cloudfront

Advertisement


Home > Politics - Political News

బాబూ.. నీ బామ్మర్దిని అదుపులో పెట్టుకో

బాబూ.. నీ బామ్మర్దిని అదుపులో పెట్టుకో

పవన్ కల్యాణ్ విమర్శలు ఎప్పుడూ చంద్రబాబు, లోకేష్ చుట్టూనే తిరుగుతుంటాయి. అడపాదడపా ఎప్పుడైనా ఆయా నియోజకవర్గాలకు వెళ్తే స్థానిక నేతలపై కూడా విమర్శల బాణాలు ఎక్కుపెడుతుంటాడు జనసేనాని. కానీ ఈసారి ఆయన దృష్టి నందమూరి బాలకృష్ణపై పడింది. బాబూ బామ్మర్దిని అదుపులో పెట్టుకో అంటూ చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు పవన్ కల్యాణ్.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన జనసేన పోరాటయాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "ముఖ్యమంత్రిగారి వియ్యంకుడు బాలకృష్ణ గారు జనసేన సభలకు వచ్చేది అలగా జనం, సంకరజాతి వాళ్లు అని తిడుతున్నారు. ఆయన్ని అదుపు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉన్నా పట్టించుకోవడం లేదు, జనసేన ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోదు" అని అన్నారు.

బాలకృష్ణపై పవన్ విమర్శలు చేయడం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో మహిళలపై బాలకృష్ణ వ్యవహరించిన తీరు, ప్రధాని మోదీని బాలయ్య బూతులు తిట్టిన విధానాన్ని పవన్ విమర్శించారు. ఇప్పుడు మరోసారి బాలయ్య భాషపై పవన్ విమర్శలు ఎక్కుపెట్టారు. మాటలు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తూనే, బామ్మర్దిని చూసుకునే బాధ్యత బాబుదే అంటూ చురకలు అంటించారు.

టీడీపీది కుల దూషణ అని అంటున్న పవన్, మాది కులాల ఐక్యత అంటూ చెప్పుకొచ్చాడు. తనపై ఉన్న కులం ముద్రను ఎలాగోలా చెరిపేసుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పవన్ కల్యాణ్. అందుకే తన సామాజిక వర్గం వారిని తప్ప మిగతా అందరితోనూ ఆయన బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసి నేను మీవాడినే అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే పవన్ చేస్తున్న విమర్శలు తిరిగి ఆయన మెడకే చుట్టుకోవడం విచిత్రం. రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలిపేలా ప్రవర్తించలేదని అంటున్న పవన్ కి, 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకునే సమయంలో ఆ విషయం ఎందుకు గుర్తుకురాలేదని జనం నిలదీస్తున్నారు.

గత్యంతరం లేక, మరో ప్రత్యామ్నాయం కనిపించక, బాబు అనుభవాన్ని నమ్మి అప్పట్లో టీడీపీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందంటూ పవన్ పదేపదే కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం నమ్మడంలేదు. 

వెనక్కి చూడకుండా పారిపో!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్