. మీరు పొత్తు పెట్టుకున్న భాజపా వల్ల గ్యాస్ సిలెండర్ రేటు వంద రూపాయలు దాటిపోయింది. ఇప్పుడు మీ దారి ఎటు?

మా చిన్నప్పుడు మా నానమ్మ, అమ్మమ్మ వాళ్లు కర్రల మీద వండేవారు. నాకు చూడ్డానికి భలే చిత్రంగా వుండేది. అప్పుడు చిన్నపిల్లాడిని నాకేం తెలిసేది కాదు. పెద్దయ్యాక వదిన గ్యాస్ మీద వండుతుంటే, గ్యాస్ ఇంటింటికీ అవసరమే అని నాకు ఆ రోజుల్లోనే అర్థం అయింది. అందుకే ఆ వాగ్దానం చేసాను. అది అప్పటికప్పుడు అనుకున్నది కాదు. చాన్నాళ్లుగా నాలో రగులుతున్న ఆలోచన అది.

రాజధానిగా మీ ఓటు అమరావతికా? విశాఖ పట్నానికా?

అమరావతి అన్నది మన రాజధాని. అక్కడ మోడీ గారు తెచ్చి పోసిన మట్టి నీళ్లు వున్నాయ. మనం వాటిని గౌరవించాలి. నాకు విశాఖ కూడా ఇష్టమే. నేను అందుకే ప్రత్యేకంగా గాజువాక నుంచి పోటీ చేసాను అని మీరు గమనించాలి. నేను ఒక్కోసారి ఒక్కడినే కూర్చుని ఆలోచిస్తుంటాను. ఏది గొప్ప. ఏది తక్కువ అని. మనిషికి ఆ ఆలోచనా విధానం కావాలి. నేను చాలా పుస్తకాలు చదివాను. అందువల్లే ఇలాంటి ఆలోచనా విధానం నాకు వచ్చింది.

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుతో కలుస్తారా? కలవరా?

నాకు చంద్రబాబుగారంటే గౌరవం వుంది. ఆయన పార్టీ వేరు కావచ్చు. విధానాలు వేరు కావచ్చు. కానీ ఆయన విజన్, అనుభవాన్ని మనం గౌరవించాలి. ఈ గౌరవం అంటే ఒకటి చెప్పాలి. నేను డిగ్రీ చదువుతున్నపుడు అనుకుంటాను, లెక్చరర్లను గౌరవించేవాడిని. ఆ రోజు నుంచే నాకు గురువులు అంటే గౌరవం. అప్పట్లో నేను కూడా టీచర్ లేదా లెక్చరర్ కావాలనుకున్నాను. 

మీరు నక్సలైట్లలో చేరాలని కదా అనుకున్నారని వార్తలు వచ్చాయి

అంటే నేను చాలా అనుకున్నాను. అసలు నన్ను, నా భావాలు చూసి మా వాళ్లు భయపడేవారు. వీడు ఏమైపోతాడా అని. కానీ నేను ఏమీ అయిపోలేదు. అందుకే అన్నయ్య నన్ను సిన్మాల్లోకి లాక్కొచ్చారు. అప్పుడు కూడా నేనేమీ హీరో అయిపోవాలి అనుకోలేదు.

కులాలకు అతీతమైన రాజకీయాల రావాలి అని, కులాలు కలవాలని మీరు అంటూ వుంటారు. అది సాధ్యమేనా

సాధ్యమే. అందుకు ముందుగా కులాంతరు, మతాంతర, దేశాంతర, ఖండాంతర వివాహాలు పెరగాలి. ఆ విధంగా కులాలు, మతాలు కలిసిపోవాలి. దానివల్ల రాజకీయాల్లో కూడా వాటి జోక్యం తగ్గిపోతుంది. నిజానికి నేను పదో తరగతి చదువుతున్నపుడు అనుకుంటాను. మా పక్కింటి వాళ్ల అమ్మాయి మతాంతర వివాహం చేసుకుంది. అప్పుడు నాకు అనిపించింది ఇది కదా మనకు కావాల్సింది అని.

ఇంతకీ మీ రాజకీయ ఫిలాసఫీ ఏమిటి?

నాకు ఫిలాసఫీ మీద పెద్దగా ఇంటస్ట్ లేదు. నెల్లూరులో వున్నపుడు అనుకుంటాను ఎవరో కొన్ని ఫిలాసఫీ ఫుస్తకాలు తెచ్చి ఇచ్చారు. కానీ నేను వాటిని పక్కన పెట్టి కవిత్వం చదవడం మొదలుపెట్టాను. నా ఫ్రెండ్ త్రివిక్రమ్ కు కూడా ఫిలాసఫీ కన్నా కెమిస్ట్రీ మీద పట్టువుంది. అందులో గోల్డ్ మెడలిస్ట్.తెలుసుకదా.  

మీకు అర్థమైన ఫిలాసఫీ ఏంటో, మీ ఫిలాసఫీ ఏంటో అర్థం అయింది సర్, ఇక సెలవు

సెలవు అంటే సరి కాదు అంటాను. మా నాన్నగారు డ్యూటీలో సెలవు పెట్టడం అంటే సరికాదు అనేవారు. నాకు అప్పట్లోనే అనిపించేది ఈ సెలవుల సిస్టమ్ ఏమిటి?

అవునా మహా ప్రభో..సెలవు..కాదు కాదు. బై..బై

(ఇదంతా ఊ..ఉత్తుత్తినే సరదాకి...మళ్లీ వచ్చేవారం మరో సెలబ్రిటీ ఇంటర్వూతో కలుద్దాం)  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?