cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అమ‌రావ‌తికి ప‌వ‌న్ అనుకూల‌మా? వ‌్య‌తిరేక‌మా?

అమ‌రావ‌తికి ప‌వ‌న్ అనుకూల‌మా? వ‌్య‌తిరేక‌మా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌ధాని అమ‌రావ‌తికి అనుకూల‌మా? వ‌్య‌తిరేక‌మా?...ఇప్పుడు అంద‌రిలో క‌లుగుతున్న అనుమానం. దీనికి ప‌వ‌న్ ప్ర‌క‌ట‌నే కార‌ణం. మూడు రాజ‌ధానుల బిల్లుల‌కు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఆమోద ముద్ర వేసిన నేప‌థ్యంలో జ‌న‌సేనాని, టాలీవుడ్ అగ్ర‌హీరో అయిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న‌దైన స్టైల్‌లో స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు

"నిర్ణ‌యానికి ఇది స‌మ‌యం కాదుః ప‌వ‌న్‌క‌ల్యాణ్‌"...శీర్షిక చ‌దివితే ఎవ‌రైనా ఎలా అర్థం చేసుకుంటారు?  మూడు రాజ‌ధానుల ఏర్పాటులో భాగంగా అమ‌రావ‌తిలోని స‌చివాల‌యం, ఇత‌ర‌త్రా ఎగ్జిక్యూటివ్ కార్యాల‌యాలు విశాఖ‌కు త‌ర‌లించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ స్పంద‌న ఆస‌క్తిక‌రంగా మారింది. అమ‌రావ‌తిని త‌ర‌లించ‌డం అన్యాయ‌మ‌నో, అవివేక‌మ‌నో, కుద‌ర‌ద‌నో ప‌వ‌న్ అన‌డం లేదు. నిర్ణ‌యానికి ఇది స‌మ‌యం కాదంటే....మ‌రో స‌మ‌యంలో త‌ర‌లించ‌వ‌చ్చ‌ని క‌దా ఆయ‌న అభిప్రాయం. రాజు చిన్న భార్య మంచిదంటే...మ‌రి పెద్ద భార్యో? అనే ప్ర‌శ్న వెంట‌నే దూసుకొచ్చిన‌ట్టు...ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌పై కూడా అలాంటి ప్ర‌శ్న‌లు, అనుమానాలు వేగంగా మ‌న‌సులోకి దూసుకెళ్లేలా ఉన్నాయి.

ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న మొత్తం సారాంశాన్ని ఒక్క మాట‌లో చెప్పాలంటే....కోవిడ్ విజృంభిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో రాజ‌ధాని మార్పు స‌రైంది కాదు....అది అదుపులోకి వ‌చ్చిన త‌ర్వాత చేప‌ట్టి ఉండొచ్చు క‌దా అని. దీన్నిబ‌ట్టి అమ‌రావ‌తి త‌ర‌లింపు నిర్ణ‌యంపై ఆయ‌న‌కు అభ్యంత‌రం లేన‌ట్టే అని అర్థం చేసుకోవాల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న త‌ర్వాత రాజ‌ధాని విష‌యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో అనూహ్య‌మైన మార్పు వ‌చ్చింది. చివ‌రికి గ‌త ఫిబ్ర‌వ‌రిలో అమ‌రావ‌తి రైతుల‌కు మ‌ద్ద‌తుగా లాంగ్‌మార్చ్ చేస్తాన‌న్న ప‌వ‌న్‌....ఆ త‌ర్వాత ఆ ఊసే ఎత్త‌క‌పోవ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు.

ప్ర‌స్తుత ఆయ‌న తాజా ప్ర‌క‌ట‌న‌లో కూడా చంద్ర‌బాబునే ఎక్కువ‌గా త‌ప్పు ప‌ట్ట‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌లో ఏముందో తెలుసుకుందాం.

"ప్ర‌జ‌ల‌ను కరోనా పీడిస్తున్న ప‌రిస్థితుల్లో మూడు రాజ‌ధానుల‌పై నిర్ణ‌యానికి ఇది స‌మ‌యం కాదు. అమ‌రావ‌తి రైతుల ప‌క్షాన జ‌న‌సేన చివ‌రి వ‌ర‌కు పోరాడుతుంది. 33 వేల ఎక‌రాల మెగా రాజ‌ధానిని త‌ర్వాత వ‌చ్చే ప్ర‌భుత్వాలు ముందుకు తీసుకెళ్ల‌క‌పోతే రైతుల ప‌రిస్థితి ఏంట‌ని నాడు ప్ర‌శ్నించింది జన‌సేనే. మూడు పంట‌లు పండే సార‌వంత‌మైన భూముల్లో భ‌వ‌నాల నిర్మాణం అన‌ర్థ దాయ‌క‌మ‌ని చెప్పింది కూడా మేమే. కేవ‌లం మూడున్న‌ర వేల ఎక‌రాల‌కు రాజ‌ధానిని ప‌రిమితం చేసి ఆ త‌ర్వాత స‌హ‌జ విస్తృతికి అవ‌కాశం క‌ల్పిస్తే ప్ర‌స్తుతం ఈ రైతులు క‌న్నీరు పెట్టే ప‌రిస్థితి ఏర్ప‌డేది కాదు" అని ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు.

ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న అంశాల‌ను బ‌ట్టి ప్ర‌స్తుత రాజ‌ధాని త‌ర‌లింపున‌కు నాడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణ‌యాలే కార‌ణ‌మ‌ని చెప్ప‌క‌నే చెప్పారు. నాడే తాను చెప్పిన‌ట్టు విని వుండే నేడు ఈ దుస్థితి ఉండేది కాదు క‌దా అని ఆయ‌న‌లోని అవేద‌న క‌నిపిస్తుంది. ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎంతో ముందుగా ఊహించే నాడే హెచ్చ‌రించాన‌ని ఆయ‌న గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం.

అంతే త‌ప్ప ప్ర‌స్తుత రాజ‌ధాని త‌ర‌లింపును అడ్డుకుంటామ‌నో, మ‌రేదో చేస్తామ‌నో ఆయ‌న ప్ర‌గ‌ల్భాలు ప‌ల‌క‌క‌పోవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకొంది. మొత్తానికి ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న చూసిన త‌ర్వాత...అమ‌రావ‌తికి ఆయ‌న అనుకూల‌మా? వ‌్య‌తిరేక‌మా? అనే సందేహాలు రాక మాన‌వు. వేలాది పుస్త‌క జ్ఞానంతో వెల్ల‌డించిన అభిప్రాయాల్ని సామాన్యులు ఒక ప‌ట్టాన అర్థం చేసుకోవ‌డం క‌ష్ట‌మే మ‌రి!

రామ్ గోపాల్ వర్మని మించిన సక్సెస్ ఫుల్ పర్సన్ ఎవరూ లేరు

 


×