Advertisement

Advertisement


Home > Politics - Political News

తెలంగాణలో తెరపైకి పవన్ కల్యాణ్?

తెలంగాణలో తెరపైకి పవన్ కల్యాణ్?

పొత్తు అనండి, స్నేహం అనుకోండి, పవన్ కల్యాణ్ ని పగడ్బందీగా వాడుకునే ప్యాకేజీ అనుకోండి.. ఓవరాల్ గా ఏపీలో పవన్ కల్యాణ్ ని బాగానే వాడుకుంటోంది బీజేపీ. టీడీపీ అయినా, బీజేపీ అయినా.. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అనే తరహాలోనే పవన్ ఉంటారు కాబట్టి.. ఆయనకూ పెద్దగా సమస్యేమీ లేదు. 

అయితే ఇప్పుడు పవన్ వాడకాన్ని ఏపీ నుంచి తెలంగాణకు కూడా విస్తరించాలనుకుంటోంది బీజేపీ. ప్రస్తుతానికి ఇది అతిశయోక్తిలా అనిపించొచ్చు కానీ.. జాతీయ నాయకుల యాక్షన్ ప్లాన్ మాత్రం ఇదే అని తెలుస్తోంది. దీనికి కారణం ఈటల రాజేందర్ బీజేపీ చేరిక.

టీఆర్ఎస్ లో ప్రభావవంతమైన నేతగా ఎదిగి, కీలక మంత్రి పదవిలో ఉంటూ పదవీచ్యుతుడైన ఈటల, బీజేపీకి మకాం మార్చారు. బీజేపీతో ఆయనకు అవసరం ఉంది, ఆయన చేరికతో బీజేపీకి కూడా బలం పెరిగే అవకాశం ఉంది. అయితే తెలంగాణ బీజేపీ నేతలు అంత త్వరగా ఈటలతో కలసిపోతారా..? తెలంగాణ బీజేపీలో ఈటల పొజిషన్ ఏంటి..? నెంబర్ 2నా, నెంబర్3నా, లేక ఇంకా కిందకు దించేస్తారా..? 

ఉన్నఫళంగా ఈటల బీజేపీలోకి వచ్చేస్తే.. పాతకాపులు ఉడుక్కుంటారు. సరిగ్గా ఇక్కడే బీజేపీ తన మాస్టర్ ప్లాన్ అమలు చేసే ఆలోచనలో ఉంది. నేరుగా ఈటలను తెచ్చి తెలంగాణ బీజేపీ నాయకత్వానికి జతచేయడం కంటే.. పవన్-ఈటల కాంబినేషన్ ను తెరపైకి తెస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోంది అధిష్టానం.

నిన్నమొన్నటి వరకూ కిషన్ రెడ్డి సహా.. బీజేపీ నేతలందర్నీ చెడామడా తిట్టిన ఈటల ఒక్కసారిగా వారితో చెట్టపట్టాలేసుకుని తిరగాలంటే సాధ్యం కాదు. వారితో జతకట్టి కేసీఆర్ ని, టీఆర్ఎస్ ని ఆ స్థాయిలో తిట్టలేరు. అందుకే మధ్యేమార్గంగా పవన్ ను తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కేంద్ర నాయకత్వం ఉంది. పవన్-ఈటల కాంబినేషన్ తో తెలంగాణ భవిష్యత్ రాజకీయాలు చేయాలనుకుంటోంది బీజేపీ.

ఈ ప్రతిపాదనకు పవన్ సై అంటారా..?

ఒకవేళ బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ ప్రతిపాదన తీసుకొస్తే పవన్ ఒప్పుకుంటారా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఏపీ సర్కారుపై రంకెలేసే పవన్ కల్యాణ్, తెలంగాణ విషయానికొచ్చేసరికి మాత్రం మెతకగా మారిపోతారు. పైపెచ్చు కేసీఆర్, కేటీఆర్ ను పొగిడిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఈటలతో కలిసి పవన్, తెలంగాణలో రాజకీయం చేస్తారా అనేది చూడాలి.

అదే సమయంలో పవన్ రాజకీయ నిర్ణయాలు ఎవరి అంచనాలకు అందవు. బీజేపీ కోసం ఏకంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్నే వదలుకున్నారాయన. అభ్యర్థులకు ఇచ్చిన బీఫారాలు కూడా వెనక్కి తీసుకున్నారు. ఇటు తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా చివరివరకు బతిమిలాడి, బీజేపీ కాదనే సరికి సైలెంట్ అయిపోయారు. ఆ వెంటనే ప్రచారానికి కూడా వచ్చి హంగామా చేశారు.

కాబట్టి బీజేపీ కేంద్ర నాయకత్వం కనుసైగ చేస్తే చాలు, తూచ తప్పకుండా పాటించే పవన్ కల్యాణ్.. తెలంగాణలో కూడా రాజకీయాలు చేయడానికి ఏమాత్రం వెనకాడరు. నిర్ణయించాల్సింది కేంద్ర బీజేపీనే. పవన్ ఆల్వేజ్ రెడీ. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?