cloudfront

Advertisement


Home > Politics - Political News

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ లో పవన్ కూడా భాగమేనా?

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ లో పవన్ కూడా భాగమేనా?

రిటర్న్ గిఫ్ట్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తరచుగా వాడుతున్న పదం. తెలంగాణ ఎన్నికల్లో తమకు పోటీగా నిలిచిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని 2-3 సందర్భాల్లో కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ఈ ప్రకటన చేసిన వెంటనే అంతా జగన్ వైపు చూశారు. వైసీపీకి మద్దతుగా ఏపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొంటారని అంతా భావించారు. అందులో కొంత నిజం కూడా ఉంది. అయితే టీఆర్ఎస్ మద్దతిచ్చేది కేవలం వైసీపీకి మాత్రమేకాదు, పవన్ స్థాపించిన జనసేనకు కూడా మద్దతిచ్చే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పాల్గొనలేదు. ఏదో ఒక పార్టీకి మద్దతిచ్చేలా ప్రకటన కూడా చేయలేదు. స్థూలంగా చెప్పాలంటే న్యూట్రల్ గా వ్యవహరించింది. అలా పరోక్షంగా టీఆర్ఎస్ కు సహకరించింది జనసేన. ఇందుకు కృతజ్ఞతగా రాబోయే ఏపీ ఎన్నికల్లో అంతోఇంతో జనసేనకు కూడా సాయంచేసి పవన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బయటపెట్టడం విశేషం.

పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల జనసైనికులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పవన్.. టీఆర్ఎస్ మద్దతిచ్చే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. గతంలో తమ పార్టీకి అస్సలు సీట్లు రావని చెప్పిన నేతలే తర్వాత వాస్తవాలు గ్రహించారని, టీఆర్ఎస్ నేతలతో మాట్లాడిస్తున్నారని పవన్ చెప్పుకొచ్చారు. జనసేన పార్టీకి బలం పెరిగిందని చెప్పే క్రమంలో టీఆర్ఎస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారనే విషయాన్ని బయటపెట్టారు పవన్.

రాబోయే ఎన్నికల్లో ఏపీలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్.. కొన్ని స్థానాల్లో కలిసొచ్చే పార్టీల్ని, నేతల్ని కలుపుకుపోతామని ప్రకటించారు. అంటే.. పూర్తిస్థాయిలో పొత్తులు లేకపోయినా.. నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థుల బలాబలాల బట్టి పొత్తులు పెట్టుకుంటారన్నమాట.

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?