cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్.. నీ తండ్రి సీఎం కాదు, నీ అన్న..?

పవన్.. నీ తండ్రి సీఎం కాదు, నీ అన్న..?

కోడి వచ్చి గుడ్డును వెక్కిరించినట్టు.. వారసత్వాల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం ఒక ప్రహసనం. అయినా ఆయన మాట్లాడేవన్నీ ప్రహసనాలే కదా.. నవ్వుల పాలయ్యేలానే కదా.. పవన్ కల్యాణ్ మాట్లాడేది, ఇంకా కొత్తగా ఏముందంటారా? లేకపోతే.. ‘నా తండ్రి సీఎం కాదు..’ అని పవన్ కల్యాణ్ ఒత్తి పలకడం మరీ కామెడీగా ఉంది.

జగన్ మీదో లేక ఏ లోకేష్ మీదో.. ఇలాంటి సెటైర్ వేస్తే వేసి ఉండొచ్చు పవన్ కల్యాణ్. ఎలాగూ లోకేష్ మీద వేయడు. జగన్ మీదే! కాకపోతే.. ఇలా నవ్వుల పాలయ్యేలా మాట్లాడే ముందు పవన్ కల్యాణ్ కొంచెం ఆలోచించుకోవాల్సింది. అవును జగన్ తండ్రి సీఎం కాబట్టే.. జగన్ సీఎం కావాలని అనుకుంటున్నాడు అనుకుందాం. కానీ ఇక్కడ పవన్ కల్యాణ్ లాంటి మేధావి కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి.

అవేంటంటే.. జగన్ తండ్రి పార్టీని స్థాపిస్తే.. వారసత్వ హక్కుల కింద జగన్ దాన్ని సొంతం చేసుకోలేదు. తండ్రి చనిపోయిన తర్వాత.. అంతవరకూ ఉండిన పార్టీని వదిలి బయటకు వచ్చి జగన్ సొంత రాజకీయ పార్టీని పెట్టుకున్నాడు. సొంతంగా ఉప ఎన్నికలు ఎదుర్కొని రికార్డు స్థాయి మెజారిటీతో నెగ్గాడు. తర్వాత ఉప ఎన్నికలు వస్తే తన వెంట నిలిచిన వారిని గెలిపించుకున్నాడు.

సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొని 67మంది ఎమ్మెల్యేలను, 9మంది ఎంపీలను తన పార్టీ తరఫున గెలిపించుకుని.. జగన్ తన సత్తా ఏమిటో నిరూపించాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్ తండ్రి స్థాపించినది కాదు. జగన్ స్థాపించుకున్నది అని పవన్ కల్యాన్ కు తెలియదేమో పాపం. మరి జగన్ వైపు వేలెత్తి చూపుతున్న పవన్ కల్యాణ్ ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది.

తన అన్న చిరంజీవి సినిమా హీరో కాకపోయుంటే.. మెగాస్టార్ గా ఎదగకపోయుంటే.. తన పరిస్థితి ఏమిటో పవన్ కల్యాణ్ ఆలోచించుకోవాల్సింది. ‘నేను నా తండ్రి పేరు చెప్పుకోలేదు..’ అని చెప్పుకోవడం పవన్ కల్యాణ్ ఉద్దేశం కావొచ్చు. కాకపోతే అన్న పేరు చెప్పుకుని తను సినిమాల్లోకి వచ్చాను అని పవన్ కల్యాణ్ దాచేయాలని అనుకుంటున్నాడేమో!

అన్న వారసత్వం లేకపోతే అనామకుడిగా మిగలాల్సిన పవన్ కల్యాణ్.. వేరే వాళ్లను వారసత్వం విషయంలో గేలి చేసి మాట్లాడుతూ ఉంటే, సొంత పార్టీలతో సత్తా చాటిన వాళ్లను వెక్కిరిస్తూ ఉంటే.. జనాలు నోళ్లతో నవ్వడం లేదు! ఈ విషయాన్ని జనసేన అధినేతకు అర్థమయ్యేలా చెప్పాలి పక్కనున్న వాళ్లైనా!