Advertisement


Home > Politics - Political News
పవన్‌ చెప్పదల్చుకున్నదేమిటి?

నాలుగేళ్ల తరువాత కూడా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌లో ఏదైనా మార్పు వచ్చిందా? ఆయన ఏం చేయదల్చుకున్నాడో, ఏం చెప్పదల్చుకున్నాడో స్పష్టత వచ్చిందా? ఆయన అజెండా ఏమిటో అర్థమైందా? ఆయన పార్టీ సిద్ధాతమేమిటో తెలిసిందా? వీటన్నిటికీ ఒకే జవాబు 'నో' అని. దీన్ని పవన్‌ అభిమానులు అంగీకరించరు. అది సహజం. కాని ఏపీలో గత రెండు రోజుల్లో ఆయన ప్రసంగాలు విన్నవారికి ఆయనలో ఇంకా అస్పష్టత ఉందనే విషయం సులభంగానే అర్థమవుతుంది.

పవన్‌ చాలా విషయాలు కలగాపులగం చేసి మాట్లాడుతున్నారు. ఏ అంశం మీదా ఓ నిర్దిష్టమైన అభిప్రాయం లేదు. వైసీపీని, బీజేపీని వ్యతిరేకిస్తున్న విషయం స్పష్టమైనా టీడీపీని వ్యతిరేకిస్తున్నారా? ఇంకా మద్దతు ఇస్తూనే ఉన్నారా? అనే ప్రశ్నలకు సరైన జవాబు దొరకదు. తాను పోరాట యోధుడినని, నీతిమంతుడినని, ధైర్యవంతుడినని, సమాజసేవకుడినని బిల్డప్‌ ఇస్తున్నారు. ఆయన బిల్డప్‌ ఇస్తున్నారనే పదం వాడటానికి కారణం ఆయన చెప్పుకుంటున్న పవన్‌ కళ్యాణ్‌ ప్రజలకు కనబడటంలేదు కాబట్టి.

ఆయన పర్యటనకు వచ్చేముందు ఏపీకి చెందిన ఓ టీవీ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో 'పవన్‌ చాలారోజుల తరువాత ఇప్పుడొస్తున్నాడు. మళ్లీ ఎప్పుడొస్తాడో' అని దాంట్లో పాల్గొన్నవారు వ్యాఖ్యానించారు. ఆ చర్చలోనే పాల్గొన్న జనసేన పార్టీ ప్రతినిధి పవన్‌ మీద వచ్చిన విమర్శలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయాడు. తమ అధినేతను సమర్థించుకోవడానికి వాదించాడుగాని 'ఎస్‌.. ఈయన చెప్పింది కరెక్టే' అనుకునేవిధంగా వాదన లేదు.

వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు చేస్తూ 'సంపదను దోచుకునే వ్యక్తి, లంచాలు తీసుకునే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మొత్తం సమాజం అలా మారే ప్రమాదం ఉందని నాకు భయమేసింది' అన్నాడు. ఈ భయంతోనే ఆయన గత ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చానన్నాడు. అది ఆయనిష్టం. ఆయన అభిప్రాయాన్ని కాదనలేం.

జగన్‌ సంపద దోచుకున్నాడో, లంచాలు తీసుకున్నాడో ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాన్ని కోర్టు ఇంకా తేల్చలేదు. విచారణ పూర్తయి కోర్టు ఇచ్చే తీర్పునుబట్టి జగన్‌ ఏమిటనేది నిర్ణయించుకోవాలి. కాని ఏమీ తేలకముందే జగన్‌ను దోపిడీదారుడని పవన్‌ ఎలా ముద్ర వేశారు? కేసు కోర్టు విచారణలో ఉండగా ఈయన ఎలా నిర్ణయిస్తారు? ఈయన న్యాయమూర్తి కాడు. జనంలో తిరుగుతున్న నాయకుడూ కాదు. గత ఎన్నికల్లో టీడీపీ రాసిచ్చిన స్క్రిప్టును చదివేశారన్నమాట. గతంలో మూడుచోట్ల బహిరంగ సభలు నిర్వహించినప్పుడు ప్రత్యేక హోదా గురించి ఆవేశంగా మాట్లాడారు ఈ పవర్‌స్టార్‌. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడతానన్నారు.

ఇప్పటివరకు ఆ పని చేశారా? పోరాడేవారికి మద్దతు ఇచ్చారా? విశాఖ బీచ్‌లో విద్యార్థుల ఆందోళనకు పిలుపు ఇచ్చిన పవన్‌ అక్కడికి ఎందుకు హాజరు కాలేదు? ఈ ప్రశ్నలకు జవాబులు లేవు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రత్యేక హోదా ఇవ్వగలరా? తన లక్ష్యం ముఖ్యమంత్రి పదవి కాదన్నారు ఈయన. సమాజాన్ని, రాజకీయాలను మార్చడమే లక్ష్యమంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఆయన చెప్పిన నీతిసూత్రాలు జనసేన కార్యకర్తలకైనా అర్థమయ్యాయో లేదో.

గతంలో లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ ఇలాగే నీతిసూత్రాలు చెప్పి, సమాజంలో సమూల మార్పుల గురించి ఉపన్యాసాలిచ్చి తెరమరుగైపోయారు. లోక్‌సత్తా సామాజిక వేదికగా ఉన్నప్పుడు మంచి పేరొచ్చింది. యువతలో చైతన్యం వచ్చింది. దాన్ని రాజకీయ పార్టీగా మార్చిన తరువాత జేపీ తెరమరుగైపోయారు. పవన్‌ కళ్యాణ్‌ నీతిసూత్రాలు చెప్పాలనుకుంటే రాజకీయ పార్టీ పెట్టకుండా ఉండాల్సింది. నీతిసూత్రాలు చెప్పొద్దంటే అవినీతిగా ఉండమని అర్థం కాదు.

రాజకీయాల్లో ఉంటూనే నైతిక విలువలు పాటించాలి. తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశలేదని పవన్‌ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. సీఎం పదవి కావాలనుకోవడం పాప కార్యం కాదుగదా. తన ఆలోచనల ప్రకారం ప్రజలకు మేలు చేయాలనుకుంటే అధికారం అవసరం. జగన్‌ ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. పోరాటం చేస్తున్నారు. అలా స్పష్టమైన అజెండా ఉండాలి. నిర్ణయం ప్రజల చేతుల్లో ఉంటుంది. 

పవన్‌ ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారా? సమాజాన్ని మార్చడం కోసం రాజకీయాల్లోకి వచ్చారా? అనేది తెలియదు. ఆయన పర్యటనలో మనసులోని మాట బయట పెట్టారు. ఏమిటది? ప్రజారాజ్యం పార్టీ మాయం కావడానికి కారకులని తాను భావిస్తున్నవారి మీద పగ తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారు. చిరంజీవిని ముఖ్యమంత్రి కానివ్వకుండా చేసినవారి అంతు చూస్తానని స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో ఆయనకు క్లారిటీ ఉన్నట్లుగా కనబడుతోంది.