cloudfront

Advertisement


Home > Politics - Political News

లెక్కలు ఇవ్వకుంటే నిజాలు తెలియవా?

లెక్కలు ఇవ్వకుంటే నిజాలు తెలియవా?

పాలకులను ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటివరకు ఆ పనిని నామమాత్రంగా చేశారు. కేంద్రాన్ని, రాష్ట్రాన్ని అడగాల్సిన చాలా ప్రశ్నలు అడగలేదు. ప్రశ్నలు అడగనప్పుడు పోరాటాలు చేసే ఆలోచన కూడా ఉండదు కాబట్టి అవీ చేయలేదు. జనం రోడ్ల మీదికి రావడం, బంద్‌లు చేయడం ఆయనకు నచ్చవు. ఇప్పటివరకు సమస్యలను అధ్యయనం చేయడం, వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం, పరిష్కరించాల్సిందిగా అభ్యర్థించడం మొదలైన పనులు చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ మొన్నటివరకు సినిమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి పాలకులను ప్రశ్నించలేకపోయారేమో. సరే... ఇప్పుడు రంగంలోకి దిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను లెక్కలు అడుగుతున్నారు. ఇందుకు ఈనెల 15వ తేదీ వరకు గడువు విధించారు. లెక్కలన్నీ కంప్యూటర్లలో, వెబ్‌సైట్లలో రెడీగా ఉంటాయి కాబట్టి వెంటనే ప్రింటవుట్లు ఇచ్చేస్తారని పవన్‌ అభిప్రాయం. 'కేంద్రంగాని, రాష్ట్రంగాని నిధుల విషయంలో అబద్ధాలు చెప్పడంలేదు. కాని నిజాలు చెప్పవు' అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నది వాస్తవం. 

కేంద్రం లెక్కలను బీజేపీ ఎంపీ కమ్‌ పార్టీ అధ్యక్షుడు హరిబాబు, రాష్ట్ర ప్రభుత్వం లెక్కలను టీడీపీ నేతలు విడుదల చేయగా అన్ని పత్రికలు ప్రచురించాయి. రెండు పార్టీలూ పక్కాగా తయారుచేసుకున్న తరువాతనే ఈ లెక్కలు విడుదల చేశాయి. పవన్‌ కళ్యాణ్‌కు ఈ లెక్కలే ఇస్తాయి తప్ప వీటికి మించిన లెక్కలు ఏవో ఇస్తాయని అనుకోలేం. లెక్కలిస్తే ఎవరు అబద్ధమాడుతున్నారో, ఎవరు నిజం చెబుతున్నారో తేల్చడం పవన్‌ ఉద్దేశం. నిజానికి కేంద్రం విభజన చట్టం ప్రకారం చేయాల్సిన సాయం చేయలేదు. ఇచ్చిన హామీలు సంపూర్ణంగా నెరవేర్చలేదు. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించాలి.

ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఖర్చు చేసిందా? ఈవిధంగా ఖర్చు చేశామని కేంద్రానికి లెక్కలు పంపిందా? దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకాలపై పవన్‌ ఇప్పటివరకు ప్రశ్నించలేదు గాని ఆ పని చేసినవారు చాలామంది ఉన్నారు. పవన్‌ ఎంపిక చేసుకున్న ఉండవల్లి, డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణే కాకుండా, మొన్నటివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఐవైఆర్‌ కృష్ణారావు, మరో మాజీ ఐఏఎస్‌ శర్మ తదితరులున్నారు. వీరంతా విభజన చట్టాన్ని, అందులోని సెక్షన్‌లను, హామీలను కూలంకషంగా అధ్యయనం చేసినవారు. 

రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఎలా ఖర్చు చేస్తోందో, ఎంత దుబారా చేస్తోందో స్టడీ చేసినవారు. వీరితో ఓ వారంపాటు మాట్లాడితే, చర్చిస్తే పవన్‌కు విషయాలు అర్థంకావా? నిజాలు చెప్పని ప్రభుత్వాల కంటే వీరు బెటర్‌ కదా. 'హోదాతో లాభం కంటే నష్టమే ఎక్కువ'.. 'మూర్ఖంగా వెళితే నష్టపోతాం'.. మనమే ఎక్కువ సాధించాం...' సయోధ్యతోనే సాధ్యమైంది'.. అని చంద్రబాబు గతంలో అన్నారు. ఇలా ఎందుకు మాట్లాడారని చంద్రబాబును ముందుగా పవన్‌ ప్రశ్నించాలి. ఎక్కువ నిధులు సాధించామని చెప్పిన బాబు ఇప్పుడు కేంద్రం అన్యాయం చేసిందని ఏ ఆధారాలతో అంటున్నారు? దీనిపై ప్రశ్నించాలి.

కేంద్రం అన్ని ఇచ్చిందంటూ ఏపీ అసెంబ్లీ మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం కూడా చేసింది. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడికి సన్మానాలు చేశారు. ఇంత చేశాక ఇప్పుడు అన్యాయం జరిగిందనడం పెద్ద అబద్ధమే కదా. మరి పవన్‌ ఎప్పుడూ ఎందుకు ప్రశ్నించలేదు? పోలవరంపై శ్వేతపత్రం అడిగితే వెబ్‌సైట్లో వివరాలున్నాయి చూసుకోండని ప్రభుత్వం చెప్పిందని పవన్‌ అన్నారు.

ఈయన అడిగే లెక్కలు కూడా వెబ్‌సైట్లో ఉంటాయి కదా. అవే చూసుకోమంటారుగాని కూర్చోబెట్టుకొని వివరిస్తారా? లెక్కలు ఇచ్చినా ఇవ్వకపోయినా జనం పట్టించుకోరు. ఆయన కార్యాచరణ ఏమిటనేదే ప్రధానం.